ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీని ‘చోర్ ’ అనే నినాదంతో ఎదుర్కోవాలనుకుంటున్నారు.
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగా కొల్లొగొట్టి మిత్రుడు అనిల్ అంబానీకి ఇచ్చాడనేది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ. దేశ సంపదను కాపాడాల్సిన ప్రధాని మోదీ (చౌకీదార్)యే దొంగిలిస్తే ఎలా అనే అర్థంవచ్చేలా రాహుల్ ‘చౌకీ దార్ చోర్ హై’ అంటున్నారు.
ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం అయింది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ని ఇలా చోర్ అని అరవడం చాలా తీవ్రమయిన విషయమే. బిజెపి దీనికి తీవ్ర అభ్యంతరం చెబుతూ ఉంది.
అయితే, పధాని పదవిలో ఉన్న వ్యక్తిని చోర్ అనడం భారత రాజకీయాల్లో ఇది మొదటి సారి కాదు. ప్రధాని మీద రాజకీయాస్త్రంగా చోర్ అనే మాట మొదటి వాడిన పార్టీలలో బిజెపియే పెద్ద పార్టీ. ఇది 30 సంవత్సరాల కిందట జరిగింది.
అపుడు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి గా ఉన్నారు.ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటిలాగానే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ఈ ప్రతిపక్ష పార్టీలలో అగ్రభాగాన ఉన్నది భారతీయ జనతా పార్టీయే.
1989 ఎన్నికల్లో ప్రతిపక్షాల నినాదం ఏమిటో తెలుసా?
గలీ గలీ మే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై (Gali gali me shor hai, Rajiv Gandhi chor hai)అనేది నాటి స్లోగన్. బోఫోర్స్ గొడవ నడుస్తున్న ఆ రోజుల్లో ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ స్లోగన్ తో రాజీవ్ గాంధీని వోడించేందుకు ప్రయత్నించాయి. 1989 ఎన్నికల ప్రతి సభలో ఈ నినాదమే వినిపించేది, ప్రతిపోస్టర్ లో ఈ నినాదమే కనిపించేది.
1989 ఎన్నికల ప్రచారానికి, 2019 ఎన్నిలక ప్రచారానికి చాలా పోలికలున్నాయి. అపుడు ప్రధాని రాజీవ్ మీద వచ్చిన అవినీతి అరోపణల చుట్టూర ప్రచారం తిరిగింది. అపుడు బోఫోర్స్ తుపాకుల కొనుగోలు ముడుపు వ్యవహారం రాజీవ్ గాంధీని చుట్టుముట్టింది. రాజీవ్ గాంధీకి ముడుపులందాయనేది చర్చనీయాంశమయింది.
ఈనేపథ్యం నుంచి వచ్చిందే ’గలీ గలీమే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై’ నినాదం. కాకపోతే, అపుడు బిజెపి ఇప్పటిలాగా బలమయిన పార్టీ కాదు. ఆఎన్నిలకు నాయకత్వం వహించింది బిజెపి కాదు, రాజీవ్ గాంధీ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయి బయటకొచ్చిన వి.పి సింగ్. అపుడు ఆయనే ప్రధాని అభ్యర్థి. బిజెపి కూడా ఆయన వెంటే నడిచింది. ’గలీ గలీమే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై’ నినాదాన్ని బాగా నిర్మాణం ఉన్న బిజెపి గల్లీ గల్లీకి తీసుకువెళ్లింది.
ఆశారాం బాబా కొడుక్కి అత్యాచారం కేసులో జీవిత ఖైదు
ప్రతిపక్షాలు తనకు వ్యతిరేకంగా ఒక కూటమిగా కట్టడాన్ని రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. 1884 ఎన్నికల్లో రాజీవ్ గాంధీకి వచ్చిన విపరీతమయిన మెజారిటీ దీనికి కారణం. భారత పార్లమెంటరీ చరిత్రలో ఆ మెజారిటీని ఇంకా ఎవరూ అధిగమించలేదు. రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1984లో541 లో 414 సీట్లు గెల్చుకుంది. వోట్ షేర్ కుసంబంధించి ఇది 49.10 శాతం. 2014 లో బిజెపికి నాయకత్వంవహించిన మోదీకి వచ్చిన సీట్లు 282 మాత్రమే. వోట్ షేరింగ్ 31.3 శాతమే.
441 సీట్లు బలగంతో ఉన్నా రాజీవ్ గాంధీకి బోఫోర్స్ మచ్చ పడింది. ఆయన్ని చోర్ అని పిలిచింది. తనకున్న మెజారిటీ చూసుకుని ప్రతిపక్ష కూటమిని రాజీవ్ ఎగతాళి చేసేవారు. అపుడాయన ప్రతిపక్ష కూటమి ని ‘లీడర్లెక్కువ, వర్కర్ల తక్కువ ’ (more leaders than workers) అని రోజు జోక్ చేసే వారు. ఇపుడు ప్రధాని మోదీ ప్రతిపక్ష కూటమిని ‘మహాకిచిడి’ (mahamilawat khichidi) ఎగతాళి చేస్తున్నారు.
చివరకు అపుడేం జరిగింది?
లీడర్లెక్కువ, వర్కర్లు తక్కువగా ఉండే ప్రతిపక్షం సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదని రాజీవ్ గాంధీ చులకనగా చూసినా కొన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలసి నేషనల్ ఫ్రంటు (NF) ను ఏర్పాటుచేయడంలో నాటి ప్రతిపక్షం విజయవంతమయింది. ఆ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ వోడిపోయారు. ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది- అది ఎడాడి పాటే పనిచేసి,కాంగ్రెసయితే వోడిపోయింది. దొంగ నినాదం బాగా పనిచేసింది. ఇపుడేమవుతుందో చూడాలి.
అప్పటికి ఇప్పటికి చాలా పోలికలున్నాయి. అప్పటి రాజీవ్ గాంధీ లాగే ఇపుడు ప్రధాని మోదీ కూడా 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతోనే గెలిచారు (రాజీవ్ గాంధీ కొచ్చినంత మెజారిటీ రాలేదు). రాజీవ్ గాంధీ బోఫోర్స్ గన్ అవినీతి ఆరోపణ ఎదుర్కంటే మోదీ రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలు అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఏకంగావడాన్ని రాజీవ్ సంహించలేకపోయారు, ఇపుడు మోదీసహించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు అప్పటిలాగే ఇప్పుడు కూడా ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అపుడు ప్రతిపక్షాలు రాజీవ్ గాంధీని చోర్ అన్నాయి. ఇపుడు ప్రతిపక్షం మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అంటున్నది. అపుడు రాజీవ్ గాంధీ వోడిపోయారు. ఇపుడు మోదీ ఏమవుతారో చూడాలి.