మోదీ మీద మీ దాడిలో నిజాయితీ ఉందా? : కెసిఆర్ కు వరవరరావు భార్య లేఖ

కొద్ది రోజులుగా  మోదీ మీద  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విరుచుకుపడుతున్నారు. దేశాన్ని  మతం పేరుతో విభజించి నాశనం చేస్తున్నారన్నారు.మరలాంటపుపుడు తెలంగాణ బిడ్డ, ప్రత్యేక తెలంగాణ వాది అయిన వరవరరావు మీద నిర్భంధం విధించి, కేసులు పెట్టి మోదీ ప్రభుత్వం హింసిస్తున్నపుడు పల్లెత్తు మాట  అనలేదేందుకు? అందుకే కెసిఆర్ మోదీ చేస్తున్న విమర్శల్లో నిజాయితీ ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ వరవరరావు సహచరి ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పూర్తి పాఠం ఇదే.

 

 

హైదరాబాద్,
ఏప్రిల్ 9, 2019.

గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారికి,

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అబద్ధాల మీద, అక్రమాల మీద గత కొద్ది రోజుల ఎన్నికల ప్రచారంలో మీరు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఈ లేఖ రాస్తున్నాను. మోడీ ప్రభుత్వం, ఆయన పార్టీకే చెందిన మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర పోలీసులు ఆడుతున్న అబద్ధాలను, బనాయిస్తున్న అబద్ధపు కేసులను మీ దృష్టికి తీసుకు రావడం కోసం ఈ లేఖ. ఈ విషయాలలో కూడ మీ అభిప్రాయం, వైఖరి ఏమిటో బహిరంగంగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.

కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, సంఘ్ పరివార్ పన్నిన భారీ కుట్రలో భాగంగా ‘భీమా కోరేగాం హింసాకాండ కేసు’ అనే అబద్ధపు కేసు బనాయించి పుణె పోలీసులు నా భర్త వరవరరావుతో సహా పది మంది మేధావులను నిర్బంధించారు. తప్పుడు ఆరోపణలపై అక్రమంగా బనాయించిన ఈ కేసులో నిందితులుగా వరవరరావు గత ఐదు నెలలుగా పుణెలోని యరవాడ జైలులో నిర్బంధంలో ఉన్నారు.

గతంలో విప్లవ రచయితల సంఘంపై నిషేధం విధించి, వరవరరావును ఇదేవిధంగా అక్రమ నిర్బంధంలో ఉంచినప్పుడు మీరు కేంద్ర మంత్రిగా ఉండి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రొటోకాల్ నిబంధనలను కూడ పక్కనపెట్టి, చంచల్ గూడ జైలులో వరవరరావును 2005 సెప్టెంబర్ 3 న కలిసిన ఉదంతాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేయదలచాను. విరసంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని న్యాయమూర్తుల బృందం ఆ తర్వాత మూడు నెలలకు కొట్టివేసింది గాని, మీరు కలిసే నాటికి నిషేధం అమలులో ఉంది. అప్పుడు కేంద్ర మంత్రిగా ప్రొటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి, ఆయనను జైలులో కలిసిన మీరు, ప్రస్తుత స్థితిలో ఆయన అనుభవిస్తున్న దారుణ నిర్బంధం విషయంలో కూడ అటువంటి వైఖరే తీసుకుంటారని ఆశిస్తున్నాను.

వరవరరావు తెలంగాణ బిడ్డ. 1968 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన ఈ యాబై సంవత్సరాలుగా తన కలాన్నీ గళాన్నీ వినియోగిస్తున్నారు. 1969 జై తెలంగాణ ఉద్యమానికి కారణమైన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు. 1969 ఉద్యమానికి, 1972 ఉద్యమానికి కవిగా, పత్రికా సంపాదకుడుగా, ఉపన్యాసకుడిగా ఆయన చేసిన దోహదం చరిత్రకెక్కింది. ఆయన తెలంగాణ విమోచనోద్యమ నవల మీద పి ఎచ్ డి పరిశోధనతో పాటు తెలంగాణ సమస్యల మీద వందలాది రచనలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడ 1997 వరంగల్ డిక్లరేషన్ నాటి నుంచి ఇప్పటిదాకా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అనుకూలంగా ఎంతో కవిత్వం రాశారు, వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు.

