తెలంగాణ విద్యామంత్రి జిల్లాలో జర్నలిజం విద్యార్థులకు అన్యాయం

(జిల్లెల శ్రీకాంత్ రెడ్డి)
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సొంత (ఉమ్మడి) జిల్లాలో జర్నలిజం విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. రెండు దశాబ్దాలపాటు వందల మంది జర్నలిజం విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలలో ఇప్పుడు ఆ కోర్సు ఎత్తిపడేసింది సర్కారు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్సును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని తుగ్గక్ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు విద్యార్థులు. చారిత్రక ఎన్జీ కాలేజీలో జర్నలిజం కోర్సు ఏర్పాటు మొదలుకొని మూసివేత వరకు జరిగిన పరిణామాలపై ట్రెండింగ్ తెలుగు న్యూస్ వెబ్ సైట్ ప్రత్యేక కథనం…
1997 నాటిరోజులు… అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న ప్రభుత్వ కాలేజీలన్నీ అటానమస్ సంస్థలుగా రూపాంతరం చెందుతున్నాయి. సాంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల స్థానంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రంగ ప్రవేశం చేశాయి. అంటే ప్రభుత్వ కాలేజీల్లో పాక్షిక ప్రయివేటీకరణ చేస్తున్న రోజులు అన్నమాట. సాంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సులకు విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేసేవారు. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు మాత్రం ఫీజులు భారీగా వసూలు చేశారు. డిమాండ్ ఉన్న కోర్సులన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా ఆధునీకరించారు. తద్వారా ప్రభుత్వం తన మీద ఉన్న బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేసిన రోజులవి. ఆ కోవలో నుంచే పుట్టుకొచ్చింది నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్సు.
బిఎ డిగ్రీలో (హెచ్ జిఎంజె) హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, జియాగ్రఫి ఆప్షనల్ సబ్జెక్టులుగా హెచ్ జిఎంజే కోర్సు ఆవిర్భవించింది. 1998-99లో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీకాలేజీల్లో అనేక రకాల కొత్త డబ్బు కోర్సులు షురూ అయ్యాయి. ఇతర విభాగాల్లో మైక్రో బయాలజీ, బికాం కంప్యూటర్స్, బయో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులతో కొత్త కాంబినేషన్ కోర్సులు ఆవిర్భవించాయి.
ఇక 1998లో ఎన్జీకాలేజీలో మొదలైన జర్నలిజం కోర్సు దాదాపు 20 ఏండ్లపాటు నిరంతరాయంగా కొనసాగింది. కారణాలేంటో తెలియదు కానీ… తాజాగా ఎన్జీ కాలేజీలో జర్నలిజం కోర్సును రద్దు చేసింది తెలంగాణ సర్కారు. ఫీజు కాస్తంత ఎక్కువైన కోర్సే అయినప్పటికీ ఎన్జీ కాలేజీలో ఏనాడూ జర్నలిజం కోర్సులో సీట్లు ఖాళీ ఉన్న పరిస్థితి లేదు. డబ్బుకు, డబ్బు వస్తున్నది… పైగా ఆ కోర్సు ద్వారా డిగ్రీ స్థాయిలోనే జర్నలిజం పై విద్యార్థులకు సమగ్ర అవగాహన కలిగే చాన్స్ ఉన్నప్పుడు ఈ కోర్సును రద్దు చేయడం ఎందుకో ఎవరూ సెలవీయడంలేదు.
98లో 36 మంది విద్యార్థులతో జర్నలిజం గ్రూప్ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కాలేజీలో ఈ ఏడాది నుంచే జర్నలిజం కోర్సులో అడ్మిషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు లేని కారణంగా ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు లేకుండాపోయారు. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు పూర్తిచేసుకుని బయటపడితే ఇక వచ్చే ఏడాది కేవలం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే మిగులుతారు. అంటే మరో ఏడాది కాలంలో రెండు దశాబ్దాలుగా అనేకమంది జర్నలిస్టులను సమాజానికి అందించిన చారిత్రక కళాశాలలో జర్నలిజం కోర్సు చరిత్ర ముగిసిపోనుంది.
విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సొంత జిల్లాలో జర్నలిజం విద్యార్థులకు ఈ తరహా పిడుగులాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల జర్నలిజం విద్యార్థులతో పాటు కాలేజీలో జర్నలిజం, జియాగ్రఫీ చదువుకున్న పూర్వ విద్యార్థులు సైతం బాధపడుతున్నారు.
(నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో జర్నలిజం కోర్సు రద్దు నేపథ్యంలో మరిన్ని కథనాలు మీకు ట్రెండింగ్ తెలుగు న్యూస్ అందిస్తుంది. ఎన్జీకాలేజీలో ఓనమాలు నేర్చుకుని ఉన్నతస్థానంలో ఉన్న జర్నలిస్టుల అభిప్రాయాలు, జర్నలిజం విద్యార్థులు, వారికి పాఠాలు చెప్పిన గురువుల అభిప్రాయాలు మీతో పంచుకుంటాం.)
  • జిల్లెల శ్రీకాంత్ రెడ్డి, జర్నలిస్ట్, హైదరాబాద్.

 

చిరు సైరా సెట్ ఎలా కాలిపోయిందో …

https://trendingtelugunews.com/fire-accident-in-chiranjeevi-farm-house/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *