ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్ లో మంగళవారం రాత్రి జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆరు వికెట్ల ఘన విజయం సాధించింది. ధోనీ సేనకు ప్రస్తుత ఐపిఎల్ లో ఇది వరుసగా ఇది రెండో విజయం.
టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ, స్పిన్ అనుకూలమైన పిచ్ పై ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. షేన్ వాట్సన్, రైనా, ధోనీ ధాటిగా ఆడటంతో చెన్నై 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 150 పరుగులు చేసింది.
ఇషాంత్ శర్మ వేసిన మూడో ఓవర్ లో అంబటి రాయుడు భారీ షాట్ కొట్టబోయి శ్రేయస్ అయ్యర్ కు మిడాఫ్ లో క్యాచ్ ఇచ్చాడు. అటు తర్వాత సురేష్ రైనా, షేన్ వాట్సన్ ఫాస్ట్ బౌలర్లను చితక్కొట్టుడు కొట్టసాగారు. దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా నాలుగో ఓవర్ బౌల్ చేసేందుకు రాగా వాట్సన్ అతన్ని ఓ చూపు చూశాడు. వచ్చీ రాగానే గంటకు 146 కిలోమీటర్ల వేగంతో రబడా రెచ్చిపోయాడు. నాలుగో బంతికి వేగం 149 కిలోమీటర్లకు పెరగ్గా అంతదాకా ఒక్క పరుగూ రాలేదు. ఐదో బంతిని వాట్సన్ ఒడుపుగా లెగ్ సైడ్ ఫ్లిక్ చేసి బౌండరీకి పంపాడు. ఆరో బంతిపై ఫైన్ లెగ్ లోకి సిక్స్ బాదాడు.
తర్వాతి ఓవర్ లో ఇషాంత్ శర్మపై ప్రతాపం చూపించడం రైనా వంతయింది. ఈ ఓవర్ లో గ్రౌండ్ నలు చెరగులా రైనా నాలుగు అద్భుతమైన బౌండరీలు కొట్టాడు. రైనా, వాట్సన్ ఆడుతుండగా స్కోరింగ్ రేటు పదికి పైగా కొనసాగింది.
ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరుగుల వేగం కట్టడి చేసేందుకై స్పిన్నర్లను రంగంలోకి దించాడు. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన తొలి ఓవర్ లోనే వాట్సన్ ను అవుట్ చేశాడు. రెండు భారీ సిక్సర్ లు కొట్టిన వాట్సన్, మూడో సారి మళ్లీ కొట్టబోయి బంతి మిస్సయ్యాడు. అతను తిరిగి చూసే లోగా పంత్ బెయిల్స్ పడగొట్టాడు. వాట్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లతో 44 పరుగులు చేశాడు. వాట్సన్ అవుటయ్యేసరికి చెన్నై స్కోరు 79 పరుగులు. స్కోరు 98 వద్ద ఉండగా 11వ ఓవర్ లో రైనా కూడా వెనుదిరిగాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ తో 30 పరుగులు చేసిన రైనా కూడా మిశ్రా బంతిపైనే పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
రైనా అవుటయ్యాక బ్యాటింగ్ కి దిగిన ధోనీ, కేదార్ జాదవ్ తో కలిసి నింపాదిగా పరుగులు జత చేస్తూ ఆడసాగారు. ధోనీ ఒకటి, రెండు పరుగులు తీస్తూ, ధోనీ….ధోనీ అని లయబద్ధంగా అరుస్తున్న ఢిల్లీ అభిమానులకు బిపి పెంచుతూ నింపాదిగా ఆడసాగాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 120 పరుగులు చేసింది. 18, 19వ ఓవర్ లలో ఓ ఫోర్, ఓ సిక్స్ చొప్పున కొట్టిన మిస్టర్ కూల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్ లో రెండు పరుగులు కావలసి ఉండగా, జాదవ్ అవుటైనప్పటికీ, బ్రేవో బౌండరీ కొట్టి స్కోరును లక్ష్యం దాటించాడు. 35 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ తో 32 పరుగులు చేసిన ధోనీ అజేయంగా మిగిలాడు.
అంతక్రితం టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. చెన్నై స్పిన్నర్లు మరో సారి దీటుగా బౌలింగ్ చేయగా, ఈ సారి డ్వేన్ బ్రేవో కీలకమైన వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బ తీశాడు. శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషభ్ పంత్ తప్ప మరెవ్వరూ పెద్దగా స్కోరు చేయలేక పోయారు. బ్యాటింగ్ కు పెద్దగా అనుకూలం కాని వికెట్ పై డ్వేన్ బ్రేవో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు.
ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతూ పరుగుల రథాన్ని ఉరకలెత్తిస్తున్న తరుణంలో పరుగులు కట్టడి చేసేందుకై నాలుగో ఓవర్ లో హర్భజన్ సింగ్ కు ధోనీ బౌలింగ్ ఇచ్చాడు. కానీ ఆ ఓవర్ లోనూ షా, ధావన్ చెరో ఫోర్ కొట్టారు. అయితే దీపక్ చహార్ వేసిన అయిదో ఓవర్ లో పృథ్వీ షా అవుటయ్యాడు. 16 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన షా మిడ్ వికెట్ లో షేన్ వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తొలి వికెట్ పడ్డాక పరుగుల వేగం తగ్గడంతో ఢిల్లీకి 50 పరుగులు చేసేందుకు ఎనిమిది ఓవర్లు పట్టింది. జట్టు స్కోరు 79 ఉండగా 12వ ఓవర్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. 20 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్ కొట్టిన అయ్యర్ 18 పరుగులు చేశాడు.
15 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 118. తర్వాతి రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. 16వ ఓవర్ రెండో బంతిపై బ్రేవో బౌలింగ్ లో రిషభ్ పంత్ శార్దూల్ ఠాకుర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్ 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ తో 25 పరుగులు చేశాడు. నాలుగో బంతిపై ఇన్ గ్రామ్ రైనాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కీమో పౌల్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. నాలుగు బంతులెదుర్కొని ఖాతా తెరవకుండానే జడేజా బంతిపై బౌల్ అయ్యాడు. 17వ ఓవర్ లోనే ధావన్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అటు తర్వాత మూడో బంతిపై అతను కూడా బ్రేవో బంతిని ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధావన్ 47 బంతుల్లో 51 పరుగులు చేయగా అందులో ఏడు బౌండరీలున్నాయి.