తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. మరికల్ మండలంలోని తీలేరులో ఉపాధి హామీ పనుల్లో భాగంగా మహిళా కూలీలు మట్టి దిబ్బలు తవ్వుతున్నారు. అక్కడ నేల వదులుగా ఉండడంతో ఒక్కసారిగా మట్టిపెల్లలు కూలీ వారి పై పడ్డాయి.
15 మంది కూలీల పై మట్టి పెల్లలు పడడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనతో తెలంగాణలో విషాదం నెలకొంది. దీని పై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఆదుకుంటామని హామీనిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.