‘మా నీళ్లు గజ్వేల్,హైదరాబాద్ కి వెళ్లాయి… పంటలిలా ఎండాయి…’

బుగ్గారం:ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పాలకుల నీటి దోపిడీ వల్లనే తమ ప్రాంతంలో సాగు నీరందక పంట పొలాలన్నీ ఎండి పోతున్నాయని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి  ఆవేదన చెందారు.

ఎండుతున్న పంటలతో రైతులంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితీలు మాత్రం రైతుల గురించి పట్టించు కోవడం మానేశాయని  గంగారెడ్డి ఆరోపించారు.

మంగళ వారం ఆయన బుగ్గారం మండలంలోని వివిధ ప్రాంతాలలో ఎండిపోతున్న వరి పొలాలను, పశువులు మేస్తున్న పంట పొలాలను తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్
శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిని ఇక్కడ పంటల సాగుకు సరఫరా చేయకుండా ముందస్తుగానే హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్ లాంటి నగరాలకు నీటిని తరలించడం వల్లనే ఈ ప్రాంత పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని పాలకుల తీరుపై మండిపడ్డారు.

కేసీఆర్ నీళ్ల దోపిడీ చేసి ఈ ప్రాంతం నుండి నీటిని తరలించుకు పోతుంటే మా నీళ్లు మాకే కావాలని అడ్డు తిరిగి రోడ్ల పై ధర్నాలు చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన చెందారు.

ఇదంతా జరుగుతున్నా ఈ ప్రాంత అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికార పార్టీచే నియమించబడ్ద రైతు సమన్వయ సమితీలు ఏ మాత్రం స్పందించకుండా ఉండడం సిగ్గు చేటన్నారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి సాగు నీరందక పంటలు ఎండిపోయిన రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. లేనిచో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దనవేని శంకర్, ఓయూ విద్యార్థి నాయకులు కండ్లే మదన్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, గోపులపూర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవిందుల రమణ, చిట్ల విజయ్, సంతోష్, జక్కుల లింగన్న, బిజెపి నాయకులు చుక్క మల్లారెడ్డి, నగునూరి శ్రీనివాస్, రైతులు
విలసాగరపు పోచరాజు, సిరికొండ గంగాధర్, కెలేటి రాజన్న, విలసాగరపు శ్రీకాంత్, నాగుల గంగాధర్, బిసగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *