మల్కాజ్ గిరిలో ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీల నుంచి అభ్యర్ధులు బరిలో నిలిచినా కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యే పోటాపోటి నెలకొంది. కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో నిలవగా, టిఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటిలో ఉన్నారు.
మంగళవారం నాడు “ది టైమ్స్ ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధుల ఓపెన్ డిబెట్ ఏర్పాటు చేశారు. హోటల్ పార్క సోమాజీగూడలో దీనిని నిర్వహించారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి తో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డి అపాయింట్ మెంట్ ను నాలుగు రోజుల క్రితమే సంస్థ వారు తీసుకున్నారు. కానీ దీనికి మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. బిజెపి నుంచి పోటి చేస్తున్న రామచంద్రారావు హాజరయ్యారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ మల్లారెడ్డి అల్లుడు. రాజశేఖర్ రెడ్డి వ్యాపారం చేస్తుంటారు. అతనికి టిఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను కేటాయించింది. అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. దేశంలోనే అతి పెద్దదైన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తుంటారు. దాదాపు ఇక్కడ అంతా కూడా అక్షరాస్యత కలిగిన వారే ఉన్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆచితూచి పట్టం కడుతారనే పేరుంది. దీంతో రేవంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్యనే పోటి బలంగా ఉంది.
మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేదని, ప్రశ్నలకు సమాధానం చెప్పలేననే నిర్ణయంతోనే ఆయన గైర్హాజరు అయ్యారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. గతంలో తన మామ, ప్రస్తుత మంత్రి మల్లారెడ్డే ఎంపీ గా పని చేయడంతో అతను చేసిన అభివృద్ది ఏం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే మర్రి రాలేదని నేతలు విమర్శించారు.
ఏదైమైనా ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూకు ప్రధాన పార్టీ అభ్యర్ధి రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం ఎల్ బీ నగర్ స్టేడియంలో సీఎం సభ జరగాల్సి ఉండే. కానీ నేతల సమన్వయం లేకపోవడంతో ప్రజలను తరలించలేకపోయారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పోలేదని సమాచారం.
అదే రోజు మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. దానికి తండోపతండాలుగా జనం వచ్చారని కాంగ్రెస్ నేతలన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి రాకపోవడంతో మల్కాజ్ గిరిలో టిఆర్ఎస్ వెనక్కు తగ్గిందని రేవంత్ విజయమే ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. టిఆర్ఎస్ చేసిన అభివృద్ది లేదు కాబట్టే ఏం చెప్పాలో తెలియకే మర్రి రాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరి దీని పై మర్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.