(బి. వెంకటేశ్వరమూర్తి)
చెన్నై: చెన్నై స్పిన్నర్లను ఆడలేక అల్లాడిపోయిన రాయల్స్ ఛాలెంజర్స్ (ఆర్ సి) బెంగుళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. ఐపిఎల్ లో చెన్నైకి ఇది రెండవ అత్యల్ప స్కోరు. ఇది వరకు 2017లో కెకెఆర్ చేతిలో 49 కుప్పకూలిన చరిత్ర ఆర్ సి బిది.
ఐపిఎల్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభోత్సవ పటాటోపం లేకుండానే బెంగుళూరు -చెన్నై మ్యాచ్ ఆరంభమైంది. ప్రారంభోత్సవానికి అయ్యే ఖర్చును టెర్రరిస్టు దాడిలో మరణించిన సిఆర్ పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు సహాయంగా అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
భారత మాజీ తార హర్భజన్ వేసిన రెండో ఓవర్ లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులకే వెనుతిరగడంతో ఆర్ సి బి పతనం ప్రారంభమయింది. తర్వాత వచ్చిన మొయినలీ హర్భజన్ కే క్యాచ్ ఇచ్చి తొమ్మిది పరుగులకు ఆవుటయ్యాడు.
హర్భజన్ బౌల్ చేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్హ లో ఆర్ సి బి ఏకంగా రెండు వికెట్లు కోల్పోయింది. డివిలియర్స్ రెండో బంతిపై జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతక్రితం బంతికే డివిలియర్స్ కి లైఫ్ లభించింది. అతను కొట్టిన స్వీప్ షాట్ ని డీప్ స్క్వేర్ లెగ్ లో ఇమ్రాన్ తాహిర్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్ ని వదిలేశాడు. తర్వాతి బంతిపై మళ్లీ స్వీప్ కై ప్రయత్నిస్తే షాట్ సరిగా పడక మిడ్ వికెట్ లోకి క్యాచ్ లేచింది. ఈ సారి రవీంద్ర జడేజా ఎలాంటి పొరరపాటు చేయలేదు. ఇదే ఓవర్ ఆరో బంతిపై విండీస్ హార్డ్ హిటింగ్ బ్యాట్స్ మన్ హెట్మయర్ రనౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని ఆఫ్ సైడ్ లోకి ఆడిన హెట్మయర్ అతను సింగిల్ కోసం ముందుకు దూసుకెళ్లగా అటు వైపు పార్థివ్ పటేల్ నుంచి స్పందనే కరలవైంది. షార్ట్ మిడాఫ్ లో ముందుకు దూకి బంతి అందుకున్న సురేష్ రైనా అదే ఊపులో ధోనీకి అందించాడు. మెరుపు వేగంతో ధోనీ వికెట్లు పడగొట్టేసరికి హెట్మయర్ పదడుగుల దూరంలో మిగిలిపోయాడు. ఆ సరికి 8 ఓవర్లలో బెంగుళూరు జట్టు 39 పరుగులే చేసింది.
రైనా బౌల్ చేసిన తొమ్మిదో ఓవర్ లో ఆర్ సి బి ఆరు పరుగులు చేసింది. ఈ ఓవర్ లో వికెట్టేదీ పడకపోవడం విశేషం. పదో ఓవర్ లో ఇమ్రాన్ తాహిర్ శివమ్ దూబేను, 11 వ ఓవర్లో జడేజా గ్రాండ్ హోమ్ ను అవుట్ చేశారు. ఆ సరికి బెంగుళూరు స్కోరు 6 వికెట్లకు 50 పరుగులు.
(బి.వెంకటేశ్వరమూర్తి,సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగుళూరు)