కేసీఆర్ కు ఊహించని షాక్: హైద్రాబాద్ సభ రద్దు (వీడియోలు)

తెలంగాణ సిఎం కేసిఆర్ మలిదశ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని మిర్యాలగూడ సభతో శుక్రవారం ప్రారంభించారు. మిర్యాలగూడలో జరిగిన సభలో గులాబీ పార్టీ ఆశించిన రీతిలో జనాలు హాజరు కాలేదు. మిర్యాలగూడ సభలో కేసిఆర్ అటు కేంద్రంలోని బిజెపిని, ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీని కడిగిపారేశారు. ఆ సభ అనంతరం కేసిఆర్ నేరుగా హైదరాబాద్ వచ్చి ఎల్బీ స్టేడియంలో సభకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఎల్బీ స్టేడియంలో సభకు జనాలు రాలేదు. పట్టుమని 5వేల మంది కూడా జనం లేకపోవడంతో కేసిఆర్ సభను రద్దు చేసుకున్నారు.
ఎల్ బీ స్టేడియంలో జరగాల్సిన టిఆర్ఎస్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అసలు జనమే లేక సభ వెలవెలబోయింది. దీంతో సభను రద్దు చేసుకున్నారు గులాబీ బాస్. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంటు స్థానాలకు కలిపి బహిరంగ సభను శుక్రవారం సాయంత్రం టిఆర్ఎస్ నిర్వహించ తలపెట్టింది. కానీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించినంతగా జనం రాలేదు.
మిర్యాలగూడ సభను ముగించుకుని హెలిక్యాప్టర్ లో బయలుదేరిన కేసిఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఎల్బీ స్టేడియం సభను పరిశీలించారు. కానీ జనాలు లేక వెలవెలబోయిందని గ్రహించారు. దీంతో వెంటనే కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకుని నేరుగా ప్రగతి భవన్ వెళ్లిపోయారు.
సీఎం రావడం లేదని తెలుసుకున్న నాయకులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నికల వేళ రాజధానిలో ఏర్పాటు చేసిన సభకు జనాలను తరలించడంలో విఫలమైన మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ యాదవ్ పోటీలో ఉన్నారు.  వీరంతా కలిసికట్టుగా లేకపోవడంతో ఈ లోపం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల నుంచి సయితం జనాలను తరలించడంలో పార్టీ నేతలు అవస్థలు పడ్డారు. అయితే సిఎం కేసిఆర్ హైదరాబాద్ సభకు 6.30 గంటల వరకు చేరుకోకపోవడంతో అప్పటికే వచ్చిన మహిళలంతా తిరిగి వెనుదిరిగినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎల్ బీ స్టేడియం సభలో జనాలు లేక వెలవెల బోయిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/rani-rudrama-reaction-on-mlc-election-lost/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *