(సలీమ్ బాష)
ఒక కప్పు టీ తాగడానికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితుల్లో, వీధి దీపం కింద మొదలైన ఓ నాటకం రంగస్థలంపై కొన్ని వేల సార్లు ప్రదర్శించబడిందంటే, అది మామూలు విషయం కాదు.
లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిన నాటకం ఇదే! క్వీన్ ఎలిజబెత్, మైఫెయిర్ లేడీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పొలా వంటి వారితో పాటు బాలీవుడ్ లో అమితాబ్ ,రాజ్ కపూర్, మీనా కుమారి లాంటి వారు కూడా ఈ నాటకాన్ని వీక్షించారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ షోకు టికెట్లు మరీ తెప్పించుకొని చూడడం విశేషం. హాలివుడ్ నటుడు రెక్స్ హారిసన్, ప్రఖ్యాత రచయిన ఫ్రెడిరిక్ ఫోర్సీత్, నెల్సన్ మండేలా, కోఫీ అన్నన్ లాంటి వారు కూడా ఈ నాటకాన్ని చూసి మెచ్చుకున్నారు! బ్రిటన్ రాణి “ఎలిజబెత్” పంపించిన ప్రశంసా పత్రం తనకు ప్రత్యేకమైనదని చెపుతాడు బబ్బన్.
హైదరాబాది ఉర్దూలో ప్రేక్షకులను ఉర్రూతలూపిన ఈ నాటకం 1984 లో గిన్నిస్ బుక్ దీన్ని ఒకే వ్యక్తి ద్వారా దీర్ఘకాలం ప్రదర్షించబడిన నాటకం ” గా గుర్తించింది! గిన్నిస్ రికార్డు 35వ వార్షికోత్సవ సంవత్సరం ఇది. 5169 వ ప్రదర్శన తర్వాత సెప్టెంబర్ 22, 1983న అద్రక్ కే పంజే గిన్నీస్ రికార్డు కెక్కింది. ఇప్పటి దాకా ఈ నాటకం 60 దేశాలలో కెళ్లింది. 10 వేల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది.
ఈ నాటకం గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. “అద్రక్ కె పంజే ” (అల్లం వేర్లు) అనే సాధారణమైన నాటకాన్ని రాసిన బబ్బన్ ఖాన్ కూడా సాధారణమైన వాడే. అయితే దాన్ని అసాధారణమైన స్థితికి తీసుకుపోవటం వెనక విరామమెరుగని కృషి ఉంది.
తన జీవితాన్నే అత్యంత నిజాయితీతో నాటకంగా రాసి ప్రదర్శించిన ఈ నాటకం చూసిన తర్వాత నవ్వి నవ్వి కన్నీళ్లు రావటం ఖాయం. చార్లీ చాప్లిన్ లాగా విషాదంలో హాస్యాన్ని పుట్టించిన బబ్బన్ ఖాన్ పది మంది సభ్యులున్న కుటుంబం లో ఒకడు. దారిద్య్రం వల్ల తింటానికి తిండి లేక కుటుంబంలో ఒక్కొక్కరూ ఈ ప్రపంచం నుండి నిష్క్రమించిన నేపథ్యంలో బబ్బన్ ఖాన్ తల్లితో పాటు బతికిపోయాడు! పిల్లలు చనిపోతున్నారు కనుక భయపడి పదేళ్ల వయసు వచ్చే దాకా బబ్బన్ కి పెట్టలేదు. బబ్బన్ ఖాన్ పెద్దయ్యాక ఇంత పేరు సంపాయిస్తాడని ఎవరు ఊహించలేదు.
అలాంటి పరిస్థితుల్లో ఒకానొక నిశిరాత్రిలో లైటు స్థంభం కింద కూర్చుని ఏకబిగిన రాసిన ఈ నాటకం సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం మారలేదు. అల్లం వేర్ల లాగా అడ్డదిడ్డంగా పెరిగిపోయిన కుటుంబ వ్యవస్థ గురించి సృష్టించిన ఈ నిజ జీవిత సెటైరికల్ నాటకం 35 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రదర్శింపబడింది అంటే ఎంత భారీ స్థాయిలో ప్రజలు ఆదరించారో అర్థం అవుతుంది. న్యూయార్క్ లో ఇచ్చిన ప్రదర్శనలో ప్రేక్షకులు పదహారు నిముషాలు పాటు ఆపకుండా చప్పట్లు కొట్టిన ఏకైక నాటకం ఇదే!
