జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏపీ ప్రజల్ని కొడుతున్నారని అనడం హాస్యాస్పదం అని సినీ నిర్మాత పోసాని కృష్ణ మురళి అన్నారు. పవన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. బాబు పపన్ కళ్యాణ్ అంటూ పోసాని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యల పై పోసాని స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
“కేసీఆర్ ని స్పూర్తిగా తీసుకోవాలన్నది పవన్ కళ్యాణ్. కేసీఆర్ ని ఉత్తమ సీఎం అన్నాడు. నాలుగు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉంది. తెలంగాణ లో ఉన్న ఆంధ్రా వారిని తెలంగాణ వారు ఎక్కడ కొట్టారు. పవన్ కళ్యాణ్ నిరూపించాలి.
స్పష్టమైన విధానంతో పార్టీని స్థాపించానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎటు వైపు వెళ్తున్నారో ఆలోచించుకోవాలి.1984 నుండి నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. తెలంగాణ నడిబొడ్డున ఆంధ్రా నాయకుడు ఎన్టీఆర్ చనిపోవడానికి ఆంధ్రా నాయకుడు చంద్రబాబు కారణం.
ఎమ్మార్వో వనజాక్షి పై దాడి జరిగితే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు వలలో పవన్ కల్యాణ్ చిక్కుకున్నారు. చేగువేరా ఆదర్శం అని చెప్పే పవన్ కళ్యాణ్ వెన్ను పోటు దారుడైన చంద్రబాబు దారిలో ఎలా నడుస్తారు. పవన్ కళ్యాణ్ లాగా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టె విధంగా జగన్ ఎప్పుడైనా మాట్లాడారా?
ఒక పార్టీకి నేతృత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం దారుణం. కేసీఆర్ బెదిరిస్తే ఆంధ్రాలో నాయకులు వైసీపీలోకి వెళ్లారంటే ఆంధ్రాలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు బెదిరించి టీడీపీ లోకి తీసుకెళ్లారా? ఆంధ్రా,తెలంగాణ ప్రజల మధ్య విభజన తేవద్దు.
నేను హైదరాబాద్ కి వచ్చి 34 సంవత్సరాలు అయింది. ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు.ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఓట్ల కోసం తెలంగాణ,ఆంధ్రా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.” అని పోసాని అన్నారు.