మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం తన ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్నారు. అల్లపూర్ నుంచి రోడ్ షో ప్రారంభించారు రేవంత్. ఇక్కడ మైనార్టీలను ఉద్దేశించి ఉర్దూలో ప్రసంగించారు.
మైనార్టీలకు వ్యతిరేకిగా ఉన్న మోదీని పక్కనపెట్టాలంటే మైనార్టీ సోదరులంతా రాహుల్ గాంధీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఓటేస్తే లాభమో మైనార్టీలు ఆలోచించాలని కోరారు. మోదీ, కేసిఆర్, జగన్ ముగ్గురూ దోస్తులే అని రేవంత్ ఆరోపించారు. ఈ ముగ్గురు మిత్రులలో ఎవరికి ఓటేసినా దేశం, రాష్ట్రం వెనక్కుపోవడం ఖాయమన్నారు.
టిఆర్ఎస్ కు ఓటేస్తే బిజేపికి ఓటేసినట్లే అని హెచ్చరించారు. మైనార్టీల కోసం టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఏ అర్ధరాత్రి వచ్చినా మీ సమస్యలు పరిష్కరిస్తానని మైనార్టీలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసిఆర్ చేసిన అవినీతి చిట్టా మొత్తం మోదీ దగ్గర ఉందని, అందుకే కేసిఆర్ బిజెపికి మద్దతిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు.
మల్కాజిగిరిలో టిఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డిని గెలిపిస్తే వ్యాపారాలు చూసుకోవడానికే సమయం సరిపోతుంది తప్ప జనాల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండబోదన్నారు. ఎవరు ప్రజా సేవ చేస్తారో బేరీజు వేసుకుని ఓటు వేయాలని రేవంత్ విన్నవించారు.
ప్రశ్నించే గొంతుక కు ఓటేస్తారా? నిత్యం వ్యాపారాలు చేసుకునే వ్యక్తికి ఓటేస్తారో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు ఆరువేల చొప్పున సంవత్సరానికి 72వేల రూపాయలు నిరుపేదల అకౌంట్ లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.
మల్కాజిగిరి జనాలు తనకు ఓటేస్తే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ముందుకు రావాలని సూచించారు.
అంతకుముందు కుత్బుల్లాపూర్ లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. భారీ ర్యాలీ జరిపారు.
ఈ ట్రెండింగ్ స్పెషల్ స్టోరీ కూడా చదవండి
https://trendingtelugunews.com/new-tensions-for-trs-party/