చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన జగన్

శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సభలో పలు కీలక హామీలను జగన్ ఇచ్చారు. అదే విధంగా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఉద్యోగాల విప్లవం సృష్టిస్తుందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందుకోసం ఏటా క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం చేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం నడిపే ఆర్టీసీ అద్దె బస్సులు, లీజు (అద్దె)కు తీసుకునే వాహనాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని, వారికి పెట్టుబడిలో రాయితీలు ఇస్తామని, వాటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు, యువతలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జననేత ప్రకటించారు.

ఇంకా గ్రామాల్లో 10 మందితో సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని, వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. వారందరి ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను పూర్తి పారదర్శకంగా డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందిస్తామని, దీర్ఘకాల వ్యాధితో బాధ పడుతున్న రోగులకు నెలకు రూ.10 వేల పింఛను ఇస్తామని జననేత తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు తరలి రావడంతో పట్టణంలో అంతులేని సందడి నెలకొంది.

3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో పలాస నియోజకవర్గం నుంచి సాగినప్పుడు ప్రజలందరి కష్టాలు, బాధలు విన్నానని.. అందుకే ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.

పలాసలో ‘టీఎస్టీ’

రాష్ట్రంలో, దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉండగా, పలాసలో తెలుగుదేశం పార్టీ పన్ను (టీఎస్టీ) కూడా ఉందని.. జీడిపప్పు ప్రతి ప్యాకెట్‌పై ఇక్కడి ఎమ్మెల్మే అల్లుడుకు రూ.10 పన్ను కడుతున్నారని.. వ్యాపారులపై వేధింపులు, వినకపోతే అధికారుల దాడుల గురించి విన్నానని జననేత తెలిపారు.

స్థానికంగా భావనపాడు పోర్టు వస్తుందన్న ఆనందంతో పాటు, దాని వల్ల తమకేం మేలు జరుగుతుందన్న ప్రశ్న కూడా అందరిలో చూశానని చెప్పారు. ఇంకా పోర్టుతో పాటు, మత్య్యకారులకు ఫిషింగ్‌ హార్బర్‌ కట్టాలని, పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పోర్టు కోసం సేకరించే భూమికి తక్కువ పరిహారం ఇస్తున్నారని అందరూ చెప్పిన ప్రతి బాధ విన్నానని తెలిపారు.

తిత్లి తుపాను బాధితులకు ఇప్పటీక పరిహారం అందలేదని, ఇచ్చిన చెక్కులు చెల్లలేదని, ఇంకా రెండో విడత పరిహారం అందలేదని, కొబ్బరి చెట్టుకు రూ.1500 పరిహారం తక్కువని, జీడి తోటలు హెక్టారుకు రూ.30 వేలు చాలా తక్కువ అని రైతులు చెప్పిన బాధలన్నీ కూడా గుర్తున్నాయని తెలిపారు.

కాబట్టి అధికారం చేపడితే తుపానులో నష్టపోయిన కొబ్బరిచెట్టకు రూ.3 వేలు, హెక్టారు జీడి తోటలకు రూ.50 వేలు ఇస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అదే విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులను చూశానని, వారికి ఈ ప్రభుత్వం ఏ మాత్రం మేలు చేయడం లేదని.. వేల మంది రోగుల్లో కేవలం 370 మందికే పింఛన్లు ఇస్తున్నారని, కిడ్నీ రోగులకు నెలకు దాదాపు రూ.8000 ఖర్చు అవుతుంటే, ప్రభుత్వం మాత్రం 370 మందికి ముష్టి వేసినట్లు రూ.2500 మాత్రమే ఇస్తోందని ఆవేదన చెందారు.

డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు వేల మంది ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే ఆస్పత్రిలో సేవలందుతున్నాయని, చాలా ఆస్పత్రులలో  నెఫ్రాలజిస్టులు లేరని చెప్పినప్పుడు ఆ గుండెకోత విన్నానని బాధ పడ్డారు.

అందుకే అధికారం చేపట్టిన వెంటనే మూడు నెలల్లో 200 బెడ్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం పనులు ప్రారంభించి కేవలం రెండేళ్లలో పూర్తి చేస్తామని, మంచి వైద్యులను నియమించి సేవలందిస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు.అదే విధంగా గ్రామాల్లో వ్యాధి ప్రారంభంలోనే చికిత్స అందేలా పరీక్షలు నిర్వహించి, వైద్య సహాయం చేస్తామని, ఇంకా దీర్ఘకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛను ఇస్తామని వెల్లడించారు.

మంచినీటి కాలుష్యం వల్లనే కిడ్నీ వ్యాధులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాబట్టి నీటి నాణ్యత పెంచి సరఫరా చేస్తామని, రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పారు.

5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశామని, మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయన్న ఆయన, చంద్రబాబు పదే పదే అభివృద్ధి చేశానంటాడని గుర్తు చేశారు. అయితే అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అని ప్రశ్నించిన జననేత,  నిన్నటి కంటే ఇవాళ సంతోషంగా ఉండడం, బాగుండడం అభివృద్ధి అని నిర్వచించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రైతుల రుణమాఫీ జరిగిందా? వారికి సున్నా వడ్డీ రుణాలు అందుతున్నాయా? అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ అయ్యాయా? వారికి సున్నా వడ్డీ రుణాలు వస్తున్నాయా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని గుర్తు చేశారు.

గ్రామాల్లో బెల్టు షాపులు రద్దు చేస్తానన్న చంద్రబాబు, తొలి సంతకం కూడా చేశాడని, కానీ ఆ షాపులు బంద్‌ అయ్యాయా? అని ప్రశ్నించారు. కాబట్టి ఒక్కసారి చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూడాలని, అభివృద్ధి అంటే ఏమిటి? ఈ 5 ఏళ్లలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని అడిగారు. అదే విధంగా  పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి భరోసాగా ఉన్నారా? పిల్లల చదువుకు  డబ్బులున్నాయా? అని ఆరా తీశారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారని గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్, అది అమలవుతోందా? అని ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచారం చేశారని, కానీ ఇవాళ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని.. జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా మారిందని చెప్పారు.

బాబు పాలనలో గత 5 ఏళ్లలో మీ చుట్టూ ఉన్న తమ్ముళ్లు, చెల్లెమ్మలను అడగాలని, ఉద్యోగాల కోసం అమరావతి వెళ్తున్నారా? లేక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్తున్నారా? అని తెలుసుకోవాలని కోరారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని గుర్తించారని, వాటిని భర్తీ చేస్తారని విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటూ ఎంతో ఖర్చు చేస్తున్నారని.. కానీ చంద్రబాబు వాటిని భర్తీ చేయకపోగా, మరోవైపు రిటైర్మెంట్‌ పోస్టులు కూడా భర్తీ చేయకపోవడంతో మొత్తం ఖాళీలు 2.40 లక్షలు దాటాయని చెప్పారు.

ఏపీలో ఏటా 5 లక్షల మంది ఎస్సెస్సీ, 4 లక్షల మంది ఇంటర్మీడియట్, 1.80 లక్షల మంది డిగ్రీ, లక్ష మందికి పైగా పీజీ పూర్తి చేస్తున్నారని, వారంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ భర్తీ చేయాలని కనీసం ఆలోచన చేయడం లేదని ఆక్షేపించారు.

ఏపీలో 1.70 కోట్ల ఇళ్లుండగా, వాటికి నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు అది ఇవ్వకపోగా, అంతో ఇంతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని అన్నారు.

సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ఎందరో నిరుద్యోగులను చూశానని, అందరి బాధలు విన్నానని, చూశానని, అందుకే అందరికీ భరోసా ఇస్తున్నానని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

‘రేపు మన ప్రభుత్వం ఏర్పడితే.. మీ అందరకి నేను భరోసా ఇస్తూ.. ప్రతి తల్లితండ్రి, ప్రతి విద్యార్థికి నేను చెబుతున్నాను. మీ పిల్లలు ఏ కోర్సు చదివినా, ఎంత ఫీజు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే. రేపు మన ప్రభుత్వం ఏర్పడితే.. చేసే మొట్టమొదటి పని.. రాష్ట్ర పరిధిలో ఖాళీగా ఉన్న దాదాపు 2.40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాను. ఏటా జనవరి 1న నోటిఫికేషన్లు, అందు కోసం క్యాలెండర్లు కూడా జారీ చేస్తాము’.

‘దీంతో పాటు, ఉద్యోగాల కల్పన కోసం విప్లవాత్మక మార్పు చేయబోతున్నాము. ఇవాళ అక్కడక్కడా పరిశ్రమలు ఏర్పడినా రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి. అందుకే అధికారం చేపడితే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం రూపొందించి, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తాము’.

‘ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌ పద్దతిలో ఇచ్చే ఉద్యోగాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు.. చాలా రూట్లలో ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నడిపే ఆర్టీసీ సర్వీసులు, అద్దెకు తీసుకునే వాహనాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తాము. వారికి పెట్టుబడుల్లో సబ్సిడీ కూడా ఇస్తాము. వాటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తాము’.

‘ఇంకా ప్రతి గ్రామంలో 10 మందితో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరో అడుగు ముందుకేసి గ్రామంలోని ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం. గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేసే ఆ గ్రామ వాలంటీర్లు.. ప్రతి ప్రభుత్వ పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు వచ్చేలా చేస్తారు. అంటే ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తారు. పింఛను, రేషన్‌ కార్డు, ఇల్లుతో పాటు, నవరత్నాలు పథకాల కోసం ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ అర్హులకు అందుతాయి. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లో వాటిని పరిష్కరిస్తారు’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తామని, హోదా వస్తే పన్నుల్లో రాయితీలు వస్తాయని, దాంతో పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. కాబట్టి ఆ హోదా కోసం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పారు.

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని, ఇంకా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా వారి కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి నైపుణ్యం పెంచుతామని ప్రకటించారు.

నవరత్నాలు

ఆ విధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న శ్రీ వైయస్‌ జగన్, అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా నవరత్నాలు ప్రకటించామని, ఆ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు పాలనలో ఏం చూశాం?

చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు చూశామని, చివరకు హత్యలు కూడా చేస్తున్నారని జననేత గుర్తు చేశారు. వారే హత్యలు చేస్తారని, ఆతర్వాత వారికి అనుకూలంగా ఉండే పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తారని, ఇంకా వాస్తవాలు వక్రీకరించేందుకు అనుకూల మీడియాలో ప్రచారం చేస్తారని ఆక్షేపించారు.

చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదని, అందుకే ఈ కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

అంతే కాకుండా గ్రామాలకు మూటల డబ్బు పంపిస్తాడని, ప్రతి ఓటుకు రూ.3 వేలు ఇస్తారని ఆరోపించారు.

కాబట్టి ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్లండి. ప్రతి అక్కా, ప్రతి చెల్లి, ప్రతి అవ్వా, తాత, ప్రతి సోదరుడు, రైతుకు చెప్పాలని కోరారు.

ఇవన్నీ చెప్పండి..

‘చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడితే అన్న సీఎం అవుతాడని, ఆ తర్వాత పిల్లలను ఎంత ఖర్చైనా సరే ఏ చదువైనా చదివిస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న రుణం మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారికే ఇస్తాడని చెప్పండి. అదే విధంగా వారికి సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తాడని చెప్పండి’.

‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు చెప్పండి. అన్న సీఎం అయితే, వైయస్సార్‌ చేయూత పథకం కింద రూ.75 వేల రూపాయలను నాలుగు దఫాల్లో అందిస్తాడని చెప్పండి.      గతంలో రాజన్న రాజ్యంలో మంచి రోజులు చూశామని, అన్న సీఎం అయితే మళ్లీ అలాంటి రోజులు వస్తాయని చెప్పండి’.

‘ప్రతి రైతుకు చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబు మోసపూరిత పాలన చూశామని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదని పూర్తిగా నష్టపోయామని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, అన్నను సీఎం చేసుకుంటే ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సహాయం అందుతుందని, ఆ విధంగా నాలుగేళ్లలో రూ.50 వేలు వస్తాయని చెప్పండి. అంతే కాకుండా ప్రతి పంటకు గ్యారెంటీగా గిట్టుబాటు ధర వస్తుందని చెప్పండి’.

‘అదే విధంగా ప్రతి అవ్వ దగ్గరకు వెళ్లండి. పింఛను గురించి వాకబు చేయండి. అప్పుడు చెప్పండి. ఒకవేళ ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న మాట ఇచ్చి ఉండకపోయి ఉంటే, మీకు ఆ రూ.2 వేల పింఛను వచ్చేదా? అని ప్రశ్నించండి. ఇప్పుడు అన్నను సీఎం చేసుకుంటే ఆ పింఛన్‌ ను క్రమంగా పెంచి రూ.3 వేలు చేస్తాడని చెప్పండి’.

‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే నవరత్నాలు పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి. వాటి గురించి అందరికీ వివరించండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీదిరి అప్పలరాజుతో పాటు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా స్వయంగా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ అభ్యర్థి ఉద్వేగం

సభలో అంతకు ముందు మాట్లాడిన ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ అంతులేని ఉద్వేగానికి లోనయ్యారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, అన్నీ పోగొట్టుకున్నానని, జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు తనను అష్టదిగ్భంధంలో ఉంచి బాధ పెట్టారని చెప్పారు. తనకు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వైయస్‌ జగన్‌కు ఎంతో రుణపడి ఉన్నానంటూ, దువ్వాడ శ్రీనివాస్‌ ఎంతో ఉద్వేగం చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *