తెలంగాణ అసెంబ్లీలో ఒక చిత్రం జరగబోతున్నది.
గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎపుడూ జరగనిది ఇపుడు రాబోతున్నది. రూలింగ్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎఐఎంఐఎంకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
హైదరాబాద్ కే పరిమితమయిన ఎఐఎంఐఎం కు సభలో ఎపుడూ ఏడు సీట్లు మించవు. అందువల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుందని పార్టీ నాయకత్వం కలలో కూడా వూహించి ఉండదు.
ఇపుడు ఫిరాయింపుల స్వర్ణయుగం కాబట్టి ప్రజాస్వామిక అంచనాలన్నీ తారుమారవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి మెజారిటీ సభ్యులు రూలింగ్ పార్టీలోకి ఫిరాయిస్తున్నందున ఆ పార్టీకి ప్రతిక్ష హోదా నిలిచేలా కనిపించడం లేదు. ఈపార్టీ నుంచి 13 మంది వెళ్లిపోతే, అసెంబ్లీలో అధికారకంగా ప్రతిపక్షం అనేది ఉండదు.
అయితే, సభలో అపుడు చిన్న ఎఐఎంఐఎం పెద్ద పార్టీ అవుతుంది. ప్రతిపక్ష పార్టీ హోదా అర్హత లేకపోయినా, ప్రభుత్వం అనకుంటే ప్రకటించవచ్చు. ఇది మిత్ర పక్షం కాబట్టి ముఖ్యమంత్రి కెసియార్ హ్యాపీతా ఎంఐఎం కు ఈ కానుక సమర్పించవచ్చు. దీనికి రంగం సిద్ధమవుతూ ఉందని తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందు ప్రటించి గోడదూకుతున్నారు. జనంలో ఒక వైపు వాళ్ల రాజకీయాల మీద వ్యతిరేకత వచ్చినా, రాళ్లు పడినా ప్రభుత్వ అండ ఉంటుందని కాంగ్రెస్ సభ్యులు రూలింగ్ పార్టీలోకి ఫిరాయించేందుకే సిద్దమవుతున్నారు.
ఇప్పటికే పది మంది సభ్యులు వుడాయించారు. మరొక ముగ్గురు ఎంఎల్ఏలు బేరాసారాలు పూర్తి చేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి కెసియార్ దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకుని వచ్చాక ఫిరాయింపుదారులకు కండువా అందిస్తారని అనుకుంటున్నారు. ఆ తర్వాత మరికొందరు కూడా నియోజకవర్గాల అభివృద్ధి అంటూ టి ఆర్ ఎస్ లోకి మారతారని అంటున్నారు.
2018ఎన్నికల్లో కాంగ్రెస్ కు 19సీట్లు వచ్చాయి. వీరిలో 13 మంది పోతే, మిగిలేది 6 అరుగురు మాత్రమే. ఇది ఎఐఎంఐఎం కంటే ఒక సీటు తక్కువ. ఆ లెక్కన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ నుంచి తప్పించి ఎఐఎంఐఎం నేతకు ఇవ్వాలి. ఇపుడు అసెంబ్లీ లో ఎంఐఎం పార్టీకి ఏడుగురు సభ్యులున్నారు.
కాంగ్రెస్ పార్టీ ని దారుణంగా చిత్తు చేసి అవమానించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అయితే, ఈ పద్ధతిలో కాకుండా, సీట్లు నిజంగా గెల్చి కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించి, ప్రజలచేత ప్రతిపక్ష హోదా రాకుండా చేసి ఉంటే బాగుండేది.
బంగారు తెలంగాణ కోసం పార్టీ మారుతున్నా, ఫిరాయింపుల ప్రోత్సాహం కిందకే వస్తుంది.