(బి వెంకటేశ్వర మూర్తి)
కోల్కతా: ఇక్కడి ఇడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లెవెన్ పై కోల్కతా నైట్ రైడర్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాట్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేయగా పంజాబ్ లక్ష్య ఛేదనలో విఫలమై ఓవర్ల కోటా పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రెండు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టడమే గాక ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడి 17 బంతుల్లో 48 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.
బ్యాటింగ్ కు అనుకూలమైన ఇడెన్ గార్డెన్స్ పిచ్ పై గేల్, రాహుల్, మిల్లర్, అగర్వాల్ వంటి హేమాహేమీలున్న జట్టుకు 200 పైబడిన స్కోరు ఛేదించడం అసాధ్యమేమీ కాదు గానీ ఈ మ్యాచ్ లో మొదటి పది ఓవర్లలో ఓ మంచి భాగస్వామ్యం రాకపోవడం పంజాబ్ జట్టుకు విఘాతంగా పరిణమించింది. ఇటీవల ఫార్మ్ కోల్పోయి పరుగుల కోసం మొగం వాచిన రాహుల్ మరో సారి విఫలమయ్యాడు. ఒకే ఒక్క పరుగు చేసి ఫెర్గూసన్ బంతిని కుల్ దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి రెండో ఓవర్ లో వెనుదిరిగాడు. ఆపత్సమయాల్లో ఒత్తిడులు తట్టుకుంటూ భారీ స్కోరులు చేయడం గేల్ కు చేత కాదన్న అపప్రథ ఈ పోటీలోనూ కొనసాగింది. 13 బంతుల్లో రెండేసి ఫోర్లు, సిక్స్ లు కొట్టి 20 పరుగులు చేసిన గేల్ ను అతను పూర్తి స్థాయి విధ్వంసక మూడ్ లోకి రాకముందే రసెల్ ఒడుపుగా అవుట్ చేశాడు. గేల్ మిడాన్ లో ప్రసిధ్ క్రిష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.
తర్వాత వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ సైతం ఎక్కువ సేపు నిలవలేదు. అతను 13 పరుగులకు అవుటయ్యేసరికి పంజాబ్ స్కోరు 7 ఓవర్లలో 60 పరుగులు. సర్ఫ రాజ్ ను కూడా రసెలే అవుట్ చేశాడు. మాయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్ కలిసి నాలుగో వికెట్ కు 70 పరుగులు జత చేశారు. వీరి భాగస్వామ్యం ఇంకో రెండు మూడు ఓవర్లు కొనసాగి ఉంటే పంజాబ్ ఆశలు చిగురించేవేమో గానీ అలా జరగలేదు. 34 బంతుల్లో 6 బౌండరీలు, ఓ సిక్స్ తో 58 పరుగులు చేసిన మాయాంక్, పరుగుల వేగం పెంచి తీరాల్సిన దశలో పీయూష్ చావ్లా బంతిని భారీ షాట్ ఆడబోయి బౌల్ అయ్యాడు. ఆ సరికి 15. 2 ఓవర్లలో పంజాబ్ 134 పరుగులు చేసింది. చివరి దశలో మిల్లర్ (59- 40బంతుల్లో), మన్ దీప్ సింగ్ (33- 15 బంతుల్లో) ధాటిగా ఆడినప్పటికీ లక్ష్యం తలకు మించిన భారమైంది.
కోల్కతా ఇన్నింగ్స్ ఆద్యంతాల్లో ఇద్దరు విండీస్ యోధులు నరైన్, ఆండ్రీ రసెల్ ల మెరుపు విన్యాసాలు భారీ స్కోరుకు దోహదం చేశాయి. మధ్యలో రాబిన్ ఊతప్ప, నితీష్ రానాలు మూడో వికెట్ కు 11 ఓవర్లలో 110 పరుగులు జత చేశారు.
ఐపిఎల్ లో ఆరంగ్రేటం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కోల్కతా ఓపెనర్ సునీల్ నరైన్ తొలి ఓవర్ లోనే చుక్కలు చూపించాడు. క్యారం బాల్, లెగ్ కటర్ లను లెగ్ స్పిన్ లో కలగలిపి బ్యాట్స్ మన్ ని ముప్పతిప్పలు పెట్టగలడని విఖ్యాతి పొందిన చక్రవర్తిని పంజాబ్ మేనేజ్ మెంట్ రూ. 8.4 కోట్ల భారీ మూల్యం చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. అయితే ఈ కాస్ట్ లీ బౌలర్ వేసిన తొలి ఓవర్ జట్టుకు చాలా కాస్ట్ లీ ఓవర్ గా పరిణమించింది. తొలి ఓవర్ లో అతను మొత్తం 25 పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి బంతిపై లిన్ సింగిల్ తీసుకోగా రెండో బంతిని నరైన్ లాంగాఫ్ పై సిక్స్ కొట్టాడు. మూడో బంతిపై నరైన్ అవుట్ కావాల్సిందే గానీ ప్రచండవేగంతో దూసుకొచ్చిన షాట్ కు చక్రవర్తి చేయి అడ్డు వేశాడే తప్ప క్యాచ్ పట్టుకోలేక పోయాడు. ఆ షాట్ పై రెండు పరుగులు వచ్చాయి. తర్వాతి బంతి నరైన్ ప్రహారంతో మిడ్ వికెట్ కు పారిపోయింది. ఐదు, ఆరో బంతులు మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్ పైన ఆకాశంలోకెగిరి మాయమయ్యాయి.
నరైన్ విధ్వంసక బ్యాటింగ్ చూసి స్ఫూర్తి పొందిన లిన్, షమీ వేసిన తర్వాతి ఓవర్ లో తనూ రెచ్చిపోయాడు. మొదటి, మూడో బంతులపై రెండు బౌండరీలు లాగించాడు. ఆ తర్వాతి బంతిపై మరింత భారీ షాట్ కొట్టబోయి, బంతిని మిడిల్ చేయలేక ఎక్స్ ట్రా కవర్ లో డేవిడ్ మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మూడో ఓవర్ లో లిన్ అవుటయ్యేసరికి కోల్కతా స్కోరు 34. స్కోరు 36 వద్ద ఉండగా నరైన్ కూడా అవుటై వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ హార్డస్ విల్జోయిన్ బంతిని నరైన్ కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ లోగానే 9 బంతుల్లో మూడు సిక్స్ లు, ఓ బౌండరీతో నరైన్ 24 పరుగులు చేశాడు.
ఓపెనర్ లిద్దరూ వెనుదిరిగాక ఊతప్ప, రానా ఒక వైపు వికెట్ రక్షించుకుంటూనే వీలు చిక్కినప్పడల్లా భారీ షాట్లు కొడుతూ వడివడిగా పరుగులు చేశారు. 34 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్ లతో 63 పరుగులు చేసిన రానా ఎట్టకేలకు చక్రవర్తి బంతిని అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి కోల్కతా స్కోరు 146. అటు తర్వాత రెండుమూడు ఓవర్లలో పరుగుల వేగం కాస్త తగ్గినట్టనిపించింది. అయితే 18, 19వ ఓవర్లలో ఆండ్రీ రసెల్ రెచ్చిపోయి పరుగుల కుంభవృష్టి కురిపించాడు. ఈ రెండు ఓవర్లలో 22 (ఆండ్రూ టై), 25 (షమి) వచ్చాయి. 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు చేసిన రసెల్ చివరి ఓవర్ లో అవుటయ్యాడు. ఊతప్ప 50 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్ లతో 67 పరుగులు చేసి అజేయంగా మిగిలాడు.