సంచలనం సృష్టించిన ఎక్స్ ప్రెస్ టివి ఎండీ జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల పై సస్పెన్షన్ వేటు పడింది. రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేసిన తర్వాత దానిని హత్యగా తప్పించి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దీని కోసం ముగ్గురు పోలీసుల సహాయం తీసుకున్నట్టు తేలింది.
అసలు రాకేష్ కు దానిని ప్రమాదంగా చిత్రీకరించాలన్న ఆలోచన ఇచ్చిందే పోలీసులుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్ పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబులు దీనికి సహాకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిని వీఆర్ లో ఉంచారు.
వీరి పై ఆధారాలు రుజువు కావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ రెడ్డితో వీరు ఆర్థిక లావాదేవీలు కూడా జరిపినట్టు విచారణలో బయటపడింది. రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిలు కలిసి జయరాంను హత్య చేశారని ముందుగా అంతా భావించినా శిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. దీంతో జయరాం భార్య శిఖా చౌదరకి పై ఫిర్యాదు చేశారు. పోలీసుల సస్పెన్షన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.