వరవరరావు గురించి తెలంగాణ వైతాళికులు కాళోజీ, ప్రొ. కె జయశంకర్ అన్న మాటలను, వారిద్దరితో ఆయన అనుబంధాన్ని కూడ ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలచాను. “బాధలకు గురైన వారినందరినీ తనవారిగా, మనవారిగా గుర్తించి స్పందించేవాడు తప్పకుండా అందరివాడు…. అందరివాడైన వరవర్ మనవాడు కావడం విశేషం. నా వాడు కావడం నాకు మరీ మరీ విశేషం” అన్నారు కాళోజీ. “వరవరరావు నాకు ఎంతోకాలంగా స్నేహితుడు. సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ నేను చాల గౌరవించే వ్యక్తులలో వరవరరావు ముఖ్యుడు” అన్నారు జయశంకర్. ఇవాళ ఆ ఇద్దరూ సజీవంగా ఉంటే వరవరరావు అక్రమ నిర్బంధాన్ని ఖండించడంలో అందరికన్న ముందు ఉండేవారు.

తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం, పెద్ద ఎత్తున కృషి చేసిన కవి, రచయిత, వక్త ఒక పొరుగు రాష్ట్రపు పోలీసుల దుష్ట పన్నాగానికి గురి అయి నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయనకు సంఘీభావం తెల్పడం తెలంగాణ సమాజం బాధ్యత. తెలంగాణ ప్రభుత్వాధినేతగా అది మీ బాధ్యత కూడ. మోడీ – సంఘ్ పరివార్ అబద్ధాలను వ్యతిరేకిస్తున్న వ్యక్తిగా మీ బాధ్యత మరింత పెరుగుతున్నది.

వరవరరావు గారికి నిర్బంధాలు, ఆంక్షలు కొత్త కాదు. గత 45 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన మీద 25 అబద్ధపు కేసులు బనాయించారు. గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ పోలీసులు కూడ ఆయనను మూడు సార్లు అక్రమ నిర్బంధానికి గురి చేశారు. ఆయన మీద గత కేసులలో పోలీసులు అనేక తీవ్రమైన నేరారోపణలు చేశారు. కాని ప్రాసిక్యూషన్ ఒక్క కేసులో ఒక్క ఆరోపణనైనా రుజువు చేయలేకపోయింది. 25 కేసుల్లో 13 కేసులను న్యాయస్థానాలు కొట్టివేసి వరవరరావును నిర్దోషిగా విడుదల చేశాయి. మూడు కేసులను న్యాయస్థానాలు విచారణ అవసరం కూడ లేదని క్వాష్ చేశాయి. మరొక తొమ్మిది కేసులను విచారణ స్థాయికి రాకముందే పోలీసులే ఉపసంహరించుకున్నారు. ఈ కొట్టివేతకు గురైన కేసులలో విచారణలో ఉన్న నిందితుడిగా ఆయన ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇవాళ పుణె పోలీసులు పెట్టిన కేసు, జైలులో ఉండగానే అహెరిలో బనాయించిన మరొక కేసు కూడ అటువంటి అబద్ధపు కేసులే. రేపు ఎలాగూ న్యాయస్థానాలలో నిలవవు. కాని ఈలోగా ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుట్ర పన్నింది. అనారోగ్య పీడితుడిగా, 79 సంవత్సరాల వృద్ధుడిగా ఉన్న ఆయనను ఇలా వేధించడం అమానవీయం, చట్టవ్యతిరేకం. గతంలో అన్ని కేసుల విచారణకు హాజరైనట్టే ఈ విచారణకు కూడ హాజరవుతారు గనుక ఆయనను బెయిల్ మీద వెంటనే విడుదల చేయవచ్చు.

ఆయన తెలంగాణ ప్రజలకు చేసిన సేవలు, ఆరోగ్య స్థితి, వయసు దృష్టిలో పెట్టుకుని, మహారాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ అక్రమ నిర్బంధం మీద మీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరుతున్నాను. నరేంద్ర మోడీ పట్ల మీరు ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్బంధం మీద మీ నిర్ద్వంద్వమైన వైఖరి ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాను.

– పి. హేమలత
– వరవరరావు సహచరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *