ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గతపోరు బయపటపడుతోంది. భగ్గుమంటున్న ఎండలకి ధీటుగా నేతల వర్గపోరు కూడా భగ్గుమంటోంది. రోజురోజుకి పెరిగిపోతున్న వర్గపోరు పార్టీల అధినేతలకు తల నొప్పిగా మారింది. తరగత కుమ్ములాటలు బట్టబయలైతే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, తద్వారా పార్టీకి నష్టం వాటిల్లుతుందని వారు భయపడుతున్నారు.
గ్రూపులుగా తయారైన సమ్మతి, అసమ్మతి వర్గాలు… గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయకుండా ఒకరి ఎదుగుదలను అణచాలని చేస్తున్న ప్రయత్నాలు సదరు నియోజకవర్గంలో పార్టీ ఓటమికి దారి తీసేలా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.
ఎంపీ బుట్టా రేణుక, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ నియోజకవర్గంలో బుట్టా రేణుక ప్రచారం చేయడానికి వీల్లేదంటూ చెన్నకేశవరెడ్డి తేల్చి చెప్పారు. ఆయన తీరును తప్పుబడుతున్నారు బుట్టా అభిమానులు, కుర్ణి చేనేత కార్మికులు. తమ సామజిక వర్గానికి చెందిన రేణుకను అవమానించారంటూ మండిపడుతున్నారు.
ప్రచారానికి రేణుకను ఎందుకు ఆహ్వానించలేదని బుట్టా వర్గం కేశవరెడ్డిని ప్రశ్నించగా ఆయన ఈవిధంగా స్పందించారు. ఎంపీగా గెలిచాక ఐదేళ్ళలో ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం పైసా ఖర్చు చేయలేదని, నాగులదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుని గజం సిమెంటు రోడ్డు కూడా వేయించలేకపోయారని, ఆమెను ఎందుకు పిలవాలంటూ నిలదీశారు కేశవరెడ్డి.
కాగా రేణుక వర్గీయులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మా సామాజిక వర్గానికి చెందిన నేతను అవమానిస్తారా అంటూ చేనేత కమ్యూనిటీ కేశవరెడ్డిని దుయ్యబడుతోంది. ఎమ్మిగనూరులో రేణుక బలమైన నాయకురాలిగా ఎదుగుతారన్న భయంతోనే బీసీ మహిళా ప్రతినిధి, స్వపార్టీ నేత అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని, కేశవరెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేస్తామని బుట్టా వర్గం సవాల్ విసురుతోంది.
ఎమ్మిగనూరులో సుమారు 90,000 వేల మంది చేనేత ఓటర్లు ఉన్నారు. వీరంతా కేశవరెడ్డిని వ్యతిరేకిస్తే నియోజకవర్గంలో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కర్నూలు జిల్లా వైసీపీ శ్రేణులు కలవర చెందుతున్నారు. జిల్లా ముఖ్య నేతలు ఈ విషయంపై ఇద్దరు నేతలని సముదాయించే పనిలో ఉన్నారు. తీరు మార్చుకోకపోతే పార్టీ అధినేత జగన్ దృష్టికి వ్యవహారం వెళుతుందని, తర్వాత మీకే నష్టం అని పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/shg-women-join-ysrc-in-gudivada-constituency-kodali-nani/