నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఎస్పీవై రెడ్డి గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యల కారణంగానే ఏప్రిల్ 3వ తేదీన కేర్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు.
2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో ఆయన టిడిపిలో చేరిపోయారు. అయితే తిరిగి 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. వైెఎస్ సిఎంగా ఉన్న రోజుల్లో నంద్యాల ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిథ్యం వహించారు. 2004 నుంచి నంద్యాల ఎంపీగా గెలుస్తూ వచ్చారు ఎస్పీవై.
ఎస్పీవై రెడ్డి 1950 జూన్ 4వ తేదీన కడపలో జన్మించారు. తెలంగాణలోని వరంగల్ లో ఉన్న ఎన్ఐటి లో ఇంజినీరింగ్ చదివారు.
చంద్రబాబు సంతాపం…
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మరణం పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పారిశ్రామికవేత్తగా, స్వచ్ఛంద సేవకుడిగా ఎస్పీవై రెడ్డి సేవలను కొనియాడారు. ఎంపీగా నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేకమందికి ఉపాధి కల్పించారని తెలిపారు. ఎస్పీవై మృతి నంద్యాల ప్రాంతానికే కాక కర్నూలు జిల్లాకు తీరని లోటు అన్నారు. ఎస్పీవై కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రూపాయికే రొట్టె పప్పు…
ఎస్పీవై రెడ్డి పారిశ్రామికవేత్తగా రూపాయికే పేదలకు రూపాయికే రొట్టె, పప్పు అందజేసి రాష్ట్రమంతా అభిమానులను సంపాదించుకున్నారు.