ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11 పోలింగ్ కు పోలో మని తరలి వస్తున్న జనాన్ని అడ్డుకునేందుకు ఒక పెద్దకుట్ర జరిగిందని,అయితే దానిని సకాలంలో భగ్నం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఈ రోజు అమరావతిలో హ్యాపీ రిసార్ట్స్ లో జరిగిన నియోజవర్గాల సమీక్షా సమావేశంలో కుట్ర ఎలా జరిగిందో, దానిని తెలుగుదేశం పార్టీ ఎలా భగ్నం చేసిందో ఆయన వివరించారు.
2019 ఎన్నికల్లో 1985 ఫలితాలు పునావృతమవుతున్నాయని అన్నారు.ఆయన వెల్లడించిన వివరాలివి:
‘బిజెపికి పోయేదేమీ లేదు కాబట్టి ఏదో విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని, టిడిపికి నష్టం చేయాలని నరేంద్ర మోడి చేయని ప్రయత్నం లేదు. అదే బిజెపి ధ్యేయం. కెసిఆర్ కూడా టిడిపికి నష్టం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు వీళ్లిద్దరి కుతంత్రాలు తోడయ్యాయి. ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు టిడిపి వెంటే ఉన్నారు. వాళ్లాడిన మైండ్ గేమ్స్ అన్నీ ఇన్నీ కాదు, అవి ఎప్పుడూ ఉండేవే. ప్రమాణ స్వీకారానికి మహూర్తాలు, మంత్రి పదవుల ఖరారు, అన్నీ మైండ్ గేమ్ లో అంకాలే,’ నని ముఖ్యమంత్రి చెప్పారు.
‘పోటికి అభ్యర్ధులే లేనప్పుడు సర్వేలతో మైండ్ గేమ్ ఆడారు. ఊగిసలాడే వాళ్లు కొందరు ఆ పార్టీలో చేరారు. వీళ్లకు తోడు మాస్టర్ సెఫాలజిస్ట్ పికె జత కూడారు. హింసా విధ్వంసాలకు స్కెచ్ లు వేశారు,అమలు చేశారు,ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలు చేశారు. టిడిపి నేతలను ప్రలోభాలకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు,బ్లాక్ మెయిల్ చేశారు. అన్నింటిని తట్టుకుని మనవాళ్లు నిలబడ్డారు,’ అని ఆయన ప్రశంసించారు.
ఎన్నిక రోజు తొలిగంటలోనే భారీగా ఓటర్లు తరలివస్తారని వారు వూహించలేదని చెబుతూ ఈ జనాన్ని చూసి జడిసిపోయారని ఆయన అన్నారు. తెలుగుదేశం గెలుపు ఖాయం అనే విషయాన్ని గ్రహించారని అందుకే పోలింగ్ శాతం దెబ్బతీసే పథకరచన చేశారని ఆయన చెప్పారు.
‘11గం లకే తాడిపత్రిలో హత్య, రాజుపాలెంలో స్పీకర్ పై దాడికి తెగబడ్డారు. హింసా విధ్వంసాలపై మీడియాలో పెద్దఎత్తున ప్రసారాలు చేశారు. ఒక ఫక్కా ప్లాన్ ప్రకారం అరాచకానికి పథకం వేశారు. అది చూసి భయపడి ఓటర్లు ఓటింగ్ కు రారని అనుకున్నారు. వాళ్ల ప్లాన్ అర్ధం చేసుకునే మనం కౌంటర్ స్క్రోలింగ్స్ ఇచ్చాం. ఓటర్లకు పదేపదే పిలుపిచ్చాం ఓటింగ్ కు రావాలని కోరాం. మధ్యాహ్నం 3.30గం కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాం. అందులో వాయిస్ సరిగ్గా రాకపోతే 4గం కు మరో వీడియో వదిలాం. సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశం అందరికీ చేరింది. సాయంత్రం 5గం కల్లా ఓటర్లంతా బారులు తీరారు. ఉదయం వెళ్లిపోయినవాళ్లంతా తిరిగి ఓటింగ్ కు వచ్చారు. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్, బిజెపి ఊహించలేదు’ అని ఆయన చెప్పారు.
‘సాయంత్రం 5గం కు వచ్చిన ఓటర్లు పట్టుదలతో అర్ధరాత్రి దాకా క్యూలో ఉండి మరీ ఓట్లేశారు. 1985 ఎన్నికల్లో కనబడిన పట్టుదల ఇప్పుడు మళ్లీ ప్రజల్లో,ఓటర్లలో కనబడింది. ఓటుహక్కు వినియోగంలో వారు చూపిన పట్టుదల ప్రజాస్వామ్యానికే ప్రాణం పోసింది. ఈ ఎన్నికల్లో ఎటు తిరిగి గెలుస్తాం, అది ముఖ్యం కాదు.రాబోయే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి. ఏ డబ్బు, ఏ అధికారం, ఏ కుట్ర, ఏ కుతంత్రం టిడిపి గెలుపును అడ్డుకోలేని స్థాయికి పార్టీ చేరాలి.ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం. అందులో సందేహం లేదు,’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.