అంజన్ కుమార్ యాదవ్, దత్తాత్రేయ. ఒకరు కాంగ్రెస్ పార్టీ నేత మరొకరు తలపండిన బిజెపి నేత. వీరిద్దరు 2004 నుంచి సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటి పడ్డ నేతలు. వీరిలో రెండు సార్లు అంజన్ కుమార్ యాదవ్ ను విజయం వరించగా ఓ సారి దత్తాత్రేయను గెలుపు వాకిలి తట్టింది. అయితే ఈ సారి మాత్రం దత్తాత్రేయకు టికెట్ దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది. అది ఏంటో మీరే చదవండి.
అజాత శత్రువు,అందరి మిత్రుడు, పేదల పెన్నిధి మన బండారు దత్తాత్రయ మీద 2004 లోకసభ ఎన్నికలలో పోటీ చేసాడు మన అంజన్ కుమార్ యాదవ్. పాపం లోకంపోకడ తెలవని దత్తన్న ఎన్నికలలో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా దిగులుపడుతూ కూర్చున్నాడు.ఇంతలో బయట పెద్దగా కోలాహలం వినిపించింది. గుడికివెళ్ళి పూజ ముగించి నేరుగా మన దత్తన్న ఇంటికే వచ్చాడు అంజన్ కుమార్ యాదవ్. ప్రసాదం దత్తన్నకు అందించి , మోకాళ్ళ మీద చేతులు ఆనించి దండం పెట్టాడు.
అంజన్ కుమార్. తాను గెలిచినాననే సంతోషం కన్నా దత్తన్న ఓడిపోయినాడనే దుఃఖం అంజన్ కుమార్ మొఖం లో కొట్టొచ్చినట్లు కన్పించింది . “అన్నా,దేవుడు అసుంటి నువ్వు ఓడిపోయినావంటే, నాకు బాధ అయింది. అందుకే ముందు నీ ఆశీర్వాదం కోసం వచ్చిన” అని భక్తిప్రపత్తులతో మోకరిల్లాడు. దత్తన్న లేచి,అంజన్ కుమార్ ను సంతోషం తో కౌగిలించుకున్నాడు. తిరిగి 2009 లో దత్తన్న మళ్ళా ఓడిపోయినప్పుడు కూడా, గెలిచిన అంజన్ నేరుగా గుడినుంచి దత్తన్న ఇంటికి వెళ్లి కాళ్లకు దండంపెట్టి జనం లోకి వెళ్ళాడు.
బండారు దత్తన్న 2014 ఎన్నికలలో అంజన్ కుమార్ యాదవ్ మీద భారీమెజారిటీ తో లోకసభ కు ఎన్నికయ్యాడు. వందలాది అభిమానులు దండలతో దత్తన్నను ముంచెత్తుతున్నారు. అందరితోపాటు వరుసలో నిలబడి, దండతో సంతోషంగా పలకరించాడు మన అంజన్ కుమార్ యాదవ్. ఆశ్చర్యపోయిన దత్తన్న తేరుకునేలోగా , అంజన్ కుమార్ దత్తన్న కాళ్లకు దండం పెట్టాడు.
” నేను ఓడిపోయినాను అనే బాధ నాకు లేదు. ఋషి అసుంటి దత్తన్న గెలిచాడని సంతోషం కలిగింది. నేను గెలిచినా, దత్తన్న గెలిచినా ప్రజలకు మంచి జరుగుతుందనే భరోసా వున్నది ” అని తన్మయుడైనాడు మన అంజన్ కుమార్.సికింద్రాబాద్ అంటే “జో జీతా వోహీ సికందర్” కాదు. హార్నె పర్ బీ శరీఫ్ హీ సికందర్ . అదీ గంగా జమునా తహజీబ్ .