సిగరెట్ పెట్టెల మీద క్యాన్సర్ హెచ్చరిక ఉంటుంది.అలాగే మందు సీసాల మీద ఆరోగ్యానికి సంబంధించిన చట్టబద్ద హెచ్చరిక ఉంటుంది.
ఇలాగే పెళ్లి పత్రికల మీద బాల్య వివాహాలకు సంబంధించిన వార్నింగ్ ముద్రించితీరాలని రాజస్థాన్ లో ఒక జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు, ఈ వార్నింగ్ ‘బాల్య వివాహం నేరం’ ను కచ్చితంగా ముద్రించేలా చూసే బాధ్యతను ప్రింటింగ్ ప్రెస్ లకు అప్పగించారు.
అంతేనా,కాదు, ఇంకా చాలా ఉంది. తమ చుట్టూర జరిగే పెళ్లిళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలని స్కూళ్ల హెడ్ మాస్టర్లకు, రెవిన్యూ ఇన్స్ పెక్టర్లకు, గ్రామ సేవకులకు, అంగన్ వాడి వర్కర్లకు ఆదేశాలిచ్చారు.
ఈ చట్టబద్ధ హెచ్చరికతో పాటు వధూవరుల పుట్టిన తేదీ సంవత్సరాలను కూడా కార్డులో ముద్రించాలి. గుట్టుగాపెళ్లి చేసుకునే వాళ్లమీద కూడా నిఘా ఎలా వేయాలో కూడా అధికారులు వివరించారు.
ఇంటికి సున్నం వేయడం, పందిర్లు వేయడం, ఇళ్ల దగ్గిర జరిగే వేడుకలు, మేళతాళాలు వాయింపు, మహిళలు గోరింటాకు ధరించడం… వంటి ఆధారంగా ఇళ్ల మీద నిఘా వేసి అవి పెళ్లిసంబరాలేవే గమనించాలని చెప్పారు. పిల్లలు బడికి రాకపోతే, పెళ్లి సందడి వల్ల కూడా అయివుండవచ్చని చెబుతూ దీనిని కూడ గమనించాలని ఆదేశించారు.
ఇంత స్ట్రిక్టుగా బాల్యవివాహాల మీద అధికారులు విరుచుకుపేడుందుకు కారణం, మే 7 న వస్తున్న అక్షయ తృతీయ పండుగ కావడమే. ఈ పండగకు ముందు పెళ్లి చేస్తే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.
అందుకే పెళ్లీడు (18 సం.)రాకపోయినా పెళ్లి చేసేస్తుంటారు. దీనిని బాల్యవివాహంగా భావించి నివారించాలనుకుంటున్నారు రాజస్థాన్ బుండి జిల్లా అధికారులు.
దేశంలో బాల్య వివాహాలు మితిమీరి ఉన్న 12 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ నివేదిక చెబుతూ ఉంది.అందువల్ల ఈ దురాచారాన్ని నివారించేందుకు బుండి అధికారులు నడుం బిగించారు.
పెళ్లి పత్రికల ముద్రణ కు వచ్చే వారిని వధూవరులు డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ ల నఖలు ను తీసుకుని భద్రపరచాలనికూడా ఆదేశించారు.
సర్టిఫికెట్ లను వెరిఫై చేశాక వధూవరుల పుట్టిన తేదీలను కనిపించేలాగా స్పష్టంగా కార్డు మీద ముద్రించాల్సి ఉంటుంది.