హైదరాబాద్ లో తొలిసారిగా జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమం భారీ నిరసనతో మొదలయింది. ఈ రోజు ఇంటర్ బోర్డు అవకతవకలకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున బోర్డు దగ్గరకు వచ్చారు.
అవకతవకలకు కారణమయిన వారి మీద చర్యలు తీసుకోవాలని, మంత్రిని తొలగించాని నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తలకు, పోలీసులకు చాలా సేపు తోపులాట జరిగింది.
చివర, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ నాయకత్వంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో ఇంటర్ బోర్డు ముట్టడికి వారు ప్రయత్నించారు.
చాలా మంది ఇతర పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేయడంతో ఇంటర్ బోర్డు కార్యక్రమం అనుకున్నవిధంగా సాగలేదు. అయితే, బోర్డు దాకా రావడంలో జనసేన కార్యకర్తలు విజయవంతమయ్యారు. వారు అక్కడకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. జనసేన నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నడిచింది.
అనంతరం పోలీసులు లాఠీ ఝళిపించారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, విద్యార్థులందరికీ ఉచితంగానే రీఎవాల్యేషన్ చేయాలిని విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను తెలంగాణ జనసేన ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ ల పేరుతో పోలీసులు లాఠీలకు పనిచెప్పితే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.