ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబును మరో భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆయనకు చెక్ బౌన్స్ కేసులో ఒక ఏడాది జైలు శిక్ష, సుమారు 41 లక్షలు జరిమానా విధిస్తు తీర్పునిచ్చింది ఎర్రమంజిల్ కోర్టు. జరిమానా చెల్లించని యెడల మరో మూడు నెలలు జైలు శిక్ష పొడిగించాలని సూచించింది. కాగా ఈ కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు.
ప్రస్తుతం ఈ కేసుతో సతమవుతున్న మోహన్ బాబుకి మరో తలనొప్పి ఎదురైంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు మోహన్ బాబు. మార్చి 26 నుండి తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెదిరింపు కాల్స్ వలన తమ కుటుంబ సభ్యులు కలవర పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశాలకు చెందిన సిమ్ ల నుండి కాల్స్ వస్తున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు. ఈ కేసులో తదుపరి చర్యల కోసం న్యాయ సలహా కొరకు లీగల్ సెల్ కు ఫిర్యాదును పంపించారు. త్వరలోనే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మోహన్ బాబుకు హామీ ఇచ్చారు బంజారా హిల్స్ పోలీసులు.
ఇటీవలే మోహన్ బాబు తమకు చెందిన విద్యానికేతన్ విద్యాసంస్థలకు టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించట్లేదని విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా చేశారు. ఆ సందర్భంగా పలువురు ఎన్నారైలు విదేశాలలో మీ విద్యాసంస్థల కోసం మా దగ్గర కలెక్ట్ చేసిన ఫండ్స్ ఏం చేసారో లెక్కలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్స్ కూడా విదేశాలలో ఉంటున్న టీడీపీ సానుభూతిపరుల దుశ్చర్యే అంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మోహన్ బాబు వైసీపీలో చేరి, చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా మోహన్ బాబుకి కోర్టు విధించిన శిక్ష వలన ప్రజల్లో పరువు పోయిందని, ఆ డ్యామేజీని కవర్ చేసుకోవడానికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్న తెలంగాణ పోలీసులతో కలిసి మోహన్ బాబు కొత్త డ్రామాకి తెరలేపారంటూ టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. లేదంటే వరం రోజుల నుండి బెదిరింపు కాల్స్ వస్తుంటే తీరిగ్గా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమేంటని ఎద్దేవా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/congress-sravan-spews-fire-on-trs-mp-candidates/