ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంపీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు ఇక్కడ బంగారు గాజులు చేయిస్తడట…అట్లుంది ప్రధాని నరేంద్ర మోడీని వ్యవహారం అని ఆమె విమర్శించారు. శనివారం బోదన్ నియోజక వర్గంలోని నవీపేటలో ఎన్నికల బహిరంగ సభలో ఎంపి కవిత మాట్లాడారు.
మన రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా 1 వేయి రూపాయల పెన్షన్ ఇస్తున్నాం.. ఇందులో కేంద్రం రెండు వందల రూపాయలను 4 లక్షల మందికి ఇస్తున్నది. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ అనేక సార్లు చెప్పారన్నారు. అయితే బిజెపి నేతలు ఉల్టా ప్రచారం చేస్తున్నారని 800 వాళ్లే ఇస్తున్నారట..గుజరాత్ లో రూ. 750 రూపాయలు ఇచ్చే మోడి మనకు 800 ఇస్తడట. గిట్లున్నది బిజెపి నేతల యవ్వారం..అంటూ ఎంపి కవిత విమర్శించారు.
గత ఎన్నికల్లో బయట దేశాల్లో నల్లధనం ఉంది. మీ అకౌంట్లలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారు..ఎవరికయినా వేశారా..ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు. పైసలు లేనోళ్ల అకౌంట్లలో రూ. 15 వేలు ఎలక్షన్లలోపు వేస్తారట. ఐదేళ్లలో 15 లక్షలు వేయనోళ్లు ఇప్పుడు 15 వేలు వేస్తరని నమ్మాలట. ఇట్ల ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడే నాయకుల మాటలను నమ్మోద్దని కోరారు. ఏ ఎన్నికయినా కారు గుర్తుకు ఓటేయాలని ఎంపి కవిత కోరారు.
సొంత జాగా ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు. జాగా లేని వారికి రెండేళ్లలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టడం ప్రారంభిస్తాం..వచ్చే ఐదేళ్లలో నాకు ఇళ్లు లేదని చెప్పే పరిస్థితి రాకుండా చేస్తామన్నారు.
రైతు బందు ద్వారా రైతులకు మేలు చేశాం…భూమి లేని వారికి బిసిలకు వంద శాతం సబ్సిడీతో రూ.50 వేలు ఇప్పిస్తామని చెప్పారు.రైతన్నలు పండించే పంటను డ్వాక్రా మహిళలకు ఇస్తే వారు ఉత్పత్తులను మార్కెట్ చేస్తారు. అలా వారికి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
పెన్షన్ పొందేందుకు వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించిందని, ఓంటరి మహిళలకూ పెన్షన్, పిఎఫ్ కార్డులున్నవారికి పెన్షన్, మే 1 నుంచి రెండు వేలు పెన్సన్‌గా వస్తుందని తెలిపారు. వికలాంగులకూ పెన్షన్ పెంచుకున్నామని కవిత చెప్పారు. వీరందరి గురించి ఎవరయినా ఆలోచించారా..ఇంతకు ముందు అని ప్రశ్నించారు.
లండన్, దుబాయ్, అమెరికా పోయి వచ్చిన మనోళ్లు ఆ దేశాల మాదిరిగా రోడ్లు ఇతర సౌకర్యాలు మనకూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ..ఐదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది…70 ఏళ్లయినా దేశం అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు.
తెలంగాణ మాదిరిగా దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 16 మంది టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులను గెలిపించడం వల్ల కేంద్రంలో ఎవరుండాలో నిర్ణయించే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే మన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్నారు ఎంపి కవిత.
మన సభలను చూసి కాంగ్రెస్, బిజెపి నాయకులు భయపడుతున్నారు. దిక్కుతోచక అబద్ధాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యువత అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోదన్ ఎమ్మెల్యే షకీల్ ఆమిర్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, గంగాధర్ పట్వారీ, దాస్, అమర్ నాథ్ బాబు, గిర్దావర్ గంగారెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ న్యూస్ చదవండి…
https://trendingtelugunews.com/rani-rudrama-reaction-on-mlc-election-lost/