కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ తెలంగాణ గ్రూపు 2 అభ్యర్ధులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గ్రూపు 2 మెరిట్ జాబితాలో పేరు ఉన్నప్పటికి ఫలితాలు వెలువడకపోవడంతో మానసిక క్షోభకు గురువుతున్నామన్నారు. రెండున్నరేళ్లుగా టిఎస్ పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తాము మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నామన్నారు. ఉద్యోగం రాక వేరే ఉద్యోగం చేయలేక అవమానాలకు గురయ్యామన్నారు. వీటన్నింటిని భరించలేక చావాలని నిర్ణయించుకున్నామని తాము చనిపోయేందుకు అనుమతివ్వాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. టిఎస్ పీఎస్సీ తమ జీవితాలతో ఆటలాడుతుందన్నారు. దీని పై గ్రూపు 2 అభ్యర్ధి ట్రెండింగ్ తెలుగుతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
“రెండున్నరేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఏం తెలియని వాళ్లను టిఎస్ పీఎస్సీలో పెట్టారు. మేం ఫలితాల కోసం మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. వేరే ఉద్యోగం చేయలేక దీనిని వదులుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రిపరేషన్ సమయాన కూడా ఇంత ఇబ్బంది పడలేదు. కానీ మా జాబు మేం పొందడానికి రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నాం.
అన్ని తప్పుల తడకగా నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని సరిచేయడానికి టిఎస్ పీఎస్సీకి చేతనైత లేదు. మా జీవితాలను బలి చేస్తున్నారు. వెంటనే సీఎం జోక్యం చేసుకొని దీనిని పరిష్కరించాలి. లేకపోతే మేం చస్తందుకు అనుమతివ్వాలి. ఏదో ఒకటి తేలాలి. మేం ఇంట్లో ముఖాలు చూపించని పరిస్థితిలో ఉన్నాం. రోడ్డు మీద కాలం వెల్లదీస్తున్నాం. అందుకే చివరిగా ఇక మాకు చచ్చేందుకు అనుమతివ్వాలని హెచ్ ఆర్సీని ఆశ్రయించాం. వెంటనే మాకు న్యాయం చేయాలని” ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.