ఈ నాటకంలో అతని భార్య శైలా ఖాన్ ,పిల్లలు కూడా పాత్రధారులే. 1984లోనే గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన ఈ నాటకం ప్రదర్శన 1997లో మరోసారి హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇచ్చాడు బబ్బన్ ఖాన్ .
ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ తర్జుమా అయ్యి, కంప్యూటరైజుడ్ చేయబడి ఈ నాటకం ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణంగా మారవచ్చు అని స్పూర్తిని ఇచ్చే నాటకంగా రూపాంతరం చెందడానికి కారణం బబ్బన్ ఖాన్ . ప్రతి నిమిషం వెల్లువల పారే సెటైర్లతో రెండు గంటలపాటు ప్రేక్షకులని నవ్వించి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించడం దీని ప్రత్యేకత. అంతే కాకుండా 1965 లో రాసిన ఈ నాటకం చివరి వరకు మార్పులు చెందకుండా ప్రదర్శింప బడటం గొప్ప విషయం.
1965 సెప్టెంబర్ 22న ఇచ్చిన మొదటి ప్రదర్శన అట్టర్ ఫ్లాప్. టిక్కెట్లు ప్రింట్ చేసిన డబ్బులు కూడా రాలేదు. కానీ నాటకం కోసం అమ్మిన తల్లి మంగళ సూత్రం మాత్రం పోయింది. రెండవసారి ధైర్యం చేసి (ఒకరు పెద్దమనసుతో ఐదువందల ఇస్తే) మరొక షో వేస్తే కొంత సక్సెస్! దాంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సెట్టు వేయడానికి ఒక గంట, తీయటానికి అర్ధ గంట సమయం పట్టే ఈ నాటకంలో ప్రధాన పాత్రధారి అయిన రమ్సు ఒక బీద గుమాస్తా మాత్రమే! ఇంట్లో అరడజను మంది పిల్లలు, చాలీచాలని డబ్బులు , జీవితం పట్ల ఆశ ఇవి ఈ నాటకానికి మూలస్తంభాలు.
చాలా (1965-2001) సంవత్సరాల తర్వాత కూడా ఈ నాటకం లోని అంశాలు ప్రస్తుత సమాజానికి అతికినట్లు ఉండడం ప్రత్యేకత. అల్లం వేర్లలా ఎటు పడితే అటు పెరిగే కుటుంబమే ఈ నాటకంలోని సెంట్రల్ పాయింట్. ఒక భార్య 8 మంది పిల్లలు కొన్ని ఇతర పాత్రలు, ఒక ఇంటర్వెల్ తో రెండు గంటలపాటు నడుస్తుంది నాటకం. బబ్బన్ ఖాన్ పిల్లలు కూడా నాటకంలో భాగమైనప్పటికీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఈ నాటకం సెట్ ఖరీదు మొత్తం 650 రూపాయలు అయినప్పటికీ బబ్బన్ ఖాన్ 40 లక్షలు ఆదాయపు పన్ను కట్టడం విశేషం!
పేదరికానికి కుటుంబం మొత్తం బలైపోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న బబ్బన్ ఖాన్ మాటల్లో చెప్పాలంటే “ఈ నాటకం ప్రదర్శించిన ప్రతిసారీ నాకు గత జీవితం గుర్తుకొస్తుంది నేను నేను ఇప్పుడు ఈ నాటకం వేయడం లేదు కేవలం బతుకుతున్నాను.”
2001 ఫిబ్రవరి లో చివరి ప్రదర్శన ఇచ్చిన బబ్బన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో “ఖాన్ అకాడెమి” ద్వారా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం అద్రక్ కె పంజే రెండో భాగానికి మెరుగులు దిద్దుతున్నాడు. తర్వాత అవినీతి పై మరో వ్యంగ్య నాటకం కూడా ఉందట!
విషాదాన్ని, హాస్యాన్ని కలిపి అందించిన ఈ నాటకం విజయం వెనుక కూడా విషాదము, హాస్యము ఉన్నాయి వాటి అన్నింటి కన్న జీవితంలో కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఉండాలనే గొప్ప విషయమూఉంది. అదే ఈ నాటకాన్ని, బబ్బన్ ఖాన్ ని ప్రపంచ రంగస్థలం పైన నిలబెట్టింది.