కర్నాటక తాత మనవళ్లు: మునుగుతారా, కాంగ్రెస్ ను ముంచుతారా?

(యనమల నాగిరెడ్డి, బి వి మూర్తి)

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో జెడిఎస్ తో పొత్తు పెట్టుకోడం వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతున్నట్టు స్పష్టమైన దాఖలాలు కనిపిస్తున్నాయి. స్థానిక కార్యకర్తల్లో అసమ్మతి ఓ ప్రతికూలాంశం కాగా, దేవే గౌడ కుటుంబం రాజకీయ కక్కుర్తిపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఛీత్కారం అంతకు వంద రెట్లు తీవ్రమైన విఘాతంగా పరిణమించిందని కాంగ్రెస్ అభ్యర్థులు వాపోతున్నారు.

కర్ణాటకలో దినదిన గండం నూరేళ్లాయుషు చందంగా కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఇంకా ఇంకా కొనసాగడానికి రాజకీయ అనివార్యతే ప్రధాన కారణం. లోక్ సభ ఎన్నికలు ముగిసే దాకా పంటి బిగువున ఈ నొప్పి భరించక తప్పదని సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో బాటు ప్రతిపక్ష బిజెపి కూడా అంతర్గతంగా గట్టి నిర్ణయం తీసుకోడం వల్లనే హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వం  బతికి బట్టకట్ట గలుగుతున్నది.

2018 మే నెలలో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం అధికారంలోకి వచ్చి కుమారస్వామి సిఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అదో పెద్ద పొలిటికల్  జోక్ లా అనిపించింది. 222 మంది సభ్యుల అసెంబ్లీలో అత్యధికంగా 104 స్థానాలు గెల్చుకున్న బిజెపి వెర్రిమొహం వేసి అధికారానికి వెలిగా మిగిలిపోయింది. అన్ని మతాల వారూ సహజీవనం సాగిస్తున్న ఈ దేశంలో మాది కేవలం హిందువుల పార్టీయే అని సగర్వంగా చాటుకునే బిజెపికి తను అనుభవిస్తున్న `రాజకీయ అస్పృశ్యత’ స్వయంగా కోరి తెచ్చుకున్న రోగమే.

అవినీతి ఆరోపణల అంటుసోకిందంటూ అంతక్రితం వద్దనుకున్న యడ్యూరప్పనే తిరిగి తెచ్చుకుంటూనే తప్ప అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో బిజెపి నిలదొక్కుకోలేక పోయింది. పూర్వ లింగాయత్ కళలతో అట్టడుగు నుంచి పైకి దూసుకొచ్చిన మాట నిజమే గానీ అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 112కు ఎనిమిది స్థానాల దూరంలో నిలిచిపోయింది. ప్రత్యర్థి శిబిరాల్లోని అసంతృప్తులను ఒడుపుగా గుర్తించి, లాఘవంగా సామాజికార్థిక రాజకీయ బేరసారాలు సాగించి, సొంతంగా తన భుజాలమీద కూర్చోబెట్టుకుని రయ్యిమని తీసుకొచ్చి తమ శిబిరంలో కుదెయ్యడం యడ్యూరప్పకు కొత్తేమీ కాదు గానీ బిజెపి అధిష్టానం ససేమిరా అనడంతో చేతులు కట్టేసినట్టు అయిష్టంగా మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యేల వేట వంటి అనైతిక, అప్రదిష్ట పనులతో అపకీర్తి మూటగట్టుకోవడం కీలకమైన ఈ ఎన్నికల ముందు వాంఛనీయం కాదనీ, పైగా ప్రభుత్వాన్ని కూల్చివేసే రాజకీయ దుస్సాహసం సంకీర్ణ భాగస్వాములకు సానుభూతిగా పరిణమించగలదని అమిత్ షా చాణక్యుల వారు గట్టిగా హెచ్చరించారు. ఆ విధంగా కుమారస్వామి సంకీర్ణాన్ని పడిపోకుండా కొనసాగించడం కర్ణాటక బిజెపికి రాజకీయ అనివార్యత (పొలిటికల్ కంపల్షన్) గా పరిణమించింది.

మరోవైపు జెడిఎస్ (39) కంటే రెండింతలు సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ (78) ముఖ్యమంత్రి పదవిని జెడిఎస్ కు త్యాగం చేసి `ఔదార్యం’ ప్రదర్శించడం కూడా లోక్ సభ ఎన్నికలతో ముడిపడిన రాజకీయ అనివార్యతే. లోక్ సభ ఎన్నికలకై పార్టీకి నిధుల సౌభాగ్యం చూసుకోవాలంటే కర్ణాటకలో అధికారంలో ఉండటం కీలకం.  బిజెపికి యడ్యూరప్ప లాగే కర్ణాటకలో కాంగ్రెస్ కు సిద్ధరామయ్య తప్ప మరో నాయకుడంటూ లేడు. అన్నభాగ్య, జలభాగ్య, ఆ భాగ్య, ఈ భాగ్య అంటూ సిద్ధరామయ్య నోటికొచ్చిన పథకాలన్నీ ప్రకటించి అమలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంఖ్యాబల సౌభాగ్యం మాత్రం అబ్బలేదు. వీరశైవ లింగాయత్ లకు ప్రత్యేక మతం గుర్తింపు కోసం తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించి, ఈ దెబ్బతో బిజెపి లింగాయత్ వోటు బ్యాంకుని చీల్చి చెండాడామనుకుని పోంగిపోతే, ఆ చర్యతో మొదటికే మోసం వచ్చింది. లింగాయత్ ల ప్రాబల్యం ఉన్న ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ సంఖ్యాబలం తగ్గిపోగా బిజెపి బలం ఇనుమడించింది. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ పూర్తి ఆధిపత్యం లేకపోయినా, అన్ని ప్రాంతాల్లోనూ అస్తిత్వం ఉందని  చాటిచెబుతున్నట్టుగా, మ్యాజిక్ ఫిగర్ కు ఆమడదూరంలో కాంగ్రెస్ కు లభించిన 78 సీట్లు పార్టీకి పొత్తుల అవసరాన్ని నొక్కి చెబుతున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం భావించింది.

సిద్ధరామయ్య కారణంగా కాంగ్రెస్ కు అహింద (అల్పసంఖ్యాక, హిందుళిద, అంటే వెనుకబడిన, దళిత) వర్గాల్లో ఉన్న పలుకుబడికి, జెడిఎస్ కు వక్కళిగుల్లో ఉన్న పరపతి తోడైతేనే తప్ప లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లతో పరువు మిగిలేలా లేదని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసింది. అందువల్లే ఎన్ని కష్టనష్టాలున్నా సరే లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ బలవంతపు కాపురం భరించి తీరవలసిందే నంటూ కాంగ్రెస్  ప్రభువులు హుకుం జారీ చేశారు.

 

చిత్రహింసల ముఖ్యమంత్రి పదవి

 

ఇక జెడిఎస్ కథ సరేసరి. `అధికారం మీదే, మాది ఉత్తి సపోర్టివ్ రోల్ అంతే’ అని కాంగ్రెస్ అనూహ్యంగా సరికొత్త రాగం అందుకోవడంతో జెడిఎస్ కు జాక్ పాట్ కొట్టినట్టయింది. ఉత్తి సపోర్టివ్ రోల్ లో భాగంగా కాంగ్రెసోళ్లు అక్కడా ఇక్కడా అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ గిచ్చుతూ, పిండుతూ, బరుకుతూ, మరీ ప్రేమ ఎక్కువైపోతే అడపాదడపా బరిసెతో లోతుగా పొడుస్తూ నానా చిత్రహింసల పాల్జేస్తున్నా, పాపం కుమారస్వామి ముఖమ్మీదకు బలవంతపు నవ్వు తెచ్చుకుని భరిస్తూ వస్తున్నాడు. ఎలాగోలా ఇలాగే ఇంకో రెండు మూడేళ్లు నొప్పి భరిస్తూ అధికారంలో కొనసాగితే అంగబలం, అర్థబలం పెంచుకుని కింగ్ మేకర్ నుంచి ఆ తర్వాతి స్థాయికి ఎదగవచ్చునని దళపతి దేవేగౌడ తలంచారు.

రద్దయిన లోక్ సభలో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు గాను బిజెపికి 17 మంది, కాంగ్రెస్ కు 9 మంది, జెడిఎస్ కు ఇద్దరు సభ్యులున్నారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్ ఉన్న మాట నిజమే కానీ బిజెపి కీ (43), కాంగ్రెస్ కూ (40.8) పోలైన వోట్ల శాతంలో తేడా 2.2 మాత్రమే. మొత్తం దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మోదీ ప్రభంజనంలోనూ కర్ణాటకలో మాత్రం కులాల జమాబందీ లెక్కలే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించాయి. లింగాయత్ ల ప్రాబల్యం అధికంగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాల్లోనూ, ఆర్ఎస్ఎస్ మూలాలు లోతుగా ఉన్న కోస్తా జిల్లాల్లోనూ బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. వక్కళిగుల ప్రాబల్యం అధికంగా ఉన్న మండ్య, హాసన్ జిల్లాల్లో జెడిఎస్ రెండు సీట్లు గెల్చుకున్నది. అల్పసంఖ్యాక వర్గాలూ, దళిత, బిసి వర్గాల వోట్లు నిర్ణాయిక శక్తిగా ఉన్న చోట్ల అక్కడక్కడా ఒక్కో సీటు చొప్పున గెల్చి మొత్తం 9 స్థానాలను కాంగ్రెస్ మూట గట్టుకున్నది.

 

రాజకీయాలన్నీ ఆ రెండు కులాల చుట్టూనే

 

కర్ణాటకలో ఇంతదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రాజకీయాలు లింగాయత్, వక్కళిగుల మధ్యే పరిభ్రమించాయి. ముఖ్యమంత్రి కాగల తాహతున్న తమ కులానికి చెందిన నాయకుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మూకుమ్మడిగా మద్దతు పలకడం ఈ రెండు కులాలకు ఆనవాయితీగా వస్తున్నది. అయితే 1990 తర్వాత లింగాయత్ లు కాంగ్రెస్ ను తమ బద్ధ శత్రువుగా చూడసాగారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ లందరినీ సమీకరించి కాంగ్రెస్ కు ఘన విజయం సాధించి పెట్టిన వీరేంద్ర పాటిల్ ను, అతను పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పరామర్శించడానికి వచ్చిన పార్టీ అధినేత రాజీవ్ గాంధీ, ఢిల్లీ తిరిగివెళుతూ విమానాశ్రయం నుంచి పంపిన ఓ పేపర్ ముక్క సందేశంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో లింగాయత్ లకు కడుపు మండిపోయింది. 1994లో జరిగిన తదుపరి ఎన్నికల్లో వారి ఆగ్రహం ధాటికి కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 178 నుంచి 34కు పడిపోయింది. కాంగ్రెస్ వోట్ల  వాటా ను పంచుకున్న జనతా దళ్ (115), బిజెపి (40) తలవని తలంపుగా ఉన్నట్టుండి బాగుపడిపోయాయి. తదుపరి పరిణామాల్లో దేవేగౌడ, యడ్యూరప్ప వక్కళిగ, లింగాయత్ కులాలకు తిరుగు లేని నాయకులుగా వేళ్లూనుకున్నారు. ఇటు కాంగ్రెస్ పై లింగాయత్ ల ద్వేషం మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నది.

పట్టించుకునే వారే లేని పప్పు

జనబాహుళ్యంలోకి వెళ్లి క్షేత్ర పరిశీలన జరిపినప్పుడు విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వోటర్లలో, మెచ్చుకున్నా, నొచ్చుకున్నా అందరూ నరేంద్ర మోడీ గురించి చెప్పేవాళ్లే తప్ప కాంగ్రెస్ యువరాజు రాహుల్ బాబు గురించి పట్టించుకున్న వాళ్లే కరవయ్యారు. మోదీ చేసిన వివిధ పనుల్లో పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టీ విధింపును మెచ్చుకునే వాళ్లే ఎక్కువ మంది తారస పడ్డారు. నల్లడబ్బు ధనపిశాచులపై ఎక్కుపెట్టిన బాణమని కసిగా పెద్దనోట్ల రద్దును అభివర్ణిస్తున్న ప్రజలు మోదీకి ఇంకో అవకాశం ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు. రోడ్డు పక్కన టీ దుకాణం యజమానీ, అక్కడ టీ తాగడానికొచ్చిన సామాన్యూలూ, పల్లెటూళ్లో రచ్చబండ మీద బాతాఖానీ కొడుతున్న వృద్ధులూ, మధ్యవయస్కులూ, కుర్రకారు ఆటో డ్రైవర్లు, వీళ్లందర్లోనూ మోదీ పట్ల సానుకూలతే అధికంగా కనిపిస్తున్నది. ఓ వర్గం బిఎస్ఎన్ ఎల్ ఉద్యోగులు మాత్రం మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బిఎస్ఎన్ ఎల్ ను సర్వనాశనం చేసేందుకు, ప్రైవేట్ హస్తాలకు అప్పజెప్పేందుకు జరుగుతున్న కుట్రలో మోదీ కూడా భాగస్వామే నని  వారి ఆరోపణ. మా పాత్రికేయ బృందం మాట్లాడిన వాళ్లలో రాహుల్ గాంధీ ప్రస్తావన తెచ్చిన వారెవరూ లేరు.

వ్యతిరేక వోటు ప్రభావం

ఇవి లోక్ సభ ఎన్నికలు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక (యాంటీ ఇన్ కంబెన్సీ) వోటు అంటే మోదీ ప్రభుత్వానికి విఘాతంగా పరిణమించాలి. కానీ కర్ణాటకలో సీన్ రివర్సయినట్టు అనిపిస్తున్నది. మోదీ, అమిత్ షాల బృందం తమ విజయాలు ఏకరువు పెట్టడం కంటే, మూడు ఏడుపులూ, ఆరు నిట్టూర్పులుగా కుంటి నడక నడుస్తున్న సంకీర్ణ పాలనపై ఎక్కుపెడుతున్న వ్యంగ్యాస్త్రాలకే జనం నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇన్నాళ్లూ తండ్రీ-కొడుకుల పార్టీగా కుఖ్యాతి పొందిన జెడిఎస్ తాజాగా లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని తాత-తండ్రి-మనవళ్ల ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ పార్టీగా సరికొత్త ఘనకీర్తి సాధించింది. తమ వాటా ఎనిమిదింటిలో మూడు స్థానాల్లో జెడిఎస్ తాతా మనవళ్లు- తుమకూరులో దేవేగౌడ, మండ్యలో కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ, హాసన్ లో రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ గౌడ పోటీ చేస్తున్నారు. కుటుంబ రాజకీయాల్లో మరీ ఇంత బరితెగించిన సిగ్గు లేని తనమా అని జనం నోళ్లు నొక్కుకుంటుంటే, వీళ్లతో పొత్తు మన పుట్టి ముంచేలా ఉందని కాంగ్రెస్ కళవళ పడుతున్నది.

సుమలత ఫ్యాక్టర్

కన్నడ సినీ నటుడు రెబల్ స్టార్ అంబరీష్ ఇదివరకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన మం డ్య లోక్ సభ స్థానానికై పట్టుబట్టకుండా ఆ స్థానాన్ని జెడిఎస్ కు వదిలేయడం ద్వారా కాంగ్రెస్ మహాపరాధానికి పాల్పడింది. అంబరీష్ ఇటీవలే మరణించిన దృష్ట్యా, ఆయన సతీమణి సుమలత అభ్యర్థించిన మేరకు ఆమెనే తమ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించి ఉంటే సానుభూతి వోట్ల ఆసరాతో విజయం సులభ సాధ్యమయ్యేది. అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య జిల్లాలోని మొత్తం ఏడు స్థానాలనూ జెడిఎస్ గెల్చుకున్న మాట నిజమే అయినప్పటికీ, అసెంబ్లీలో తమకు రెండింతల బలం ఉన్నప్పటికీ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే జెడిఎస్ కు త్యాగం చేసిన కాంగ్రెస్, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మండ్య కోసం గట్టిగా బేరమాడి ఉండవచ్చు. దీనికి తోడు, నిఖిల్ కుమారస్వామి రాజకీయ అరంగేట్రం కోసం అంబరీష్ చితిమంటల చిటపటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్న మండ్య లోక్ సభ స్థానాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడం సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలకు రాజకీయంగా ఆత్మహత్యా సదృశమైన చర్య. తమ పార్టీ అభ్యర్థిని రంగంలో దించకుండా, అంబరీష్ పట్ల గౌరవంతో సుమలతకు మద్దతు ప్రకటించడం బిజెపికి భారీగా కలిసి వచ్చే వ్యూహం. అంతా కలిసి ఇప్పుడు సుమలత ఫ్యాక్టర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపి కాంగ్రెస్, జెడిఎస్ ల విజయావకాశాలను దారుణంగా దెబ్బ తీసే స్థాయికి చేరింది.

దేవేగౌడ ఎప్పటిలా హాసన్ నుంచి పోటీ చేసి, మండ్య స్థానాన్ని సుమలత (కాంగ్రెస్)కు వదిలి, తుమకూరులో మరో దీటైన అభ్యర్థిని రంగంలో దించి ఉంటే సంకీర్ణ పక్షాలు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవని ప్రజల మాట.

మండ్య లో నిఖిల్ విజయం కోసం జెడిఎస్ తన యావత్తూ అంగబలం, అర్థబలం వినియోగించడం, ప్రచారంలో హుందాతనాన్ని తుంగలో తొక్కి, దేవేగౌడ వంటి కురువృద్ధుడు మొదలు ఛోటా మోటా నాయకుడి దాకా సుమలతను అనరాని మాటలని నీచస్థాయికి దిగజారడం వంటి చర్యలు జనానికి రోత పుట్టించాయి. సంకీర్ణ ధర్మాన్ని మరచి కాంగ్రెస్, జెడిఎస్ శ్రేణులు తమ తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం ఆ రెండు పార్టీల కొంపమునగడానికి మరో కారణంగా ఉంది. ఉదాహరణకు తుమకూరులో దేవేగౌడ హేమావతి జలాల సుడిగుండంలో చిక్కి అల్లాడుతున్నారు.

పైన పేర్కోన్న అంశాలన్నీ బిజెపికి లాభించేవి కాగా ప్రజల్ని సమ్మోహితులను చేసే వాగ్ధాటి గల యడ్యూరప్ప, సిటి రవి, ప్రతాప్ సింహ వంటి నాయకులెవరూ తొలిదశలో ఉధృతస్థాయిలో ప్రచారం చేయలేదు. ప్రచారానికై స్థానిక నాయకులు కేవలం మోదీ, అమిత్ షాలపైనే అమితంగా ఆధారపడినట్టు అనిపించింది.

గత గురువారం తొలిదశలో 14 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యాక కాంగ్రెస్ జరిపిన సమీక్షల్లో పరిస్థితి ఏ మాత్రం ఆశావహంగా లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రెండో దశలో ఈ నెల 23న మిగిలిన 14 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. మరి రెండో దశ పోలింగ్ నాటికి ఉభయ శిబిరాలూ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోడానికి ఏయే చర్యలు తీసుకోనున్నాయో వేచి చూడాలి.

          

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *