రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏప్రిల్ 11న జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కు కళ్లు బైర్లు కమ్మేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న ఉపాధ్యాయులు, పట్టభద్రులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
కేసీఆర్, కేటీఆర్ లు రాజు, యువరాజుల్లా తెలంగాణ తమ రాజ్యమైనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న వాళ్లు కుట్రలకు ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం భరించాల్సినంత కాలం భరించిందని, ఇక ఎంత మాత్రం భరించబోదని అన్నారు. ప్రశ్నించే గొంతుకకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు నాలుగో స్థానానికి పడిపోయారంటేనే ప్రభుత్వ పెద్దల అరాచకాలను ప్రజలు గుర్తించాలని అర్థమవుతోందన్నారు. ఈ ఫలితాలతో తెలంగాణకు మంచి రోజులు మొదలైనట్టేనన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి, ప్రజలు గెలిచారని రేవంత్ అభిప్రాయపడ్డారు. మల్కాజ్ గిరి బరిలో ఉన్న అభ్యర్థులను బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఎవరు ప్రజల పక్షాన పోరాడుతారు, ఎవరు ప్రజా సమస్యల పై చిత్తశుద్ధితో పని చేస్తారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వ్యాపారాలు ఉన్న వాళ్లకు ప్రజా సమస్యల పై మాట్లాడే తీరిక ఉండదన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా ఇప్పుడు అల్లుడిని తెచ్చి ప్రజల నెత్తిన రుద్దాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూశాక ఎంపీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయన్న నమ్మకం కలుగుతోందన్నారు.