చంద్రబాబుపై కేసిఆర్ పరోక్ష పొగడ్తలు… ఎందుకబ్బా?

తాజా తెలుగు రాజకీయాల్లో రెండు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, కేసిఆర్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దుకుని అమరావతి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య వైరం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలవేళ చంద్రబాబు ఇక్కడ చక్రం తిప్పే ప్రయత్నం చేసి చేయికాల్చుకున్నారు. చంద్రబాబు ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే కేసిఆర్ మైండ్ గేమ్ తో తెలంగాణ జనాలను మరోసారి ఏకం చేసి ఓట్లు వేయించుకున్నారు.
అదే సమయంలో ఎపి రాజకీయాల్లో వేలు పెడతామంటూ కేసిఆర్ తనయుడు కేటిఆర్ హెచ్చరించారు. ఎపిలో చక్రం తిప్పుతామని, బాబును ఓడిస్తామని కేసిఆర్ కూడా మాట్లాడారు. ఆ వ్యవహారం పీక్ స్టేజీకి వెళ్లింది.
ఆ సమయంలో జగన్ కోసమే కేసిఆర్, కేటిఆర్ ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారని టిడిపి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జగన్ ను ఎపిలో గెలిపించాలనుకున్న టిఆర్ఎస్ నేతలు అంతిమంగా తమ చర్యల వల్ల బాబుకు లబ్ధి చేకూరుతుందేమో అనుకున్నారు.
తర్వాత ఎపి రాజకీయాలను పట్టించుకోబోమని, మా పని మాకే ఉందంటూ వెనకడుగు వేశారు.
అయినప్పటికీ టిఆర్ఎస్ గతంలో చేసిన రాజకీయాలను చంద్రబాబు ఇప్పుడు ఏపిలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట కేసిఆర్ అంటూ ఆంధ్రా ప్రజలను సెంటిమెంట్ రూపంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక సెంటిమెంట్ తో కేసిఆర్ ఏరకంగా ఓట్ల రాబట్టుకున్నారో… అదే బాటలో బాబు కూడా సెంటిమెంట్ రగిలించేందుకు కుస్తీ పడుతున్నారు.
ఇదిలా ఉంటే గడచిన ఐదేళ్లుగా చంద్రబాబుకు, కేసిఆర్ కు మాటల యుద్ధమే సాగింది. చంద్రబాబు సూటిగా విమర్శలు చేస్తే… కేసిఆర్ మాత్రం తీవ్రమైన భాషలో బూతులు కురిపించారు.
నాలుగేళ్లపాటు మోదీ సంకనాకిండు చంద్రబాబు అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ముందస్తు ఎన్నికల్లో తారా స్థాయికి చేరిన ఈ మాటల యుద్ధం ఇప్పుడు ఆంధ్రాలో జగన్ కు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో కొద్దిగా టిఆర్ఎస్ నేతలు వెనుకడుగు వేసినట్లు కనబడుతున్నది.
అయినా బాబు అక్కడ రెచ్చిపోతూ… రెచ్చగొడుతూ ఉన్నారు.
ఇంతలో ఏమైందో ఏమో కానీ కేసిఆర్ కంప్లీట్ వాయిస్ మార్చేశారు.
అదీ ఖమ్మం గడ్డ మీద సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబుకు ఒక ప్రశంస కురిపించారు. చంద్రబాబు చేసిన ఏ పనీ కేసిఆర్ కు నచ్చదు.
దేశంలో ఎవరినైనా కేసిఆర్ పొగుడుతారు కానీ… చంద్రబాబును మాత్రం ఒక్కవిషయంలోనూ పొడిగేందుకు ఇష్టపడరు.
నిజానికి రాజకీయ చతురతలో చంద్రబాబును కేసిఆర్ మించిపోయారన్నది జగమెరిగిన సత్యమే. కానీ గురువారం ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబుపై కేసిఆర్ చేసిన ఒక ప్రశంస ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఆంధ్రాలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి డెల్టాలో నీటి సమస్యను చంద్రబాబు పరిష్కరించారని, ఆ తరహాలోనే ఖమ్మం జిల్లాకు మేలు చేకూర్చే సీతారామ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఖమ్మం జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తామని కేసిఆర్ కామెంట్ చేశారు.
చంద్రబాబును ఈ సందర్భంగా కొద్ది మోతాదులో  ప్రశంసించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇది పరోక్ష ప్రశంసే కావొచ్చు కానీ… కేసిఆర్ ఎందుకు అలా ప్రస్తావించారన్నదానిపై అనేకరకాల చర్చలు సాగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో కొద్దోగొప్పో టిడిపి ఇంకా మిగిలి ఉంది. ఆ పార్టీకి మొన్నటి ముందస్తు ఎన్నికల్లోనూ ఖమ్మంలోనే రెండు సీట్లు వచ్చాయి. వాటిలో ఒక ఎమ్మెల్యే టిఆర్ఎస్ గూటికి చేరతానని ప్రకటించారు.
అయితే ఖమ్మంలో సాంప్రదాయ టిడిపి ఓటుబ్యాంకును సైతం తనవైపు తిప్పుకునేందుకు ఖమ్మం గడ్డమీద కేసిఆర్ ఒక మాట చంద్రబాబుపై పరోక్ష ప్రశంస కురిపించి ఉంటాడేమో అన్న చర్చ కూడా ఉంది.
అదే సందర్భంలో ఎపిలో జగన్ కు ప్రత్యక్షంగా మద్దతిస్తున్నారు కేసిఆర్. మరి ఈ చిన్నపాటి ప్రశంస అయినా జగన్ శిబిరంలో ఆందోళన కలిగించేదే అని అంటున్నారు.
నిజానికి ఆంధ్రాలో తాగునీటికోసం, సాగునీటికోసం అల్లాడుతున్న ప్రాంతం రాయలసీమ. రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఇంకా కరువు కరాళనృత్యం చేస్తూనే ఉన్నది. అటువంటి రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయంలో డెల్టాకు మూడోపంటకు నీరిచ్చేందుకు చంద్రబాబు సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టిందనే విమర్శ ఉంది.
ఒక్క పంటకే దిక్కులేని సీమ గురించి కాకుండా డెల్టాకు మూడో పంటకు నీరిచ్చే పట్టిసీమను చేపట్టడం వెనుక కమిషన్ల బాగోతమే అని వైసిపి గతం నుంచీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పట్టిసీమను కట్టిన రీతిలోనే ఖమ్మం ప్రజల కోసం సీతారామ ప్రాజెక్టు పూర్తిచేస్తానంటూ కేసిఆర్ పరోక్ష పొగడ్తలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఈ సంచలన వార్త చదవండి…

https://trendingtelugunews.com/sexual-harassment-case-filed-against-lakshmiparvathi/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *