రాయలసీమ అభివృద్ధికి రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించేలాగా రాయలసీమ ప్రజానీకం చాకచక్యంగా వ్యవహరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులుబొజ్జా దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు..
నంద్యాల లోని స్థానిక పద్మావతీ నగర్ సివి నాయుడు కాంప్లెక్స్ శ్రీ పప్పూరి రామాచార్యుల ప్రాంగణంలో రాయలసీమ నుంచి వచ్చిన వివిధ సంఘాల నాయకులు, రైతులతో ” సిద్దేశ్వర అలుగు సాధన సమితి ” సమావేశం జరిగింది. ఇందులో బొజ్జా దశరథరామిరెడ్డి గారి ఉపన్యాసం చేశారు. వివిరాలు:
మంచి అనుకూల వాతావరణ పరిస్థితులు, సారవంతమైన భుమి, సుమారు 1000 శతకోటి ఘణపుటడుగుల నీరు తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల ద్వారా రాయలసీమ గుండా ప్రవహించడం, అన్నింటికి మించి కష్టపడి పనిచేసే స్వభావం గల రైతాంగం, రైతు కూలీలు రాయలసీమలో ఉన్నప్పటికి ఈ ప్రాంతం వెనకబడి ఉంది. దీనికి రాజకీయ పార్టీల బాధ్యతా రాహిత్యమే కాదు రాయలసీమ ప్రజల చైతన్య రాహిత్యం కూడా ప్రధాన కారణమని చెప్పుకోవాలి.
(రాయలసీమ సమావేశం ఫోటో గ్యాలరీ)
ఈ విషయాలను గ్రహించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని సభ్య సమాజం ముందుంచాలన్న లక్ష్యంతో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపనలో వేలాదిగ రాయలసీమ రైతాంగం, ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. పాలకుల నిర్బంధాలను శాంతియుతంగా ఎదిరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలిసిందే. దీనితో ఆగక గత 3 సంవత్సరాలుగా రాయలసీమ సమస్యలు పట్ల రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అదే పరంపరలో 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు “సిద్దేశ్వరం అలుగు సాధన సమావేశం” ఏర్పాటు చేపట్టడమైనది.
ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను హృదయపూర్వకంగా ఆహ్వానించి, రాయలసీమ అభివృద్ధికి ప్రధానమైన అంశాల(కింద వివరించిన)పై తమ పార్టీ విధానాలను స్పష్టపరచి, రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీర్చేడానికి చేపట్టబోయే కార్యాచరణను ప్రకటించమని కోరడమైనది.రాయలసీమ సమస్యలు :
1. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం
2. రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్ధ నీటి హక్కు
3. రాయలసీమలో రాజధాని/హైకోర్టు (ఇది ముగిసిన అంశం కాదు)
4. బుందేల్ కండ్ ప్యాకేజి కింద ప్రత్యేక రాయలసీమ ఇరిగేషన్ కమీషన్
5. రాయలసీమ యువతకు సమాన ఉద్యోగావకాశాలు (సెక్రెటరియేట్, రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో)
6. రాయలసీమ అభివృద్ధి : కడప ఉక్కు కర్మాగారం, రాయలసీమలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, గుంతకల్లు రైల్వే జోన్, AIMS, రాయలసీమలో అదనంగా మరో 6 జిల్లాల ఏర్పాటు, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనేక రాష్ట్ర స్థాయి APSSCA, APSDC లాంటి సంస్థలు ఏర్పాటు, హార్టికల్చర్ కమీషనరేట్, మైనింగ్, దేవాదాయ, ఇ ఎన్ సి (ఇరిగేషన్) తదతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు రాయలసీమలో ఏర్పాటు.
7. సుస్థిర వ్యవసాయం : రైతులు, కౌలు రైతులు గౌరవప్రదంగా జీవించడానికి, లాభసాటి ధరలు, కొనుగోలు, రుణాలు, పంటల బీమా తదితర అంశాలపై విధానాలు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు తమ తమ రాజ్యాధికారం కోసం పక్క రాష్ట్రాలతో వైషమ్యాలు సృష్టించే లాగా మాట్లాడం మానేయాలని, రాయలసీమ అభివృద్ధి సంభందించిన అంశాలపై భాద్యత యుతంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇదే సందర్భంలో రాయలసీమ రైతాంగం, ప్రజలు కూడా తమ తమ గ్రూపు రాజకీయాలకు దూరంగా, ఎలాంటి వైషమ్యాలు లేకుండా, రాయలసీమ అభివృద్ధికి సానుకూలంగా, నిర్దిఫ్ట ప్రతిపాదనలు చేసే రాజకీయ పార్టీలనే బలపరచమని విజ్ఞప్తి చేస్తున్నాము. రాయలసీమ అంశాల పట్ల ఏ రాజకీయ పార్టీ సానుకూలంగా స్పందించకపోతే “నోటా” కు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు కోసం మాట ఇచ్చి, రాయలసీమ అంశాలను విస్మరించకుండా ఉండటానికి, తగిన హామీ పత్రాలను వారి నుండి పొందడానికి మరియు ఇచ్చిన హామీలను విస్మరిస్తే రాజకీయ నాయకులను నిలదీయడానికి రాయలసీమ రైతాంగం, విద్యార్థులు, ప్రజలు సిద్దం కావాలని కోరుకుంటున్నాము.
రాయలసీమ అభివృద్ధికి తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎస్ పి వై రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి చింతా మోహన్ రావు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో.. ఇంటెలెక్చువల్ పోరం చిత్తూరు జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం నాయకులు అప్పిరెడ్డి హరినాథరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సంస్థ నాయకులు కల్కూర, ప్రముఖ వైద్యులు సురేంద్ర నాథ్ రెడ్డి, సామాజిక రాయలసీమ నాయకులు డాక్టర్ నాగన్న, ఆంద్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య కడప జిల్లా కార్యదర్శి పోలు కొండారెడ్డి, ఎపి రైతుసంఘం నాయకులు నరశింహులు, నందిరైతు సమాఖ్య అధ్యక్షులు ఉమా మహేశ్వర రెడ్డి, అనంతపురం జిల్లా సాధన సమితి నాయకులు, న్యాయవాది రామ్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు అరుణ్, ” ఆట్ల” నాయకులు ఆదినారాయణ రెడ్డి, రోడ్ల విస్తరణ ఉద్యమ నాయకులు, న్యాయవాది శంకరయ్య, వైసిపి ప్రతినిధి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, రాయలసీమ స్టూడెంట్ ఫోరం నాయకులు భాస్కర్, విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు రామచంద్ర రాజు, అనంతపురం జిల్లా సత్యసాయి రైతుసమాఖ్య నాయకులు రవి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు Y.N.రెడ్డి, రామచంద్రారెడ్డి, సుధాకర్ రావు నిట్టూరు, C.V. నాయుడు మరియు రాయలసీమ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.