లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశామని, ఈ మ్యానిఫెస్టో కోసం సంవత్సరం క్రితం నుంచి కసరత్తు చేశామని రాహుల్ గాంధీ అన్నారు. సోనియా గాంధీ, సీనియర్ నేతల సమక్షంలో రాహుల్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెడుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు.
మ్యానిఫెస్టోలో ఉన్న ప్రధానాంశాలు ఇవే…
– పేదలకు కనీసం ఆదాయ హామీ పథకం
– నిరుపేద కుటుంబాలకు ప్రతి ఏటా రూ.72 వేల ఆర్ధిక సహాయం
– రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్.. రైల్వే బడ్జెట్ తరహాలో బడ్జెట్
– ఏడాదిలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 22లక్షల ఖాళీలు.. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల కల్పన
– ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు
– విద్యారంగానికి బడ్జెట్ లో ఆరు శాతం నిధులు
– ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ
– యువతకు మూడేళ్ల పాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే వెసులుబాటు
రుణాలు చెల్లించని రైతుల పై క్రిమినల్ చర్యలు తీసుకోమన్నారు. వ్యాపారులు దోచుకోని దేశం విడిచిపోతున్నారని రైతులు మాత్రం జైళ్లకు పోతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు సరైన గౌరవం కల్పిస్తామన్నారు.
ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్థానంలో 2.0 జీఎస్టీని అమలు చేస్తామన్నారు. తాను ప్రధాని అయ్యే అంశం ప్రజలపైనే ఆధారపడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పూర్తిగా ప్రజారంజకంగా ఉందని, ఇది అన్ని వర్గాల వారిని అకట్టుకుంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని, రాహుల్ ప్రధాని పీఠం పై కూర్చుంటారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.