కేంద్రం అసలు పట్టించుకోని ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినందుకు తెలుగుదేశంలో చేరాను -ఉక్కు ప్రవీణ్
గత నాలుగు సంవత్సరాలుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని ఉక్కు ఉద్యమాన్ని నడిపిన ‘స్టీల్ ప్లాంట్ సాధన సమితి’ అధ్యక్షుడు డాక్టర్ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేడు అమరావతిలో ముఖ్యమంత్రి గారి నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తనెందుకు టిడిపిలో చేరాల్సి వచ్చిందో చెప్పారు.
‘ఉక్కు ఫ్యాక్టరీ ఎవరైతే ఇస్తారో ఆ పార్టీలోకి వెళ్తామని గతంలో చెప్పడం జరిగింది. మా ఉక్కు సైనికుల ఆదేశం మేరకు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు.
ప్రవీణ్ పట్టుదలతో యువకులను విద్యార్థులను సమీకరించి ప్రొద్దుటూరు కేంద్రంగా ఉక్కు ఉద్యమం నడిపినందుకు ముఖ్యమంత్రి అభినందించారు.
ఉక్కు పోరాటం అభినందించదగిందని, ఫ్యాక్టరీ తప్పకు పూర్తవుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఉద్యమంలాగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కూడా కష్టపడి పనిచేయమని సలహా ఇచ్చారు.
భవిష్యత్తులో పార్టీలో ప్రవీణ్ కు సముచిత స్థానం కల్పిస్తామని కూడాచెప్పారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఉక్కు ఉద్యమ సభలలో ఎవరైతే ఉక్కు పరిశ్రమను ఇస్తారో ఆ పార్టీ కండువా నా భుజాన వేసుకుని ఆ పార్టీ కోసం శ్రమిస్తానని ఏదైతే మాట చెప్పానొ అదే మాటకు కట్టుబడి ఉక్కు సైనికుల ఆదేశంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ప్రవీణ్ తో పాటు తాళ్లమాపురం ఓబులరెడ్డి, శ్రీనివాస్ నగర్ కుళాయిరెడ్డి, నాదెండ్ల షరీఫ్ లు కూడా చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.