(యనమల నాగిరెడ్డి)
వోటుకు నోటు అనేది ఢిల్లీ నుంచి గల్లీదాకా అమలయ్యే ఎన్నికల సంప్రదాయం. వోట్లకు వచ్చిన నోట్లను పార్లమెంటులో గుట్టులు గుట్టలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఫేమస్ వోటుకు నోటు కేసు సరే సరి. వోటున్న చోటల్లా నోట్లుంటాయి. ఇక సంపన్న పోలిటీషన్ల సంఖ్యలో టాప్ లో ఉండే తెలుగు రాష్ట్రాల విషయంగురించి, అందునా ఆంధ్రా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. నోట్లు వరదల్లా పారుతున్నాయక్కడ.
ప్రధానపార్టీలైన టీడీపీ, వైస్సార్ కాంగ్రెస పార్టీ అధినేతలకు చావో-రేవోగా ఉన్న ఈ ఎన్నికలలో డబ్బు నీళ్లలా ప్రవహిస్తున్నది. ఎన్నికల కమీషన్ (అశాస్త్రీయంగా నిర్ణయించిన ఎన్నికల ఖర్చులుప్రక్కన పెట్టి ) నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఈ ఎన్నికలలో ఆకాశమే హద్దుగా డబ్బులు ఖర్చు చేయడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ ఎన్నికలలో అందరు అభ్యర్థులు కలసి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రు.10,000 కోట్ల నుండి గరిష్టంగా రు. 15వేల కోట్ల వరకు వెదజల్లనున్నారని అంచనా.
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ డబ్బు ఖర్చు పెట్టడంలో చేతికి ఎముకలేని మహారాజుల్లా వ్యవహరిస్తున్నారు. చట్టాలున్నా, నియమనిబంధనలున్నా ఎన్నికల కమీషన్ కళ్ళకు గంతలు కట్టడంలో నిష్ట్నాతులైన నాయకులు ప్రస్తుతం మరింత పకడ్బందీగా వ్యూహాలు పన్ని అమలు చేస్తున్నారు.
ఎన్నికల ఖర్చులు
ఎన్నికల కమీషన్ నియమాల మేరకు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి 70 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థి 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డబ్బు పోలింగ్ రోజు బూతు ఖర్చు కు కూడా చాలదు. ఇక ప్రచారం, ఓటర్లకు పంపిణీ, నాయకుల కొనుగోలు, వాహనాలు, మందు-విందు ఖర్చులు ఉంటాయి. పాపం అభ్యర్థులు ఏం చేస్తారు. నిబంధనలు తుంగలో తొక్కి, తమ పని తాము చేయకపొతే వారు ప్రజాసేవ ఎలా చేస్తారు?
సంపన్న రాజకీయనాయకులున్న రాష్ట్రాల జాబితా అగ్రభాగాన ఉండే ఎపీలో అసెంబ్లీకి, పార్లమెంటులకు జరుగుతున్న ఈ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలంటే అశ్చర్య పోనవసరం లేదు. ఈ ఎన్నికల ఖర్చుతో ఒక ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేయవచ్చునంటున్నారు.
(పార్టీలు కాని, నాయకులు కానీ ఎలా సంపాయించారనే వివరాల జోలికి వెళ్ళకండి. అవి అధికారులకు,ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే)
ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి
ప్రతి నియోజకవర్గంలో సరాసరి రెండు లక్షల నుండి 2. 20 లక్షల వరకు ఓటర్లున్నారు. ఒక నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థి ప్రచార ఖర్చు కోసం (విందులు, వినోదాలు, మందు, ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు రోజు వారి కూలీ, వాహనాల ఖర్చు, డీజిల్, ఇతర చిల్లర ఖర్చులు కలిసి ) కనీసం 5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందట. నాయకుల కొనుగోలుకు, తన సొంత నాయకుల సంతృప్తి కోసం నియోజకవర్గ స్థితిని పట్టి 5 నుంచి 10 కోట్ల వరకు వెదజల్లాల్సి ఉంటుందట.
ఇకపోతే పోలీసు మేనేజ్మెంట్ , మండల, నియోజకవర్గ పోలీసు స్టేషన్ లకు, సంభందిత ఇతర అధికారుల ఖర్చుల కోసం ప్రతి అభ్యర్థి సుమారు 2 నుండి 4 కోట్ల వరకు కేటాయిస్తున్నారని తెలుస్తున్నది.
ఈ ఎన్నికలలో ఓటరు కనీస ధర వేయి రూపాయలుగా నిర్ణయించారని వినిపిస్తున్నది. (ఓటర్లు కూడా అంతకు తక్కువ అయితే అంగీకరించే స్థితి కనిపించడం లేదు). అభ్యరిని పట్టి, అక్కడున్న పోటీ పై ఆధారపడి ఈ మొత్తం ఈ సారి ఓటుకు 10 వేల వరకు ధర పలికే అవకాశం ఉందట.
(ఉదాహరణకు మంగళ గిరి,గుడివాడ, విజయవాడ సిటీలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు, చంద్రగిరి, నగిరి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, హిందూపురం, రాప్తాడు, కళ్యాణదుర్గం, తాడిపత్రి , జమ్ములమడుగు, రాజంపేట, కమలాపురం, ధోన్ , ఆలూరు, పత్తికొండ, నంద్యాల, కర్నూలు లాంటి బలమైన పోటీ ఉన్న నియోజకవర్గాలు) మనకు తెలిసింది తక్కువే.
అందువల్ల మిగిలిన నియోజకవర్గాలను కానీ, పోటీలో ఉన్నమిగిలిన ఘనాపాఠీలను కానీ తక్కువ చేయడం వ్యాసకర్త ఉద్దేశ్యం కాదని గమనించగలరు.
ఈ కనీస ఖర్చులు లెక్కవేస్తే ఓటుకు వేయి చొప్పున అయితే నియోజక వర్గానికి కనీసం 16 కోట్లు ఓటర్లకు,మిగిలిన 12 కోట్లు ఇతర ఖర్చులకు కలిపి 28 కోట్లుగాను, ఓటుకు 2వేలు అయితే నియోజకవర్గానికి 47 కోట్ల వరకు ఒక్కొక్క ఘనాపాటీ (గెలిచిన తర్వాత ప్రజాసేవకుడు) ఖర్చు చేయక తప్పదు. ఈ లెక్కన మొత్తం 175 నియోజకవర్గాలకు సరాసరి రు.9,800 నుండి రు. 10,750 కోట్ల వరకు ప్రధాన పార్టీలు ఖర్చు చేస్తే, ఇక జన సేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు కూడా ఏంతో కొంత ఎగ చాల్లాల్సిందే.
ఇక పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వస్తే వారు ప్రతి శాసనసభ అభ్యర్థికి కనీసం 10 కోట్ల చొప్పున, అవసరాన్ని పట్టి మరో 5 కోట్ల వరకు ఇస్తున్నారట. ఆయన ప్రచారం, అంతే వాసులకు ఇవ్వడం, ఇతర ఖర్చులు కలసి మరో 15 నుండి 20 కోట్ల వరకు వ్యయమవుతుందట.
ఆ లెక్కన చాలా నియోజకవర్గాలలో ఎం.పి అభ్యర్థి అధమ పక్షం రు. 80 నుండి రు. 90 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని సమాచారం. రెండు పార్టీల తరపున పార్లమెంటుకు పోటీ లో ఉన్న అభ్యర్థులు కలసి రు. 2500 లనుంచి రు. 4వేల కోట్లు బయటికి తీస్తున్నారనేది అంతేవాసుల లెక్క.
ఇందులో అభ్యర్థిని పట్టి ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి పార్టీ తరపున 10 కోట్లు, పార్లమెంట్ అభ్యర్థి నుండి 10 కోట్లు అందచేశారని, మిగిలిన మొత్తం అభ్యర్థి పెట్టుకోవాల్సి ఉంటుందనేది జరుగుతున్నప్రచారం. అవసరాన్ని, పోటీని, అభ్యర్థి ప్రాముఖ్యతను పట్టి ఈ నిధులు పెరగా వచ్చు లేదా తరగా వచ్చు. ఆర్థికంగా బలంగా ఉన్న వారైతే వారే ఖర్చు భరించడంతో పాటు పక్కన వారికి సాయం అందిస్తారనేది మరో సమాచారం.
డబ్బును దొంగతనంగా తరలించడం రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన ఒక కళ.
