గవర్నర్ నరసింహన్ కు రేవంత్ రెడ్డి లేఖ

గవర్నర్ నరసింహన్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. లేఖ పూర్తి పాఠం కింద ఉంది చదవండి.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాల పట్ల తీవ్ర ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం కారణంగా అన్యాయమైపోతోన్న విద్యార్థుల సమస్యను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 9.70 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ నెల 18న ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడించింది. ఫలితాలలో తాము ఫెయిల్ అయినట్టు తెలుసుకున్న కొందరు విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలకు ఒడిగట్టారు. ఏడాది పాటు కష్టపడి చదవినా పరీక్షలో ఫెయిల్ కావడం ఏమిటన్న మానసిక క్షోభ వారిని ఆత్మహత్యలకు పురిగొల్పింది.
విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోన్న సమయంలో కొన్ని నివ్వేరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బోర్డు ప్రకటించిన ఫలితాలు తప్పులతడకగా ఉన్నాయన్న విషయం బహిర్గతమైంది. సుమారు మూడు లక్షల మంది విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పులు దొర్లినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఫెయిల్ అయినట్టు, ఫెయిల్ అయిన కొందరు ఉత్తీర్ణత సాధించినట్టు, మొదటి సంవత్సరం అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ద్వితియ సంవత్సరం ఫెయిల్ అయినట్టు తప్పుడు ఫలితాలు విడుదల చేశారు. ఈ పరిణామం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన రేకెత్తించింది. ఇప్పటి వరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారని చెప్పడానికి విచారిస్తున్నాను.
మంచిర్యాల జిల్లా, జిన్నారం మండలం కరిమల జూనియర్ కళాశాలలో చదువుతోన్న జి నవ్య అనే విద్యార్థిని తెలుగులో 99 మార్కులు సాధిస్తే సున్నా మార్కులు వేశారు. దీనిపై వివరణ కోరితే మరుసటి రోజు సరి చేశారు. హయత్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోన్న ఎండి నౌషిన్ అనే విద్యార్థిని అరబిక్ లాంగ్వేజ్ పరీక్ష రాస్తే ఆమె ఉర్ధూ పరీక్ష రాసినట్టు, అందులో ఫెయిల్ అయినట్టు చూపించారు. 900 లకు పైగా మార్కులు సాధించిన సుమారు 10 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్టు రికార్డుల్లో చూపించారు. పలు జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు తెచ్చుకున్న కొందరు విద్యార్థులను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినట్టు చూపించారు. మొదటి సంవత్సరం అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులను ద్వితియ సంవత్సరంలో ఫెయిల్ చేశారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
సహజంగా పాస్ అయిన వారికి P అని, ఫెయిల్ అయిన వారికి F అని ఉండాల్సిన చోట AP, AF అని పేర్కొని మరింత గందరగోళానికి తెర లేపారు.
తమ బిడ్డల భవిష్యత్ పై ఆందోళనతో గడచిన వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు వేలాదిగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి తరలివస్తున్నారు. అసలు ఏం జరిగిందో? తమ బిడ్డల ఫలితాల విషయంలో పొరపాటు ఎక్కడ జరిగిందో? తెలుసుకునేందుకు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. వారికి అధికారుల నుంచి నిర్లక్ష్య పూరిత స్పందన లభిస్తోంది. పైగా పోలీసుల నిర్భందంతో వాళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
విద్యార్థుల డేటా సేకరణ, ఫలితాల క్రోడీకరణ బాధ్యతను అర్హతలేని కంపెనీకి అప్పగించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలక వ్యక్తుల సిఫార్సుతోనే గ్లోబరీనా టెక్నాలజీస్ అనే సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాకినాడ జెఎన్టీయూ విషయంలో ఇదే గ్లోబరీనా సంస్థ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్ లో ఈ సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. 2015లో ఈ సంస్థ నిర్వాకం పై మీరే స్వయంగా విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరుగుతోన్న అన్యాయం విషయంలో ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతారాహిత్య ప్రకటనలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఫలితాలలో తప్పులు జరిగాయని ఓ వైపు బోర్డు కార్యదర్శి అశోక్ అంగీకరిస్తుంటే… మరోవైపు ఇదంతా అపోహమాత్రమే అని మంత్రి కొట్టిపారేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఎండి వెంకటేశ్వరరావు సారథ్యంలో కమిటీ వేశారు. మంత్రి చెప్పినట్టు తప్పులు జరగకపోతే… విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటి? అదేమని అడిగితే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకోండని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.
తమ జవాబు పత్రాలు చూపించాలని విద్యార్థులు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఎవరో చేసిన తప్పుకు విద్యార్థులు క్షోభ అనుభవిస్తున్నారు. అది చాలదన్నట్టు రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.600 కట్టాలంటున్నారు. చేయని పాపానికి ఈ భారం వాళ్లెందుకు భరించాలి? చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పట్టించుకున్న నాథుడు లేడు.
ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం కల్గించేలా లేదు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే భరోసా కనిపించడం లేదు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు మీరు ఛాన్సిలర్. గాడితప్పిన విద్యావ్యవస్థను దారిలో పెట్టడానికి మీ జోక్యం అవసరం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడండి.
ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించుకుని మీరే స్వయంగా మాట్లాడండి. అప్పుడే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబందిత విద్యాశాఖ అధికారులతో తక్షణం పరిస్థితిని సమీక్షించండి. ఆందోళనలో ఉన్న విద్యార్థుల భవిష్యత్ కు భరోసా ఇస్తూ, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
రేవంత్ రెడ్డి,
టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *