వారణాసి నుంచి ప్రియాంక గాంధీ ఎందుకు పోటీ చేయలేదు, కార్యకర్తలను, స్థానిక కాంగ్రెస్ నాయకులు వూరించి వూరించి చివరకు గత ఎన్నికల్లో పోటీ చేసి మూడోస్థానంలో నిలబడిన అజయ్ రాయ్ నే చివరకు ఎంపిక చేశారు. నిజానికి చాలా మంది సీనియర్ నేతలు అక్కడి నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ప్రియాంక పేరు చర్చల్లోకిరావడంతో వాళ్లు వెనక్కు వెళ్లారు.
చివరకు ప్రియాంక పోటీ చేయనే లేదు, ఎందుకు?
దీనికొక తక్షణ సమాధానం వినబడుతూ ఉంది. ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అమేధీ, వయనాడ్ నుంచి గెలిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేస్తారని, అపుడు ఖాళీ అయిన స్థానం నుంచి ప్రియాంక గాందీ నిలబడుతుందని ఒక వాదన ప్రచారం లోకి వచ్చింది. అయితే, ఇంతకంటే బలమయిన కారణాన్ని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పారు.
ఇది చాలాబలమయిన కారణం. ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ లో పెద్ద రాజకీయ బాధ్యత ఇవ్వ బోతున్నది. దీనిని ఇండైరెక్టుగా అఖిలేష్ యాదవ్ బయటపెట్టారు.
ఒక చారిత్రక పాత్ర పోషించకుండా కేవలం ఎంపిగా గెలిపించేందుకు ప్రియాంక ను రాజకీయాల్లోకి తీసుకురారు. ఆమె చుట్టూ చాలా గ్లామర్ ను అల్లారు. ఆమెను ఇందిరాగాంధీతో పోలుస్తున్నారు. ఆమె రాకతో పార్టీ పావనమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఆమె చాలా పెద్ద బాధ్యత ఇచ్చి ఉత్తర ప్రదేశ్ లో దృష్టి పెట్టాలని చెబుతున్నారట.
ఏమిటి ఆ బాధ్యత?
2022 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంకను యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం.
2022లో ఉత్తరప్రదేశ్ ను మళ్లీ లాక్కోవడం కాంగ్రెస్ లక్ష్యం పెట్టుకుందని,కాంగ్రెస్ కు ఇపుడు మోదీని ఓడించడం కంటే 2022 లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేయడం ముఖ్యంగా భావిస్తున్నదని ఆయన అన్నారు.
ప్రియాంక ను ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రతిపాదించబోతున్నారని అఖిలేష్ చెప్పక పోయినా, ఆగురుతర బాధ్యత రాహుల్ కుటుంబ సభ్యులు తప్పమరొక రు నిర్వర్తించలేరు. మనుసులో ఇది ఉన్నా ప్రియాంక పేరు చెప్పకుండా , 2022 లో యుపిలో ప్రభుత్వం ఏర్పాటుచేసే వ్యూహంలో కాంగ్రెస్ ఉందని ఆయన అన్నారు.
2022 లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ ను మూడుదశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ జండా ఎగరేసే బాధ్యతను ప్రియాంకకు అప్పిగిస్తున్నారు. అందుకే ఆమెను లోక సభ ఎన్నికలకు దూరంగా ఉంచాలని చివర్లో నిర్ణయించారు.
ఈ విషయం అఖిలేష్ కు తెలుసు. ఆందుకే ఆయన కాంగ్రెస్ మీద చురకవేస్తూ, ఆ పార్టీకి 2019 లో క్ సభ ఎన్నికల కంటే, 2022 యుపి అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి 30 సంవత్సరాలయింది. 1989లో ఎన్ డి తివారీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీకి అధిక్యత వచ్చింది. డిసెంబర్ 5, 1989న ములాయాం సింగ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.
చీటికి మాటికి చీఫ్ మినిస్టర్లను మార్చి అభాసుపాలయి కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు.
లోక్ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గెలుస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఖరిస్మా కాంగ్రెస్ పార్టీని నిలబెట్ట లేకపోయింది. ఇపుడు ఎలాగూ ప్రియాంక గాంధీ వచ్చింది కాబట్టి, ఆమెను లోక్ సభ స్థానానికి పరిమితం చేయకుండా ఉత్తర ప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తెచ్చే గురుతర బాధ్యతను అప్పగిస్తే బాగంటుందని కాంగ్రెస్ భావించింది. ఇపుడా పనిలోనే ఉంది.
అందుకే మొదట్లో ఆమెను వారణాసి నుంచి పోటీ చేయించాలనుకున్నా, ఒక వేళ గెలిచినా ప్రియాంక ఎంపిగా కూర్చోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. అందువల్ల తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఆమెను 2022 నాటికి సిద్ధం చేయాలని భావించి వారణాసి పోటీనుంచి తప్పించారు.
ఒకపుడు రాష్టాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ యుపిలో 2017 నాటికి 403 సీట్లలో 7 సీట్ల దిగజారి పోయింది. ప్రియాంక గ్లామర్ తో పార్టీకి పునర్ వైభవం తీసుకురావచ్చని నాయకులు నమ్ముతున్నారు. మండల్ పాలిటిక్స్ కాంగ్రెస్ స్వరూపాన్ని మార్చేశాయని, ప్రియాంక నాయకత్వంలో పాత వైభవాన్ని తీసుకువచ్చేందుకు , మళ్లీ యుపి బ్రాహ్మణులకు దగ్గిరయ్యేందుు ప్రయత్నాలు జరగుతాయని ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించిన రోజునే వూహాగానాలు మొదలయ్యాయి. అందువల్ల వారణాసి లో ఆమెను మోదీమీద పోటీకి దించకపోవడం వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది. అది అధికారికంగా వెల్లడయ్యందుకు మరికొంత సమయం పడుతుంది.
(SP Tripathi is a New Delhi based senior journalist)