ఏపీలో ఇంకా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవీఎం లలో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు సమయం కల్పించనున్నట్టు ఈసీ ప్రకటించింది. దీంతో పలు కేంద్రాల్లో ఓటు వేసేందుకు జనం ఇంకా బార్లు తీరి ఉన్నారు.
కాగా తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఏ రూపంలో బాబుకి కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అని ఆసక్తికర చర్చలు నడిచాయి. అనంతరం కేటీఆర్… జగన్ తో భేటీ అవడం పలు చర్చలకు దారి తీసింది. టీఆరెస్ పార్టీ వైసీపీకి మద్దతుగా నిలిచింది.
ఇక టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వెనుక టీఆరెస్ ప్రోద్భలం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ కి సపోర్ట్ చేయడమే అని జోరుగా సాగుతున్న చర్చ. అయితే ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు వైసీపీ అధినేత జగన్.
ఏపీలో జరిగిన ఎన్నికలపై ఈరోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించిన ఆయన కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ గురించి కూడా స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ తో తనకు సంబంధం లేదని, అది కేసీఆర్-చంద్రబాబులకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుయుక్తులు పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని, ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో ఓటమి ఖాయమని భావించిన చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/trs-kavitha-faces-bitter-experience-in-polling-station/