స్వపక్షంలో ఉంటూ విపక్ష నాయకుడిలా విమర్శలు చేసే వ్యక్తి ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయనే కాదు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది కూడా ఇంచుమించు ఇదే తీరు. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఈసారి ఎన్నికల పోటీ నుండి వైదొలగి తమ వారసులను బరిలోకి దింపారు. కాగా శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ సందర్భంగా టీడీపీ హై కమాండ్ ఎంపిక చేసిన అభ్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నో కసరత్తులు చేసి ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేశారు జేసీ. గతంలోనే ఆయన 40 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని వారిని మార్చమని, లేదంటే గెలుపు కష్టతరంగా మారుతుందని చంద్రబాబుకు సూచించినట్టు తెలిపారు. టీడీపీ అధిష్టానం అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేశాక అభ్యర్థుల ఎంపికపై స్పందించిన ఆయన మరోసారి ఆయన గతంలో చెప్పిన మాటలు గుర్తు చేశారు.
40 శాతం ఎమ్మెల్యేలను మార్చాలని సీఎంకు సూచించానని, కానీ ఆయన మార్చలేదని అన్నారు. దీంతో గెలుపు కోసం కష్టపడాల్సి వస్తుందని విమర్శించారు. ఈమధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేల పని తీరు సరిగా లేదని, వారి వలన సీఎంకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చితే చంద్రబాబే సీఎం అని లేదంటే దేవుడే దిక్కని సంచలన కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి IPL 2019 Special
https://trendingtelugunews.com/punjab-kings-eleven-fate-latched-on-to-middle-order-ipl-2019/