(బివి మూర్తి)
బెంగుళూరు: నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండ్య జిల్లాలో జిల్లా పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె యాలక్కి గౌడను ఎన్నికల సంఘం బదలీ చేసింది. గౌడ స్థానంలో వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్ అవినాష్ మీనన్ రాజేంద్రన్ ను జడ్ పి సిఇవోగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
దివంగత కన్నడ హీరో అంబరీష్ సతీమణి సుమలత, జెడి (ఎస్) అభ్యర్థి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామి గౌడల మధ్య మండ్య లోక్ సభ స్థానానికై జరుగుతున్న ముఖాముఖీ సమరం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడంతో దేశంలో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది.
అధికార దుర్వినియోగానికీ, అక్రమాలకు తావు లేని రీతిలో, అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉన్న ఎన్నికల సంఘం రాష్ట్రాధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదిస్తూ వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుమలత ఫిర్యాదుపై ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు తక్షణం స్పందించడం గత వారం రోజుల్లోనే ఇది రెండో సంఘటన.
నిఖిల్ నామినేషన్ పత్రాలు అసమగ్రంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కుమారుడైనందున నియమాలను తుంగలో తొక్కి నిఖిల్ నామినేషన్ ఆమోదించారంటూ జిల్లా ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి (జిల్లాధికారి, డిప్యూటీ కమిషనర్) మంజుశ్రీ పై రెండు రోజుల క్రితం సుమలత ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి (సిఇవో) సంజీవ్ కుమార్ ఆగమేఘాలపై మండ్య వచ్చి, దీనిపై విచారణ జరపడం, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించవలసిందిగా రీజినల్ కమిషనర్ టి అనిల్ కుమార్ ను ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా మంజుశ్రీపై అవసరమైతే చర్యలు తీసుకుంటారు.
బదలీ వేటు పడిన యాలక్కి గౌడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కమిటీ అధినేతగా, వోటర్లను చైతన్యపరిచే స్వీప్ (సిస్టమాటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టోరల్ పార్టిసిపేషన్) జిల్లా ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించే వారు. నిఖిల్ గౌడ వర్గం ఎన్నికల ప్రచార పర్వంలో నియమోల్లంఘనకు పాల్పడుతున్నదనీ, అయినా అధికారులెవరూ పట్టించుకోడం లేదని సుమలత ఆరోపించారు. దీంతో యాలక్కి గౌడపై బదలీ వేటు పడింది.