బహుజన సమాజ్ వాద్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ నేతలు టిఆర్ఎస్ లో చేరారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ లోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా కమిటీ నేతలంతా ఎంపి కవిత సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. వారిని కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భీమ్ రావ్ గైక్వాడ్, ప్రధాన కార్యదర్శి మొత్కు ముత్తన్న, ఉపాధ్యక్షులు ఎర్ర యాదగిరి, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీ, కార్యదర్శి అంబీర్ బోజారావు,కోశాధికారి నిథాన్యెల్, మాజీ జిల్లా అధ్యక్షురాలు తక్షశీల గైక్వాడ్, ఇసి మెంబర్లు సలావుద్దీన్, బ్యాగరి ప్రసాద్ లు టిఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణ ఆడపడుచు ఎంపి కవితని గెలిపించి, అభివృద్ది నిరోధకులు, కుట్రదారులకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. టిఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ అధ్యక్షుడు గైక్వాడ్ మాట్లాడుతూ మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్, టిడిపి లు తమ పబ్బం గడుపుకున్నాయని ఆయన విమర్శించారు. బిజెపి సైతం అదే పని చేస్తోందన్నారు.
దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ దళిత భాందవుడన్నారు. మాల, మాదిగలను ఏకం చేసిన ఎంపి కవితని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గైక్వాడ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.