నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎర్రజొన్న, పసుపు రైతులు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఏకంగా 178 మంది ఎంపీ బరిలో నిలిచారు. ఇలా అత్యధికంగా బరిలో నిలిచి తమ సమస్యను దేశ వ్యాప్తంగా తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు.
నిజామాబాద్ లో మొత్తం 185 బరిలో నిలిచారు. అందులో 7 గురు పార్టీల అభ్యర్దులు కాగా 178 మంది రైతులే. కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ, టిఆర్ఎస్ నుంచి కవిత, బిజెపి నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలని, బ్యాలెట్ పేపర్ మీదుగానే ఎన్నికలు నిర్వహించాలని రైతు ఎంపీ అభ్యర్ధులు డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించి వారు ఎన్నికల అధికారి ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. పోటిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్ధి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
“ఎన్నికల నియమావళిని రిటర్నింగ్ అధికారి ఉల్లంఘిస్తున్నారు. పోటిలో ఉన్నవారిలో చాలా మంది వ్యవసాయం చేసే వారు. వారికి ఎలక్షన్ల మీద అవగాహన లేదు. 185 మంది అభ్యర్ధులు బరిలో ఉంటే 178 మంది రైతులే. అందులో చాలా మందికి చదువు రాదు. ఎన్నికల్లో ఎలా నడుచుకోవాలో తెలియదు. వాటిని రిటర్నింగ్ అధికారి పోటి చేస్తున్న అభ్యర్దులకు తెలియజేయాలి. కానీ ఇప్పటి వరకు చేయలేదు.
బ్యాలెట్ పేపర్లా లేక ఈవీఎంల అనే దాని పై కూడా స్పష్టత లేదు. ఈవీఎంలే అని పేపర్లో చదివాం. గుర్తులు కూడా కేటాయించామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మాకు సింబల్స్ అందివ్వలేదు. ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయి. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. అలా అయితేనే మాకు న్యాయం జరుగుతది.
ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలి. దీని పై ఎన్నికల అధికారి ఆమ్రపాలికి ఫిర్యాదు చేశాం. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. పోటిలో ఉన్న అభ్యర్దులకు ఇంత వరకు రిటర్నింగ్ అధికారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.
పోటిలో ఉన్న వారందరికి నియమ నిబంధనలు చెప్పాలి కానీ చెప్పలేదు. నిజామాబాద్ రిటర్నింగ్ అధికారి పై ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ఎన్నికల వాయిదా కోసం హైకోర్టుకు వెళుతాం. దీని పై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించాలి.” అని పోటిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్ధి అన్నారు.