“ఈ ప్రపంచం లో మన ఆలోచనలకంటే ఎక్కువగా మనల్ని కష్టపెట్టే విషయం మరొకటి లేదు”
నిజానికి మనిషికి ఆలోచన అవసరం. అది మంచిది. అనాలోచితంగా చేసే పనులు తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించడం మన సమస్యలకు సమాధానమివ్వక పోగా, లేని సమస్యల్ని సృష్టించే అవకాశం ఎక్కువ.
అందుకే అన్నివిషయాల్లాగే అతిగా ఆలోచించడానికీ వర్తిస్తుంది, “అతి సర్వత్రా వర్జయేత్”
అతిగా ఆలోచించడమన్నది ఏం చెడు చేస్తుంది అనొచ్చు. అయితే ఒక విషయం పట్ల తిరిగి తిరిగి అదే ఆలోచన చేస్తున్నప్పుడు, సమస్యల్ని పరిష్కరించని ఎడతెగని ఆలోచనలు మానసిక శక్తిని హరించినపుడు అతిగా ఆలోచించడం వల్ల జరిగే కీడు తెలుస్తుంది. ఓక విషయాన్ని పదేపదే ఆలోచిస్తూ ఒక్కసారి వున్నట్లుండి “ఆబ్బా” అని నిట్టూర్పు విడిచిన సన్నివేశాలెన్ని వున్నాయో గుర్తు చేసుకోండి.
అతిగా ఆలోచించడమంటే ఏమిటి ?
ఒక విషయాన్ని విశ్లేషించడం, దానిమీద పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేసుకోవడం , సమస్యలకు సమాధానం చేకూర్చే దిశలో కార్యాచరణ మొదలు పెట్టక మళ్ళీ మొదట్నుంచి ఆలోచించుకుంటూ రావడం …ఇదొక వలయం. ఈ వలయం లోంచి బైటికి రాలేక పోతే ఇది మన మానసిక శక్తిని హరించి, మనల్ని నిర్వీర్యులు గా మార్చి ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితి కి చేరుస్తుంది. మరి దీన్నుంచి బయట పడే దెలా ?
సంఘం లో మనకెదురయ్యే చిన్న చిన్న సవాళ్ళు, ఆఫీసుల్లో జరిగే విషయాలు, బంధువులూ, స్నేహితుల ప్రవర్తనా, వ్యాఖ్యానాలూ సమాధానం దొరకని సమస్యలు, రోజంతా ఆలోచనే…ఏం సాధిస్తాం ?
ఈ ప్రక్రియకి చెక్ పెట్టి, దీన్ని మన అదుపులో వుంచుకోవాలి. ఎలా?
మొట్టమొదట మనం మన ఆలోచనల పట్ల సరియైన అవగాహన పెంచుకోవాలి.
అంటే ఏదైనా విషయం గురించి ఆలొచిస్తున్నపుడు, అలోచించిందే అలోచిస్తున్నామా? మళ్ళీ మొదటికొస్తున్నామా? అని విశ్లేషించుకోవాలి. ఈ అవగాహన మనం అతిగా ఆలోచించడాన్ని ఆపడానికి మొదటి మెట్టు అవుతుంది. ఈ అవగాహన వుంటే మనం చుట్టూ తిరిగి మళ్ళీ అదే ఆలొచనల వలయం లోకి ప్రవేశిస్తున్నామని తెలుసుకో వచ్చు. అక్కడ ఆగిపోవాలి.
రెండోది, “ఒకవేళ … అలా…. జరిగితే?” “ఒకవేళ… ఇలా …అయితే?” అనే వాదోపవాదాలు కట్టి పెట్టాలి. ఈ “ఒక వేళ” అనే భవిష్యత్తు గురించిన వూహలు భయం వల్ల కలిగేవి. అసలు జరుగుతాయో లేదో తెలీని అనవసర కల్లోలాలను ఒక చొటికి చేర్చడం వల్ల లేని సమస్యల్నీ, రాని సమస్యల్ని వూహించి నీరసించి పోతాం. ఈ ప్రక్రియను ఆపాలి. అతిగా ఆలోచించడం మానాలి.
మొదట్లో అవగాహన అనుకున్నాం. ఒక విషయం ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ మొదటి కొస్తున్నాం అని తెలియగానే ఆలోచనల్ని మరో వైపు మళ్ళించాలి. ఏదైనా వుత్సాహాన్ని కలిగించె విషయన్ని చేపట్టాలి. ఇది సంగీతమే కావచ్చు, పుస్తకమే కావచ్చు, గళ్ళ నుడి కట్టు కావచ్చు ఒక ఆటకావచ్చు లేదా వాకింగ్ కావచ్చు.
ఇక ఆలోచించేటప్పుడు, వాస్తవికతకు దగ్గరగా వుండేట్లు చూసుకోవాలి. అతిగా ఆలోచించే కొద్దీ విషయాలూ సమస్యలూ పెద్దవిగానూ సమధానం లేనివిగానూ కనిపించే అవకాశం ఎక్కువ. గోరంతలు కొండంతలవుతాయి. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు వచ్చిందా? అప్పట్లో దానికి సమాధానం దొరికిందా? ఇప్పుడున్న పరిస్థితి ఓ సంవత్సరం తరువాత ఇంతే వత్తిడి కలుగ చేస్తుందా? లాంటి విషయాలు ఆలోచిస్తే ఇలాంటివెన్నో వచ్చాయి, వెళ్ళాయి అనే విషయాలు తెలుస్తాయి.
ఇకపోతే మనం పరిపూర్ణత గురించి ఆలొచించడం మానేయ్యాలి.ప్రతీది పర్ఫెక్ట్ గా వుండాలనుకోకూడదు.
మనం చేసే పనిలొ ఎవ్వరూ ఏలాంటి లోపాన్ని ఎత్తిచూపకూడదు అనుకుంటే మనం అసలా పనిని చేయనే చేయలేము అన్నాడు కార్డినల్ న్యుమాన్ అనే మహాను భావుడు. ఈ ప్రపంచం లో ఎవ్వడూ పర్ఫెక్ట్ కాడు కాబట్టి పర్ఫెక్షనిజం కి ప్రాముఖ్యత ఇచ్చి అనవసరంగా ఆలోచించడం వదిలేయాలి
భయాన్ని వదిలేయాలి. ఆంటే గతం లో ఇలా జరిగింది కదా మళ్ళీ అలాగే జరుగుతుందేమో లేక మళ్ళీ ఫెయిల్ అవుతామనో భయం వల్ల కూడా ఎక్కువగా ఆలోచిస్తాం. గతంలో పరిస్థితులు సానుకూలంగా లేవు కాబట్టి అలా జరిగి వుండొచ్చు. మళ్ళీ అలాగే జరుగుతుందేమో అని అతి గా ఆలోచించకూడదు. భవిష్యత్తు లో ని విషయాలన్నీ మనం అనుకున్నట్లు జరగాలని, వాటిని మన ఆధీనం లో వుంచుకోవాలనుకోవడం వల్ల కూడా ఎక్కువగా ఆలోచిస్తాం. ఈ ఆలోచనా సరళిని మానాలి.
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పాడు చేసుకోకూడదు. నేను చేయగల్గింది చేశాను నాలో శక్తి వున్నమేరq నేను లోటు చేయలేదు అని మనల్ని మనం సమర్థించుకోగలగాలి. తగినంత వ్యామం మంచి నిద్ర ప్రశాంతంగా వుండటం అలవాటు చేసుకుని అతిగా ఆలొచించడం మానేయ్యాలి. మన పెద్ద వాళ్ళు ఏనాడో చెప్పారు
“కానున్నది కాక మానదు వేయేళ్ళు చింతించినన్”
-అహ్మద్ షరీఫ్
Mob: +91 9849310610