ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ (పికె) తన సేవలకు పేమెంట్ వసూలు చేసుకునేందుకు వేసిన వలలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పడిపోయారని టిడిపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యనించారు.
పే మెంట్ కోసం పికె బృందం జగన్ ని భ్రమల్లో ఉంచుతున్నదని, ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఆశలు కల్పించారని, దానిని జగన్ కూడా నమ్ముతున్నాడని ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ భ్రమల్లోనుంచే జగన్ ముఖ్యమంత్రి అయినట్లు శిలాఫలకం కూడా తయారు చేసుకుంటున్నారని ఆయన ఏద్దేవా చేశారు.ఇది జగన్ పదవి పిచ్చికి పరాకాష్ట అని ఆయన అన్నారు.
ఎన్నికల కమిషన్ ఇవిఎంల మీద చర్చనుంచి తప్పించుకునేందుకు కుంటిసాకులు వెదుకుతున్నదని ఆయన అన్నారు.31 కేసులన్న జగన్ , విజయసాయ్ రెడ్డి లకు వెంటనే స్పందించడం పట్ల ఇసి తీరును ఆయన విమర్శించారు. ‘ ఇవిఎంల మీద చర్చకు కేసులున్నాయనే నెపంతో హరిప్రసాద్ ను వద్దంటున్నారు. మరి ఇన్ని కేసులన్న జగన్, విజయ్ సాయిరెడ్డిలకు ఎలా స్పందిస్తారు,’ అని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పోరాటం ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలను మేలుకొల్పిందని చెబుతూ పోలింగ్ని ఏ విధంగా ఆలస్యం చేయవచ్చో ఆంధ్రప్రదేశ్లో ఈసీ చేసి చూపించి నిరూపించిందని ఉమ అన్నారు.
ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించేందుకు చివరకు ఇసి కూడా కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. అయితే, ప్రజలు దీనిని కొనసాగనీయలేదని వారు కసిగా ఓటింగులో పాల్గొన్నారని అన్నారు.
టిడిపి సానుభూతిపరులు ఉన్న పోలింగ్ కేంద్రాలలోనే ఈవీఎంలు పనిచేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళలు దీనిని ఆధిగమించి , ఎక్కువ సంఖ్యలో ఓటేసేందుకు వచ్చి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని ఉమ అన్నారు.