తన పార్టీ తరఫున 49 మంది తనకే తెలియని అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఇదేం పోయే కాలమని వాపోతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రైస్తవ ప్రచారకుడు కెెఎ పాల్.
యమ సీరియస్ గా తయారయిన ఆంధ్ర ఎన్నికల ప్రచారాన్ని, రాజకీయాలను కెఎ పాల్ బాగా రక్తి కట్టిస్తున్నారు.
ఆయనా లేకపోతే, తిట్లు, శాపనార్థాలు, పిచ్చి పిచ్చి వాగ్దానాలు, బెదిరింపులు, ఆడియోలు, వీడియోలతో… ఆంధ్రలో ప్రచారం తెగ బోర్ కొట్టేది.
ఈ పరిస్థితినుంచి ఆంధ్రావాళ్లను కాపాడి రిలీఫ్ ఇచ్చేందుకే ఆయన్నెవరో మహానుభావుడు ఎన్నికల్లోకి పంపారని అనిపిస్తుంది. ఈ రోజు ఆయనేమన్నారో చూడండి.
“ఎపి లో ఎన్నికలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేశాం.మేము ఉన్న హోటల్ నుంచి మా బి ఫారాలను దొంగిలించుకెళ్లారు. మా పార్టీ తరపున 49 మంది మాకు తెలియని, మాతో సంబంధం లేని వ్యక్తులు పోటీ చేస్తున్నారంటే ఏమనుకోవాలి?
ఇందులో టిడిపి నుంచి 38 మంది, వైసిపి 11మంది అభ్యర్థులు మా గుర్తుతో మా అభ్యర్థులుగా నిలబడ్డారు.
ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి టిడిపి, వైసిపిలు కుట్ర చేస్తున్నాయి.ఒక మామిడి పండు పోయిందంటే పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారని ఆయన మామిడి పండు ఎలా ఉంటుందో చూపించారు.అయితే, మా బి ఫారాలు దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ ఐ ఆర్ కట్టలేదు.
మార్చి 16, 22 వ తేదీన నా పై దాడి చేసేందుకు ప్రయత్నించారు,నిన్న అంటే ఏప్రిల్ 6వ తేదీన మళ్లీ అదే గ్యాంగ్ వచ్చి పరిశీలించి వెళ్లారు. పోలీసులకు సిసి టివి ఫుటేజీ ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.మా అభ్యర్థుల జాబితాను కూడా దొంగిలించి.. అన్ని స్థానాలలో పోటీ చేయకుండా చేశారు.
ఎక్కడ ప్రచారానికి వెళ్లినా నాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.మా హెలికాప్టర్ గుర్తు కూడా జనాల్లోకి విస్తృతంగా వెళ్లింది.చంద్రబాబు సైకిల్ , పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తుకు ఓటు వేయవద్దు.
జగన్ నన్ను చంపించే ప్రయత్నం చేశారు.అతని మాటలు ఎవరూ నమ్మవద్దు. నన్ను అన్యాయంగా జైల్లోకి పెట్టించి ఇబ్బందులు పెట్టారు
వివేకానందరెడ్డి హత్య కేసు లో అనేక ఆసక్తికరమయిన విషయాలు ఉన్నాయి.కోర్టు ఆదేశాలు ఉన్నందున ఇపుడు చెప్పలేను గాని తర్వాత అన్ని విషయాలువెల్లడిస్తా. గతంలోనే వివేకానంద రెడ్డిని జగన్ కొట్టారు.. అప్పట్లో మీడియా లో కూడా వచ్చింది.
జగన్, సిఎం అయితే వివేకా కేసు నీరుగారిపోతుంది.జగన్ వంటి అవినీతి పరుడు జనంలో కాదు.. జైల్లో ఉండాలి.వైయస్ కొడుకుగా వచ్చిన జగన్ కు సిఎం అవడానికి ఏ అర్హత ఉంది
గాంధీకి కూడా చాలా మంది వారసులు ఉన్నారు, వారు రాజకీయాల్లోకి రాలేదే. నేను 175స్థానాలలో పోటీ చేసి ఉంటే , వందకు పైగా సీట్లు గెలిచేవాళ్లం. నేను ఎంపిగా గెలవడం ఖాయం, ప్రధాన రాజకీయ పక్షాలను కలుపుకుని పైట్ చేస్తా.
చంద్రబాబు, జగన్, పవన్ కుమాత్రం ఓటు వేయవద్దు. స్వతంత్ర అభ్యర్థులు, నోటాకు ఓటు వేయాలి
మాయావతి కాళ్లు మొక్కాల్సిన అవసరం పవన్ కు ఎందుకొచ్చింది. మాయావతి ఒకప్పుడు మాకే నమస్కారం చేసేవారు. ఏసుక్రీస్తు, నా కొడుకు మీద ఒట్టు.. నా వెనుక ఎవరూ లేరు.
ఇప్పటికైనా ఎపి లో ఎన్నికలు వాయిదా వేసి, ఏడో విడతలో నిర్వహించాలి.ఎన్నికల సంఘం మా అభ్యర్ధనను పట్టించుకోకపోతే .. న్యాయపరంగా పోరాడతాం”