ఎవరీ జార్జి రెడ్డి? ఈ తరం కోసం ఒక పరిచయ వాక్యం

 

(ఏప్రిల్ 14 జార్జి రెడ్డి వర్ధంతి సందర్భంగా)……

 

ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 47 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే! అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు.

జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాడు; ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా- అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జన్మించాడు జార్జి- 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానం! పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జిరెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్.

చిన్నప్పటినుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అప్పటికే సాంఘిక చైతన్యంతో సమకాలీన సమాజంలోని విషాదాల్ని- ఒకరు మరొకర్ని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్నాడు. వామపక్షతత్వ అంశాల్ని, మార్క్సిస్ట్ ఆలోచనల్ని నీలం రామచంద్రయ్య మాస్టారి దగ్గర మరింత తెలుసుకున్నాడు జార్జిరెడ్డి. జార్జి ఆలోచనలు పదును తేలాయి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసొచ్చింది. ఎమ్మెస్సీలో ఉండగా విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటికై పోరాడటం సహజంగానే జరిగిపోయేది. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధం విధిస్తూ ‘రస్టికేట్’ చేశారు ప్రిన్సిపాల్.

మరొకరెవరైనా అయితే – క్లాసులకు వెళ్లలేని ఆ ఏడాదిపాటూ అల్లరిచిల్లరగా తిరిగేవారేమో, నిరాశతో గడిపేవారేమో! కాని జార్జిరెడ్డికి ఆ సంవత్సరం బంగారంలాంటి కాలం. ఆ ఒక్క ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాడో అంతులేదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞానమూలమైన పుస్తకమంటే పిచ్చిప్రాణం జార్జికి. తన సబ్జెక్టులయిన భౌతిక, గణిత శాస్త్ర ప్రాథమిక సూత్రాల్ని మరింత అధ్యయనం చేశాడు. మార్కోవ్ గణితశాస్త్ర పాఠ్యపుస్తకాల లెక్కల్ని ఆమూలాగ్రం సాల్వ్ చేసేవాడు. అంతేకాదు, చుట్టూ ఎప్పుడూ పది పదిహేనుమంది విద్యార్థులు. వారికి ఆయా గణితశాస్త్ర సమస్యల్ని ఇట్టే విడమరచి చెప్పేవాడు. బెర్క్‌లీ ఫిజిక్స్ పుస్తకంపై సవివరమైన నోట్స్ తయారు చేసుకున్నాడు. నోమ్ చామ్స్కీ, ‘ఎట్ వార్ విత్ ఆసియా’, ఫ్రెడరిక్ హెగెల్ ‘సైన్స్ ఆఫ్ లాజిక్’, జేమ్స్ జాల్ ‘ది అనార్కిస్ట్’, అలెక్స్ హేలీ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్’, రెజిదిబ్రె ‘రివల్యూషన్ ఇన్ రివల్యూషన్’, ఫ్రాంజ్ ఫెనన్ ‘రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్’ లాంటి అనేకానేక పుస్తకాల్ని అధ్యయనం చేశాడు.

పాతికేళ్లు కూడా లేని ఒక కుర్రాడు అన్నేసి గంటలపాటు ఇన్నేసి పుస్తకాలు చదవడం ఆశ్చర్యకరమైన విషయం. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం సాగించిన చే గువేరా – జార్జిని అమితంగా ఆకర్షించాడు. చే రచించిన ‘గెరిల్లా వార్‌ఫేర్’, ‘ఆన్ రివల్యూషన్’. ‘వెన్ సెరిమోస్, ‘బొవీలియన్ డైరీ’ లాంటి గ్రంథాలు జార్జిని విశేషంగా ప్రభావితం చేశాయి. అంతేకాదు, ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనల్ని సైతం అక్షరమక్షరమూ ఔపోసన పట్టాడు జార్జిరెడ్డి. మార్క్సిజాన్ని, ఆ తత్త్వంతో మానవ సమాజ పరిణామాన్ని, పీడన సాగే విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు. ఏడాది అజ్ఞాతవాసం లాంటి ‘రస్టికేషన్’ ముగిసింది. ఎమ్మెస్సీ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. గోల్డ్‌మెడల్ పొందాడు. ఓ పక్క సబ్జెక్ట్, మరోపక్క గ్రంథపఠనం- అసలైన విద్యను అందుకున్నాడన్నమాట.

విస్తృత అధ్యయనం వల్ల జార్జిరెడ్డిలో మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిని చేశాయి. 1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం… అన్నీ జార్జిరెడ్డిని అవ్యక్తపుటూహలతో కుదిపేసేవి.

1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చారల్స్ డి గా ల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం కావచ్చు; అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు; అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన వియత్నాం ప్రజాపోరాటాలు కావచ్చు… అన్నీ జార్జిరెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక షే గువేర, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో ఆయా విప్లవ పోరాటాల్ని సశాస్త్రీయ హేతువాద దృష్టితో అవలోకనం చేసుకున్నాడు.

ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జిరెడ్డికి. వెరసి ఒక ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన వ్యక్తిత్వం సంతరించుకుంది జార్జిలో! దరిమిలా జార్జిరెడ్డి క్యాంపస్‌లో ఓ ‘హీరో’అయ్యాడు.

అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జిరెడ్డి ఆత్మవిశ్వాసం నడుస్తున్నట్లుగా ఉండేది. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు.

స్వతహాగా జార్జి బాక్సర్, బ్లేడ్ ఫైటర్. అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు జార్జిరెడ్డి. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు… ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలున్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా దాడులు జరిగాయి జార్జిపై. అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి సిద్ధంగా ఉండేది.

ఇదంతా ఒక ఎత్తు, విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జి చేసిన కృషి ఒకటీ ఒక ఎత్తు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూచొని కబురులు… రాత్రిళ్లు, అందునా వర్షం కురుస్తున్న రాత్రిళ్లు, వెన్నెల రాత్రిళ్లు… నలభై ఏభై మంది చుట్టూ… మధ్యలో జార్జి… అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జిరెడ్డి ప్రసంగాల్లాంటి ప్రసారాలు… బండక్యాంటీన్ దగ్గర.. స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో పాలస్తీనా సమస్య, గ్వాటెమాలా సంఘటనలు, ఫోకోసిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు.. ఇలా ఎన్నెన్ని అంశాలపై జార్జిరెడ్డి ఉపన్యాస ధార సాగేదో అంతులేదు. కేవలం భావజాలమే కాదు, ఆచరణ కూడా జార్జిరెడ్డిలో కనిపించే తత్త్వం. స్లిప్పర్లే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని! ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితమ్మీద రాస్తే… మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. దేన్నయినా మితంగా, పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు.

అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బుల్ని ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేకానేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు. అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆద ర్శాల్ని వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. జార్జిరెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలన్న కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలోని అతని ఇంటి సమీపంలో దాడి జరిగింది. గాయాలపాలయ్యాడు. ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించారు. ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే- ఏప్రిల్ 14న సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర ప్రత్యర్థుల చేతిలో హతుడయ్యాడు. తాను మరణించి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. విద్యార్థి నాయకుడు- జ్ఞానం, ప్రేమ, మానవతల విషయంలో ఎలా ఉండాలో నేర్పాడు. తాను పుట్టిపెరిగిన సహజ జీవన స్థితినుంచి పేదల జీవిత స్థితికి మారాలనుకున్న తత్త్వం జార్జిలో విశేషమైంది. జీవన విధానాన్ని కింది వర్గాలకు అనుగుణంగా మార్చుకునే డీ క్లాసిఫై తత్త్వమే – జార్జిని అమరుణ్ని చేసింది. అతడు బతికుంటే.. ఇండియన్ చే గువేరా అయి ఉండేవాడు. సందేహం లేదు.

(సోషల్ మీడియా నుంచి)

One thought on “ఎవరీ జార్జి రెడ్డి? ఈ తరం కోసం ఒక పరిచయ వాక్యం

  1. Great leader,very good precedent for today’s leaders.Very unfortunate that today’s student is not ardent reader, social media dominates and the ambitions are dominated by material things.Parents also discourage students from pursuing their dreams.Parents want their kith and kin to be engineers,doctors or software employees or abroad part-time worrkers but not great thinkers.Hope there will be u turn in the future

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *