ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెగ కోపమొచ్చింది. ఇంకా తనపదవీ కాలం ఉన్నా, ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకోవడం మీద ఆయన కోపమొచ్చింది. వెంటనే ఎన్నికల కమిషన్ కు తొమ్మిది పేజీల నిరసన లేఖ రాశారు.
అయిదేళ్ల పదవీ కాలం ముగిసే దాకా ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించ వచ్చని, సమీక్షలు జరపరాదని ఎక్కడా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు గుర్తుచేశారు.ఆలా నియమనిబంధనలెక్కడున్నాయో చెప్పండని నిలదీశారు.
ప్రాజెక్టులపైనా, మంచినీటి సమస్యమీద, అమరావతి రాజధాని నిర్మాణం మీద తాను చేస్తున్న సమీక్షను అడ్డుకోవద్దంటూ చంద్రబాబు నాయుడు 9 పేజీల లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెబుతూ ఎన్నికల కమిషన్ తీసుకున్న పలు నిర్ణయాలకు ఆయన అభ్యంతరం చెప్పారు. అవన్నీ ఏకపక్షమని లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికమిషన్ తీరు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని చెబుతూ శాఖల పనుల మీద రివ్యూలపై అభ్యంతరాలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.
‘అయిదు సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వానికి ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేసే బాధ్యత ఉంటుంది. సమీక్షలు చేయకూడదని ఎక్కడా నిబంధనలు లేవు. అదే విధంగా ముఖ్యమంత్రి భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్ష నిర్ణయాలే. ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేయగానే విచారణ లేకుండా ఎన్నికల కమిషనే బదిలీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దం,’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ నిర్వహణలోఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైందనని,సర్వత్రా గందరగోళం నెలకొనిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని, క్యూలో గంటల తరబడి నిలబడి ఉన్నా మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన అన్నారు. అర్థరాత్రి దాకా ప్రజలు వోటు వేయడం పడిగాపులు కాయడం ఎపుడైనా విన్నామా అని ఆయన ఆశ్చర్య పోయారు.
తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, ఎన్నడూ ఎన్నికలప్పుడు ఇలాంటి వైఫల్యం చూడలేదని ఆయన అన్నారు.