హిందూపూర్ వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ సిఐ గోరంట్ల మాధవ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాధవ్ నామినేషన్ అడ్డుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేసింది. కానీ ఈ విషయంలో టీడీపీకి షాక్ తగిలింది అంటున్నారు వైసీపీ నేతలు. అధికార ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్ ను తిప్పికొడుతూ మాధవ్ నామినేషన్ కు అనుమతి లభించింది.
వైసీపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేస్తూ విఆరెస్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అధికారులు ఆయన దరఖాస్తుకు ఆమోదం ఇవ్వలేదు. దీనిపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు మాధవ్. అయితే గతంలో మాధవ్ కు విఆర్ఎస్ అనుమతిస్తూ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాలను పోలీసు పెద్దలు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
హైకోర్టు తీర్పు మాధవ్ కు అనుకూలంగా వచ్చింది. రాజకీయ కారణాలతో విఆరెస్ ను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది న్యాయస్థానం. ట్రిబ్యునల్ తీర్పును అనుసరిస్తూ వెంటనే మాధవ్ రాజీనామాను ఆమోదించాలని ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ కు రూట్ క్లియర్ అవడంతో గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత సోమవారం నామినేషన్ వేశారు.