ఇకపోతే ఈ డబ్బును తమ ఖజానాలనుండి ఎవరికీ దొరకకుండా గ్రామ స్థాయికి తరలించడం ఎన్నికలను ఎదుర్కోవడంలో “తలపండిన రాజకీయ నాయకులకు” మాత్రమే సాధ్యమైన కళ. ఎన్నికల సంఘం, నిజాయతీ పరులైన అధికారులు ఎన్ని ఎత్తుగడలు వేసినా, చెక్ పోస్టులు పెట్టినా, నాయకులు, పార్టీల అధినేతలు అన్ని అవరోధాలు అధిగమించి డబ్బు తరలించడానికి విన్నూత్న(దొంగ) మార్గాలు కనిపెట్టి, విజయవంతంగా తమ ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
పాలవ్యాన్ లు, విద్యాలయాల వాహనాలు,భారీ సరకు రవాణా చేస్తున్న లారీలు, నీళ్ల టాన్కర్లు, ఆయిల్ టాన్కర్ లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు, అంబులెన్స్ ల , ఆర్టీసి బస్సుల ద్వారా రవాణా చేయడం వీరికి సులభమైన మార్గం. పేపర్ వ్యాన్ లు, మీడియా వాహనాలు ఉండనే ఉన్నాయి.
ఇకపోతే నాయకులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగరక్షక దళం అండ వీరికి పుష్కలంగా ఉండనే ఉంది. వీటన్నిటికి తోడు అస్మదీయులైన రక్షక భట అధికారులు మద్దతు పలుకుతూనే ఉన్నారు. ఆఫ్కోర్సు అధికార పక్షంలో ఉన్న వారికి ప్రభుత్వ అధికార యంత్రాఅంగం అదనపు బలం.
అయితే నాయకులు వీటికి తోడు మరిన్నికొత్త మార్గాలు కనిపెట్టారు. “బురఖా వేసుకున్న ముస్లిం మహిళలను, మిగిలిన మహిళలకు ముసుగులు వేసి వారి ద్వారా డబ్బును సురక్షితంగా గమ్యస్థానం చేర్చడం కొత్త ఎత్తుగడగా ఉంది. ఒక్కొక్కరి ద్వారా ఒక సారికి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు తరలిస్తున్నారనేది సమాచారం.”
పంపిణీ విధానం
“శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు” అన్నది నానుడి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ఎన్ని రూల్స్ పెట్టినా నాయకులు వాటిని అధిగమించడానికి అనేక కొత్త మార్గాలను (ప్రతి ఎన్నికలలో) కనిపెడుతూనే ఉన్నారు.
ఈ ఎన్నికలలో కూడా ఎన్నికల కమీషన్ రూల్స్ ను అధిగమించడానికి పార్టీలు, అభ్యర్థులు విన్నూత్న మార్గాలు అన్వేషిస్తున్నారని, అమలు చేస్తున్నారని పార్టీల కార్యకర్తలు అంటున్నారు.
నాయకులు తాము తరలించిన డబ్బును పోలింగ్ బూతు వారీగా కట్టలు కట్టి మండలాల వారీగా నాయకులకు చేర్చడం, వారి నుండి ఓటర్లకు చేర్చడానికి అన్ని పార్టీలు (నిఘా వర్గాలకు దొరకకుండా) పటిష్ట పంపిణీ వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నారు. అయితే నాయకులు, వారి అనుచరులు ఓటర్లకు డబ్బు అందచేయడానికి కొత్త సాంకేతిక మార్గాలను కూడా ఎంచుకున్నారనేది కొత్తగా వినిపిస్తున్న సమాచారం.
ఓటర్లకు తమ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు అందించడం, (ఫలితం తేలడానికి సమయం ఉంది కాబట్టి) ఎన్నికల తర్వాత వారికి డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకోవడం, ఓటర్ల అకౌంట్లు తీసుకుని అస్మదీయుల అకౌంట్ల నుండి బదిలీ చేయడం, ఫోన్ పే , గూగుల్ పే లాంటి వ్యవస్థల ద్వారా చెల్లించడం లాంటి విన్నూత్న మార్గాలు అనుసరిస్తున్నారట. ఈ ఎన్నికలలో ఇంకెన్ని విచిత్రాలు చూస్తామో చెప్పలేము.
అందుతున్న సమాచారం మేరకు టీడీపీ అభ్యర్థులకు చేరవలసిన నిధులు ఎపుడో గమ్యస్థానాలు చేరుకోగా, వైస్సార్ కాంగ్రెస్ నిధులు ఇంకా కొన్ని ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉందట. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నఈ ఎన్నికలలో రెండు ప్రధాన ప్రత్యర్ధులు వెదజల్లుతున్న డబ్బు లెక్కలు జన సామాన్యం చెపుతుంటే నోరు వెళ్ళపెట్టవలసి వస్తున్నది.
(కొంతమంది అభ్యర్థులతో,నాయకులతో, అధికారులతో, మాజీ అధికారులతో, జర్నిలిస్టులతో మాట్లాడి సేకరించిన సమాచారం మేరకు చేసిన విశ్లేషణ ఇది)
(ఫీచర్ ఫోటో scroll.in సౌజన్యం)