జగిత్యాలలో ఈవీఎంల వివాదంపై వాస్తవాలను ఆధారాలతో బహిర్గతం చేసిన 9 మంది జర్నలిస్టులపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) కోరింది.
గురువారం సాయంత్రం టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డిని కలిసి జగిత్యాలలో అసలేం జరిగిందో వివరించింది. జగిత్యాల పట్టణంలో ఈవీఎంలను రాత్రివేళల్లో తరలిస్తున్న సమాచారాన్ని అందుకున్న వివిధ ఛానళ్లు, పత్రికల స్థానిక జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీశారని విరాహత్ అలీ తెలిపారు.
అయితే తమ దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రజల ముందుంచడానికి, విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ చర్యల ద్వారా ప్రజలకు, మీడియాకు అనుమానాలు కలిగించిన రెవెన్యూ అధికారులు తప్పును కప్పిపుచ్చుకోడానికే తమ విధులకు జర్నలిస్టులు ఆటంకం కలిగించారని అభియోగం మోపి పోలీసులకు ఫిర్యాదు చేసారని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటనపై విచారణ జరపకుండానే జగిత్యాల పట్టణ పోలీసులు ఐపిసి 447, 186, 505(2) సెక్షన్ల క్రింద 9 మంది జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినందున దానిని ఎత్తివేసేందుకు తగు చర్యలు చేపట్టాలని టీయుడబ్ల్యుజె బృందం కోరింది. డిజిపిని కలిసిన వారిలో టీయుడబ్ల్యుజె నాయకులు రాజేష్, రియాజ్ అహ్మద్, శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సిద్దార్థ తదితరులు ఉన్నారు.
జగిత్యాలలో 9 మంది జర్నలిస్టులపై నమోదైన కేసుపై విచారణ జరిపించి న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్ రెడ్డి టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.