(యనమల నాగిరెడ్డి)
తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించనున్నారని, కుప్పం ఓటర్లు ఈ ఎన్నికలలో కూడా ఆయనకే పట్టం కట్టనున్నారని, అక్కడి పరిస్థితులు చూస్తే తెలిసిపోతుంది.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్. అధికారి ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రి పాలు కావడం, చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి సుబ్రహ్మణ్యం రెడ్డి టీడీపీకి మద్దతు పలుకుతుండటం, హంద్రీ- నీవా నీళ్లను (చట్టపరంగా హక్కులేని నీళ్ళే అయినా) కుప్పానికి తరలించడం, చంద్రబాబుకు వ్యక్తిగతంగా నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, బాబు హయాంలో నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి వంటి అనేక అంశాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి.
దీనికి తోడు ఈ ఎన్నికలను చంద్రబాబు భార్య శ్రీమతి భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించడం బాబు గెలుపుకు అదనపు బలంగా మారింది.
నియోజకవర్గంలో నలుగురితో మాట్లాడినా, ఒక చిన్న రౌండలా తిరిగొచ్చినా ఈ నాడి అట్టే తెలిసిపోతుంది.
కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో 206 గ్రామాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,126 మంది ఓటర్లుండగా అందులో 1,07,587 మంది పురుషులు కాగా 105539 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు.
ఈ నియోజకవర్గం 1985 నుండి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. 1985లో తెలుగుదేశం అభ్యర్థి రంగస్వామినాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ తర్వాత 1989 నుండి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 1989,19194, 1999,2004,2009,2014 ఎన్నికలలో గెలుపొందారు. ఇందులో ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను, 2014లో వైస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ప్రత్యర్థి చంద్రమౌళీని చంద్రబాబు 47వేల భారీ మెజారిటీతో ఓడించారు.
కుప్పంలో చంద్రబాబు గెలుపు నల్లేరుపై నడకే !
మొదటిసారి 1989 ఎన్నికలలో కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన చంద్రబాబు ఆ తర్వాత ఎపుడు తిరిగి చూడలేదు. పోటీ చేసిన ప్రతి ఎన్నికలో సుమారు 50 వేల ఓట్ల మెజారిటీ తోనే గెలుస్తూ వచ్చారు. 2014లో జరిగిన ఎన్నికలలో కూడా ఆయన 47 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
1989 తర్వాత ఆయన ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగానే మార్చుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు కోటను బ్రద్దలు కొట్టడానికి రాజశేఖర్ రెడ్డితో సహా ఆయన ప్రత్యర్ధులు ఎన్ని సార్లు ప్రయత్నించినా విజయం సాధించలేక పోయారు.
ప్రస్తుతం చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితానికి “చావో రేవో “గా మారిన ఈ ఎన్నికలలో కుప్పం ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పట్టడానికి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించడం వల్ల టీడీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతోను, ధైర్యంతోనూ పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
చంద్రబాబును మూడు ఎన్నికలలో ఢీకొని ఓడిపోయిన మాజీ కాంగ్రెస్ నేత సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా పని చేయడం తో ఆ పార్టీ మరింత బలపడిందని చెప్పక తప్పదు. ఇకపోతే హంద్రీ-నీవా నీళ్లు కేవలం చంద్రబాబు వల్లనే వచ్చాయని, బాబు అధికారంలో ఉంటేనే తమకు ఆ నీళ్ళు శాశ్వతంగా రాగలవని కూడా ప్రజలు అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పై వైస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి చంద్రమౌళి 2014 ఎన్నికలలోకూడా 47 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే గత ఎన్నికల అనుభవ నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికలలో చాలా ముందుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లె పల్లె తిరగడంతో పాటు, ఇంటింటి ప్రచారంలో కూడా ముందున్నారు.
చంద్రబాబు పై గెలుపు కష్టమైనా, బాబు మెజారిటీనైనా భారీగా తగ్గించాలని, వీలయితే చంద్రబాబును నియోజకవర్గానికి పరిమితం చేయాలన్న ఆలోచనతో చంద్రమౌళి తీవ్రంగా కృషిచేశారు.
ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలు కావడంతో కార్యకర్తలు కొంత నిరాశకు గురయ్యారు. ఆయన తరపున ఆయన భార్య ప్రచారం చేస్తున్నా కార్యకర్తలు అంత ఉత్సాహంగా పని చేయడంలేదని వినిపిస్తున్నది.
చంద్రబాబు కున్న అధికార బలం, ధనబలం, జన బలం ముందు చంద్రమౌళి ఎంత పోరాడినా చంద్రబాబు గెలుపు ఖాయమని కుప్పం ప్రజలు ఢంకా భజాయిస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు స్థానంలో గెలుపుకు సంజీవినిగా మారిన కుప్పం మెజారిటీ.
ఇకపోతే, గతంలో చిత్తూరు పార్లమెంటు స్థానానికి 1989 నుండి జరిగిన ఎనిమిది ఎన్నికలలో రెండు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలువగా మిగిలిన ఆరు ఎన్నికలలో కూడా టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కుప్పం, పలమనేరు, చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, నగిరి, చంద్రగిరి ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి.
1989, 91 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఆరు ఎన్నికలలో కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఈ ఆరు ఎన్నికలలో కూడా టీడీపీ అభ్యర్థులు గెలవడానికి కుప్పంలో వచ్చిన మెజారిటీనే కారణం.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో కూడా కుప్పంలో టీడీపీకి దక్కే మెజారిటీనే చిత్తూరు పార్లమెంటు స్థానంలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనుంది. కుప్పం మినహా మిగిలిన ఆరు శాసనసభ స్థానాలలో వైస్సార్ టీడీపీ ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటమే కారణంగా ఉంది.