ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తి కరంగా మారేందుకు కారణం, ముఖ్య మంత్రి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తూ ఉండటం.
జగన్ కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిల ఉదృతంగా ప్రచారంచేస్తున్నారు. వారు రోడ్ షోలలో పాల్గొన్ని ప్రజలనుద్దేశంచి ప్రసంగిస్తున్నారు. వాళ్లకిది కొత్త కాదు. చాలా కాలంగా విజయమ్మ, షర్మిలా ఏదో ఒక రూపంలో రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నారు.
అయితే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రం ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఇదే ప్రథమం.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ భార్య వసంధర బాగా ప్రచారం చేస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయన భార్య భువనేశ్వరి మొత్తం ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
టిడిపికి వామపక్షాల్లాగా చాలా అంకిత భావం ఉన్న కార్యకర్తలున్నారు. భువనేశ్వరి వీరికి సూచనలిస్తు ప్రచారం సజావుగా సాగే లా చూస్తున్నారు.ఈ విషయంలో ఆమె భర్త నారా చంద్రబాబునాయుడు లాగే కార్యకర్తల సైన్యంతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని, వాళ్లతో నేరుగా మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ సారి ముఖ్యమంత్రి గెలుపులో భువనేశ్వరి క్రెడిట్ ఉంటుందని నియోజకవర్గంలో బాగా టాక్ ఉంది.
చంద్రబాబునాయుడిని ఈ ఎన్నికల్లో రికార్డు మెుజారిటీతో గెలిపించాలని ఆమె కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. దీనికోసం కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి లాగే ఆమె కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో దాదాపు 2 వేల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సారి చంద్రబాబు నాయుడు డిస్టింక్షన్ తో గెలివాలని, ఆయన 75 శాతం ఓట్లు పడేలా చూడాలని ఆమె సూచనలిచ్చారు.
2014 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడికి 62 శాతం వోట్లు (1,02,952 ) వచ్చాయి. ఆయన మీద ఓడిపోయిన వైసిసి అభ్యర్థి చంద్రమౌళికి 33.81 శాతం ( 55,381) ఓట్లు పోలయ్యాయి.
ఈ సారి కూడా వైసిసి మాజీ ఐఎఎస్ అధికారి అయిన చంద్రమౌళినే అభ్యర్థిగా ప్రకటించింది.
నాలుగేళ్ల చంద్రబాబు పాలన, కుప్పానికి అందిన ప్రయోజనాలు చూపి ఈ సారి రికార్డు మెజార్జీ తెప్పించేందుకు భువనేశ్వరి కృషి చేస్తున్నారు. అందుకే కార్యకర్తలకు 75 శాతం వోట్లు టార్గెట్ పెట్టారు.
ఇది చాలా పెద్ద టార్గెట్. 2009 లో చంద్రబాబునాయుడికి 61.91 శాతం అంటే 89,952 ఓట్లు మాత్రం వచ్చాయి. 2004 లో 69 శాతం వచ్చాయి. 1999 లో మాత్రం 74.42 శాతం (93,288) ఓట్లు పోలయ్యాయి. ఇదే రికార్డు. దీనిని అధిగమింపచేసేందుకు భువనేశ్వరి కార్యకర్తలలో ఉత్సాహంనింపుతూ టెలికాన్ఫరెన్స్లలో మాట్లాడుతున్నారు.
తమాషా ఏమిటంటే, చంద్రమౌళీ తరఫున కూడా ఆయన భార్య ప్రచారం చేస్తున్నారు.