ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు షాక్ తగిలింది. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపర్చిన పీఆర్టీయూ అభ్యర్ధి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. ఆయన పై తెలంగాణ యూటిఎఫ్ అభ్యర్ధి అలుగుబెల్లి నర్సి రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలయ్యాయి. ఇందులో నర్సి రెడ్డికి 8976 ఓట్లు వచ్చాయి. పూల రవీందర్ కు 6279 ఓట్లు వచ్చాయి. 2697 ఓట్లతో నర్సిరెడ్డి విజయం సాధించారు.
నర్సిరెడ్డి విజయంతో వామపక్షాలు హర్షం వ్యక్తం చేశారు. నీతి నిజాయితి, అవినీతి కి జరిగిన ఎన్నికల్లో నీతి నిజాయితే గెలిచిందన్నారు. గత ఎన్నికల్లో పూల రవీందర్ టిఆర్ఎస్ అభ్యర్ధి వరదారెడ్డి పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రవీందర్ కు టిఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కానీ రవీందర్ విజయం సాధించలేకపోయారు. నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎన్నికలు అనూహ్య ఫలితాలనిచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం నర్సిరెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
“నా గెలుపు రాష్ట్రంలోని ఉపాధ్యాయ, అధ్యాపకుల గెలుపు. నాకు మద్దతిచ్చి అందరికి ధన్యవాదాలు. ఆర్నెల్లుగా శ్రమించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో ధ్వంసమైన విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి కృషి చేస్తాను. విద్య ప్రైవేటికరణను అడ్డుకుంటాను. తాను ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీగానే ఉంటాను కానీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించను. విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తాను.” అని నర్సిరెడ్డి అన్నారు.