భూతం అనే పేరు వింటేనే మనం హడలిపోతాం… గజ గజ వనుకుతం. పుట్టినప్పటి నుండి భూతాల గురించి కథలు కథలుగా విన్నాం. భూతాలు రక్కుతాయి, పీక పిసుకుతాయి, కరుస్తాయి, ప్రాణాలు తీస్తాయి అని పురాణాలు, కథల్లో చదువుకున్నాం. మరి అలాంటి భూతలకు అధిపతి వాటికి రాజు అంటే ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటారో చెప్పలేము కదా… ఆయన ఇంకెంత ప్రమాదకరమో మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు కదా? కానీ భూతాల రాజు అలాంటివాడు కాదు చల్లని దేవుడు. అదేంటి అని మీకు అనుమానం కలుగుతోంది కదా? అయితే మీరు ఈ స్టోరీ చదవాలి. భూతదేవుడికి సామాన్య భక్తులు ఎలా మొక్కులు చెల్లించుకుంటున్నారో చదవండి.
వైభవంగా ప్రారంభమైన అల్లాదుర్గం జాతర
భూతాల అధిపతి భేతాళునికి భక్తుల మొక్కులు
స్థానికుల పేర్ల చరిత్రకు ఈ దేవాలయానికి సంబంధం ఇదే!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర తర్వాత అతి పెద్ద జాతరగా పేరుగాంచిన భేతాళస్వామి జాతర ప్రారంభమైంది. ఈ నెల 20న ఘనంగా ఆరంభమైన ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. రాష్ట్రంలోనే మొట్టమెదటిదైన
భేతాళుని దేవాలయం అల్లాదుర్గంలో ఉంది.
భూతాలకు అధిపతి అయిన ఈ భేతాళ స్వామి దేవాలయానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయానికి అసలు తలుపులే ఉండవు. గ్రామాల్లో వ్యాధులు సోరి ప్రజలు మృత్యువాత పడుతున్న క్రమంలో భేతాళుని విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించారు. వ్యాధులు దూరం కావడంతో పాటు కోరిన కోరికలు తీరడంతో భేతాళుని మహిమపై స్థానికులకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఇక్కడ జాతర ఉత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు భక్తులు. అయితే భేతాళస్వామిపై భక్తితో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలలు తమ పిల్లలకు భేతయ్య, భేతమ్మ పేర్లను ఎక్కువగా పెడుతుంటారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇవే పేర్లు ఉండటం గమనించవచ్చు.
మొక్కుల్లో భాగంగా భక్తులు జంతుబలులతో పాటు.. బోనాలు, గండజ్యోతి ప్రదక్షిణలు చేస్తూ భేతాళ స్వామిని ప్రసన్నం చేసుకుంటుంటారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున పోలేరమ్మ దేవతకు బోనాలు,21న పోచమ్మకు, 22న దుర్గమ్మకు, 23న భేతాళ స్వామికి బోనాలు తీస్తారు. 24న భేతాళ స్వామి ఆలయం చుట్టు జరిగే ఎడ్ల బండ్ల ప్రదక్షిణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 25న భాగవతాలు, 26న భజనలు, 27న రాత్రి 8గంటలకు లంకధహనం నిర్వహిస్తారు. 28న ఉదయం భేతాళస్వామికి పాచిబండ్ల ప్రదక్షిణలు ఉంటాయి. ఈ ఉత్సవాలకు స్థానికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తుంటారు. దీంతో భక్తుల సౌకర్యార్ధం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది.